సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, తన తండ్రి కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో నిర్వహించి ఉండకపోయి ఉంటే.. తాను ప్రాణాలు విడిచి ఉండేవాడినని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. దివంగత నేత కరుణానిధికి నివాళులర్పించేందుకు మంగళవారం చెన్నైలో జరిగిన డీఎంకే కార్యవర్గం భేటీ అయింది. ఈ భేటీలో స్టాలిన్ మాట్లాడుతూ.. ఆగస్టు 7న కరుణానిధి మరణించడానికి కొన్ని గంటల ముందు తానే స్వయంగా సీఎం పళనిస్వామి ఇంటికి వెళ్లానని స్టాలిన్ వివరించారు.
‘తలైవర్‌కు (కరుణాధి) డాక్టర్లు కొన్ని గంటల గడువు మాత్రమే ఇచ్చారు. దీంతో మెరీనా బీచ్‌లో స్థలం అడిగేందుకు ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని భావించాం. సీనియర్ లీడర్లు తాము వెళ్లి సీఎంను కలిసి ఈ విషయాన్ని నివేదిస్తామని చెప్పారు. మీరు స్వయంగా వెళ్లవద్దని చెప్పారు. అయినా, నా గౌరవాన్ని పక్కనపెట్టి నేను స్వయంగా సీఎం ఇంటికి వెళ్లాను. పళనిస్వామి చేతులు పట్టుకొని మరీ మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాను. చట్టాలు అందుకు అనుమతించడం లేదని, లీగల్ ఒపీనియన్ కూడా వ్యతిరేకంగా ఉందని పళనిస్వామి చెప్పాడు.
మీరు ప్రభుత్వంలో ఉన్నందున లీగల్ ఒపీనియన్‌ను మార్చుకోవచ్చునని నేను చెప్పాను. కానీ తన ఇంటినుంచి మమ్మల్ని పంపించే ఉద్దేశంతో ఈ విషయాన్ని పరిగణిస్తానని ఆయన చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కరుణానిధి మరణవార్తను వైద్యులు ప్రకటించారు. పార్టీ నేతలు వెంటనే వెళ్లి సీఎంను కలిసి.. మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. కానీ సీఎం అందుకు ఒప్పుకోలేదని వారు పదినిమిషాల్లో నాకు సమాచారం ఇచ్చారు. అప్పుడు డీఎంకే లీగల్ సెల్ చీఫ్ విల్సన్ కోర్టును ఆశ్రయిద్దామని చెప్పాడు. మెరీనా బీచ్‌లో స్థలం వచ్చింది. ఇందుకు నేను విల్సన్‌కు రుణపడి ఉంటాను’ అని స్టాలిన్ భావోద్వేగంగా చెప్పారు. మెరీనా బీచ్‌లో కరుణానిధి సమాధి కోసం స్థలం ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు అంగీకరించిన సంగతి తెలిసిందే.
Published Tue, Aug 14 2018 7:00 PM | Last Updated on Tue, Aug 14 2018 7:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment