సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాహుల్‌గాంధీ ఎదురైన తొలి ఫలితాల్లో నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత వెలువడిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలైంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఊహించినదే అయినా.. మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో హస్తం ఓడినప్పటికీ.. గట్టిపోటీ ఇచ్చింది. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిపోటీ ఇవ్వడం.. అసెంబ్లీ సీట్లపరంగా కూడా మెరుగవ్వడం సానుకూల పరిణామమని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీకి ఇది శుభారంభమేనని చెప్తున్నారు.
అయితే, బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు మాత్రం రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు సంధిస్తున్నారు. ఆదిలోనే హంసపాదు అన్న తరహాలో రాహుల్‌కు ఆరంభంలోనే పరాజయాలు పలుకరించాయని ఎద్దేవా చేశారు. రాహుల్ అధ్యక్షుడు కాగానే దురదృష్టం వెంటాడినట్టు ఆయనను ఈ ఫలితాలు పలుకరించాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాత్ సింగ్ విమర్శించారు. రాహుల్ తన ఓపెనింగ్ ఇన్నింగ్స్ జీరో కొట్టారని గోవా సీఎం మనోహర్ పారికర్ ఎద్దేవా చేశారు. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే.. తమ పని సులువు అవుతుందని తాను చెప్పానని, అదే ఈ ఫలితాల్లో రుజువైందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment