సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన నోట్ల కట్టలు దొరికిన నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూరు నియోజకవర్గం ఎన్నికలు రద్దయిన విషయం తెల్సిందే. నోట్ల కట్టలను ఎలా నీట్‌గా ప్యాక్ చేశారో, వాటిపై వార్డు నెంబర్లను ఎలా ప్రింట్ చేశారో, స్థానిక కెనరా బ్యాంక్ అధికారిని పట్టుకొని డబ్బు మొత్తాన్ని ఎలా రెండు వందల రూపాయల నోటుగా మార్చారో వివరిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ సమగ్రమైన నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించడం, ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి లేనందున ఎన్నికలను రద్దు చేయాల్సిందిగా ఆ నివేదికలో ఎన్నికల కమిషన్ సూచించడం, అందుకు అంగీకరించిన రాష్ట్రపతి మంగళవారం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
వెల్లూరు నుంచి లోక్‌సభకు డీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ కోశాధికారి దురై మురుగన్ కుమారుడు కతీర్ ఆనంద్ పోటీ చేస్తున్నారు. ముందుగా మురుగన్ ఇంటిపై దాడులు జరిపిన ఆదాయం పన్ను శాఖ అధికారలు ఆ తర్వాత దురై మురుగన్ మిత్రుడి ఫ్యాక్టరీలో దాడులు జరపగా 11.50 కోట్ల రూపాయలు పట్టుపడ్డాయి. అవన్ని కూడా 200 రూపాయల నోట్లే కావడం గమనార్హం. ఎన్నికలను పురస్కరించుకొని తమిళనాడులో తాము నిర్వహించిన సోదాల్లో ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయలు పట్టుబడినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అధికారుల సోదాలో ప్రతిపక్షమైన డీఎంకే అభ్యర్థుల వద్దనే కాకుండా పాలకపక్ష అభ్యర్థుల వద్ద కూడా డబ్బు పట్టుబడుతున్నప్పుడు అధికార పక్షాన్ని వదిలేసి తమ అభ్యర్థులపైనే కేసులు పెడుతున్నారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపించారు. తన సోదరి కనిమోళి ఇంటిని సోదా చేయడం పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాలకపక్ష ఏఐఏడీఎంకే వద్ద పంచడానికి ఉద్దేశించిన 640 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని ‘ది వీక్’ పత్రిక వెల్లడించింది. ఇప్పటికీ మూడేళ్లు గడుస్తున్నా వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆ తర్వాత ఏడాదికి డాక్టర్ రాధాకష్ణన్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా 80 కోట్ల రూపాయలు పట్టుబడడంతో అప్పుడు ఆ ఎన్నికను రద్దు చేశారు ఇప్పుడు వెల్లూరు ఎంపీ ఎన్నికలను అలాగే రద్దు చేశారు. ఎన్నికల రద్దు వల్ల అవినీతి ఆగదని తేలిపోయింది. కఠిన చర్యలు తీసుకుంటేగానీ ఈ అవినీతి పోదు. నోట్లతో పట్టుబడ్డ వారిపై కేసులు పెట్టి వారికి శిక్షపడేలా చేయాలి. ఆ డబ్బులు ఏ అభ్యర్థి ఎన్నిక కోసం ఖర్చు పెడుతున్నారో కనుక్కొని సదరు అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా చర్యలు తీసుకోవాలి. అంతవరకు ఎన్నికలకు అవినీతి మకిలి అంటుకూనే ఉంటుంది.
నోటుకు ఓటుపై ఎలా వేటు వేయాలి?
Published Wed, Apr 17 2019 3:07 PM | Last Updated on Wed, Apr 17 2019 6:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment