సాక్షి, పుట్టపర్తి: హిందూపురంలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఎవరిని బరిలో దింపాలనే దానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాటలోనే టీడీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీసీ సామాజిక వర్గాల నుంచి పలువురు హిందూపురం పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఎవరికి వారు టీడీపీ పెద్దలను కలిసి లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. అయితే వీరిలో ఎవరిని బరిలో దింపినా...మిగతా వారితో ఇబ్బందే అన్న ఆలోచనతో టీడీపీ అధిష్టానం పునరాలోచిస్తోంది. హిందూపురం పార్లమెంటులో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, సొంత కేడర్ లేని వ్యక్తికి టికెట్ ఇస్తే అంతేసంగతులని ఆశావహులు అధిష్టానం వద్ద తమ అభిప్రాయం తెలిపినట్లు సమాచారం.
అందరి పరిస్థితీ అంతంతే..
హిందూపురం పార్లమెంటు సీటుకు టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్న వారిలో ఏ ఒక్కరికీ సొంత ఓటు బ్యాంకు లేదు. ప్రతి ఒక్కరూ పార్టీ బలంపై ఆధారపడాల్సిన పరిస్థితి. కనీసం వారి కులాల నుంచి కూడా సరైన మద్దతు లేదనేది స్పష్టం అవుతోంది. ఆయా కులాల ఓటు బ్యాంకు టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీకే బలంగా ఉండటం విశేషం. వైఎస్సార్ సీపీ గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు బీసీలకే ఇవ్వగా, ఈ సారి టీడీపీ తరఫున బోయ, కురుబ, చేనేత సామాజిక వర్గాల నేతలు హిందూపురం ఎంపీ సీటును ఆశిస్తున్నారు. అయితే ఆయా కులాలకు వైఎస్సార్‌సీపీ ఎనలేని గుర్తింపు ఇచ్చింది. నామినేటెడ్ పదవులతో పాటు రాజ్యాధికారం కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాల నుంచి ఒకరిద్దరు నాయకులు తప్ప ఓటర్లు ఎవరూ టీడీపీ వైపు మొగ్గుచూపడం లేదని అధిష్టానికి తెలిసిపోయింది. దీంతో వారికి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం ఒకటికి పదిసార్లు రహస్యంగా సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
నిమ్మల వర్సెస్ అంబికా..
2009లో కాంగ్రెస్ తరఫున హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అంబికా లక్ష్మీనారాయణ ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే టీడీపీ ఆయనకు ఇప్పటివరకు ఒకసారి కూడా టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన హిందూపురం ఎంపీ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బోయ సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణకు సొంత కులంలో బలం లేదని సమాచారం.
మరోవైపు బోయ సామాజిక వర్గంలో చాలా మంది వైఎస్సార్ సీపీ వెంట నడుస్తుండటం తెలిసిందే. ఇక నేసే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఎంపీ సీటుకు మరోసారి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. లేదంటే తనకు పెనుకొండ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను అధిష్టానం ముందు ఉంచినట్లు తెలిసింది. నిమ్మల కూడా ఆ సామాజిక వర్గంలో పెద్దగా ప్రభావం చూపించలేరని కార్యకర్తలే చెప్పుకుంటున్నారు.
రేసులో మరికొందరు..
హిందూపురం ఎంపీ స్థానం నుంచి అంబికా, నిమ్మలతో పాటు పుట్టపర్తికి చెందిన సామకోటి ఆదినారాయణ కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు పెనుకొండ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే కనీసం ఎంపీ సీటైనా ఇవ్వాలని ఇటు సవితమ్మ అటు బీకే పార్థసారథి కోరుతున్నట్లు తెలిసింది. అయితే అధిష్టానం నుంచి ఎవరికీ హామీ దక్కలేదని సమాచారం. బీసీ కులాల నుంచి సమర్థుడు దొరకడం లేదని పార్టీ పెద్దలు చర్చించుకున్నట్లు మరికొందరు ప్రచారం చేస్తున్నారు.
వెంటాడుతున్న ఓటమి భయం..
ఓటమి భయంతో కొందరు టీడీపీ నేతలు హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. టికెట్ రేసులో ఉన్నవారిలో ఒకరికి టికెట్ ఇస్తే మరోవర్గం అసమ్మతి వ్యక్తం చేయడం ఖాయంగా చెబుతున్నారు. గ్రూపు రాజకీయాలతో పోటీలో ఉన్న వారు బలి కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పురం’ ఎంపీ స్థానం నుంచి ఎవరిని బరిలో నిలపాలన్నది టీడీపీ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment