టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత, దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ధర్మ పోరాటానికి శ్రీకారం చుడుతున్నారు. చంద్రబాబుకు తగిన బుద్ధి చెపుతానని, తిరుమల శ్రీవారి సాక్షిగా తన పోరాటాన్ని ప్రారంభిస్తానని గతంలోనే ప్రకటించిన మోత్కుపల్లి ఈ మేరకు మంగళవారమే తిరుపతి వెళ్లారు. బుధవారం ఉదయం ఆయన అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం చంద్రబాబుకు వ్యతిరేకంగా తన పోరాట కార్యాచరణను ప్రకటించనున్నారు. మోత్కుపల్లి తిరుపతి యాత్రకు ఆయన మిత్రమండలి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘చంద్రబాబు అధర్మంపై «మోత్కుపల్లి ధర్మపోరాటం’పేరిట రూపొందించిన పోస్టర్లపై టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుతోపాటు మోత్కుపల్లి చిత్రాలను పొందుపర్చారు.
నా గొంతు కోసిన దుర్మార్గుడు బాబు
తిరుపతి యాత్ర సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు మంగళవారం హైదరాబాద్‌లో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాను పేద దళితుడినని, తనను చంద్రబాబు నమ్మించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తననే మోసం చేసిన చంద్రబాబు ఎన్టీఆర్ శిష్యులను మానసికంగా చిత్రహింసలకు గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ శిష్యులుగా గుర్తింపు పొందిన 25–30 మందిని చంద్రబాబు చిత్రహింసలకు గురిచేసి చంపారని, ఇటీవల మరణించిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు కూడా అదే కోవలోకి వస్తారని చెప్పారు. 35 ఏళ్లుగా పార్టీ జెండాను అంటిపెట్టుకుని ఉన్న తాను ఏ తప్పు చేయకపోయినా గొంతు కోసిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు.
చంద్రబాబుకు దళితులంటే లెక్కలేనితనం ఉందన్నారు. దళితులను, దళిత నేతలను ఆయన చులకనగా చూడటం చాలా బాధాకరమన్నారు. బలహీన వర్గాలను అవమానపర్చడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. చంద్రబాబు వైఖరితో తాను కూడా మానసికంగా చనిపోయానన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని దళితులు, బలహీన వర్గాలను కోరారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కని, అందుకే తన మానసిక క్షోభను వేంకటేశ్వరునికి చెప్పుకునేందుకు వెళుతున్నానని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని, ఆ దుర్మార్గుడిని రాజకీయంగా బొందపెట్టాలని దేవుడిని వేడుకుంటానన్నారు. తనను నమ్మించి మోసం చేసిన చంద్రబాబును రాజకీయంగా అంతమొందించడమే ధ్యేయంగా పోరాడతానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకంజ వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment