2జీ తీర్పు: ఆర్కే నగర్‌ ఓటరు ఎటు? | How RK Nagar Voters Responding To Acquittal of Accused in 2G Scam Verdict | Sakshi
Sakshi News home page

2జీ తీర్పు: ఆర్కే నగర్‌ ఓటరు ఎటు?

Published Thu, Dec 21 2017 3:09 PM | Last Updated on Thu, Aug 30 2018 6:07 PM

How RK Nagar Voters Responding To Acquittal of Accused in 2G Scam Verdict - Sakshi

చెన్నై: తమిళనాడులో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ మొదలైన కొద్దిసేపటికే 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో కోర్టు వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ స్కామ్‌లో నిందితులందరినీ న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. ఆర్కే నగర్ ఉపఎన్నిక పోలింగ్‌పై కోర్టు తీర్పు ఎటువంటి ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. 'మోదీ ఇప్పుడు తమిళనాడు వెళ్లి డీఎంకేతో పొత్తు పెట్టుకోండి' అంటూ వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌పై పోలింగ్ కేంద్రాల వద్ద చర్చ ఓటర్లు చర్చించుకోవడం కనిపించింది. దీన్నిబట్టి తమిళనాడు భవిష్యత్ రాజకీయాలను అంచనా వేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మాకు ప్లస్ అవుతుంది
2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో గురువారం ఉదయం 10.30 గంటలకు కోర్టు తీర్పు వెలువరించింది. అప్పటికి ఆర్కే నగర్‌లో పోలింగ్ ఇంకా 90 శాతం మిగిలేవుంది. కోర్టు తీర్పుకు తమకు అనుకూలంగా రావడంతో ఉప ఎన్నికలో తమ పార్టీకి లాభించే అవకాశముందని డీఎంకే నాయకులు అభిప్రాయపడుతున్నారు. 'ఆర్కే నగర్‌లో మేము గెలుస్తామని అనుకున్నాం. ఈరోజు కోర్టు వెలువరించిన తీర్పుతో మా విజయావకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయ'ని డీఎంకే అధికార ప్రతినిధి మాను సుందరం పేర్కొన్నారు. ఈ కేసు ఎన్నికల అంశం కానప్పటికీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో తమ పార్టీపై ప్రజల్లో నమ్మకం బలపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ లాభాల కోసమే తమ పార్టీ నాయకులను ఈ కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు.

స్వాగతిస్తున్నాం: దినకరన్
2జీ కుంభకోణం కేసులో డీఎంకే నాయకులను నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ తెలిపారు. డీఎంకే ప్రతిపక్షం అయినప్పటికీ ఆ పార్టీ నాయకులు జైలు వెళ్లాలని తాము కోరుకోబోమన్నారు.

ఆర్కే నగర్‌ వశమయ్యేనా?
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌ చాలా ఏళ్లుగా అన్నాడీఎంకే పార్టీకి కంచుకోటగా ఉంది. ఆమె మరణంతో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఇక్కడ పాగా వేసేందుకు డీఎంకే సర్వశక్తులు ఒడ్డుతోంది. అన్నాడీఎంకేలో వర్గపోరుతో తమకే విజయావకాశాలుంటాయని డీఎంకే భావిస్తోంది. తాజాగా వెలువడిన కోర్టు తీర్పుతో డీఎంకేలో కొత్త ఉత్సాహం నింపింది. ఆర్కే నగర్‌ తమ వశం కావడం ఖాయమని కరుణానిధి పార్టీ దీమాతో ఉంది.

దీర్ఘకాలం ప్రభావం ఉంటుందా?
తమిళనాడు రాజకీయాల్లో న్యాయస్థానం తీర్పు ప్రభావం ఎంతకాలం ఉంటుందనే దాని గురించి ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం(2021) ఉంది. 2జీ స్కామ్ కారణంగా డీఎంకేతో పొత్తుకు జాతీయ పార్టీలు వెనుకాడుతూ వచ్చాయి. అపవాదు తొలగిపోవడంతో డీఎంకేతో చేతులు కలిపేందుకు నిస్సంకోచంగా ఇతర పార్టీలు ముందుకు వచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement