న్యూఢిల్లీ: సాధారణంగా ఉల్లిగడ్డలు కొస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ, ఇప్పుడు ఉల్లిని కొనాలంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధర అమాంతం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఉల్లి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే అవకాశమే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉల్లి సెగ తాజాగా పార్లమెంటును తాకింది. లోక్‌సభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలె ఈ అంశాన్ని లేవనెత్తారు. ఉల్లిధరలపై ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. ఉల్లి ధరలను తగ్గించడానికి కేంద్రం తీసుకున్న చర్యలను సభకు వివరించారు. అయితే, ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. తమది ఉల్లిపాయలు ఎక్కువగా తినే కుటుంబం కాదని చెప్పుకొచ్చారు.
‘నేను ఉల్లి, వెల్లుల్లి పెద్దగా తినను. ఉల్లిపాయలను పెద్దగా ఉపయోగించని కుటుంబం నుంచి నేను వచ్చాను’ అని ఆమె వివరించారు. ఉల్లి ధరలు అమాంతం ఎందుకు పెరిగిపోయాయని సూప్రియా సూలె కేంద్రాన్ని ప్రశ్నించారు. మరోవైపు చిన్న, సన్నకారు ఉల్లి రైతులను కూడా కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment