బీజేపీ సీనియర్ నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణంపై హరియాణా వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్ వాసి అయిన సుష్మా స్వరాజ్ బాల్యపు రోజులను, ప్రజలతో ప్రేమగా, ఆప్యాయంగా వ్యవహరించే ఆమెతో తమ అనుబంధాన్ని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.
సుష్మా స్వరాజ్ హరియాణా అసెంబ్లీకి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చౌదరీ దేవీలాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1977-82, 1987-90 మధ్యకాలంలో అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనుకోకుండా కలిసివచ్చిన అదృష్టంతోనే ఆమె ఎమ్మెల్యే అయ్యారని, ఆ తర్వాత ఎంతో కటోరశ్రమతో ఉన్నతమైన నాయకురాలిగా ఎదిగారని ప్రస్తుత కంటోన్మెంట్ ఎమ్మెల్యే, హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ గుర్తుచేసుకున్నారు. 25 ఏళ్ల వయస్సులోనే సుష్మా ఎమ్మెల్యేగా గెలుపొందారని, అనంతరం హరియాణ విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారని ఆయన తెలిపారు. ‘1977లో అంబాలా కంటోన్మెంట్ టికెట్‌ను సోమ్ ప్రకాశ్ చోప్రాకు జనతా పార్టీ ఇచ్చింది. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లి వచ్చిన ఆయన కొన్ని కారణాల వల్ల పోటీ చేయలేదు. దీంతో ఆ టికెట్ అనూహ్యంగా సుష్మాజీకి దక్కింది. ఆమె గెలుపొందారు. జనతా పార్టీ హరియాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది’ అని అనిల్ విజ్ తెలిపారు. 1990లో సుష్మా రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గంలో అప్పటినుంచి అనిల్ విజ్‌గా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు.
సుష్మా స్వరాజ్ చిన్నవయస్సులోనే తల్లి చనిపోయారని, అప్పటినుంచి అంబాలా కంటోన్మెంట్‌లోని బీసీ బజార్‌లో ఉన్న తన అమ్మమ్మ ఇంట్లో పెరిగిన ఆమె.. స్కూలు రోజుల నుంచే చర్చల్లో ఉత్సాహంగా పాల్గొనేవారని అనిల్ విజ్ తెలిపారు. అంబాలా కంటోన్మెంట్‌లోని ఎస్డీ కాలేజీలో చదివిన సుష్మా అనంతరం చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించారు. ఆమె సోదరుడు ప్రస్తుతం అంబాలా కంటోన్మెంట్‌లోని తన పూర్వీకుల ఇంట్లోనే నివసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment