సాక్షి, చెన్నై: తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమంటూ సంకేతాలు ఇస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రజనీ-కమల్ కలిసి రంగంలోకి దిగుతారా? ఈ ఇద్దరి మధ్య పొత్తు పొడిచే అవకాశముందా? అంటే ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి. కానీ, రజనీ, కమల్ కలిసి పోటీచేస్తే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశముందని సీనియర్ జర్నలిస్టు ఒకరు అభిప్రాయపడ్డారు.
రాజకీయాల్లో రాణించడానికి డబ్బు, పేరు ప్రఖ్యాతలు సరిపోవని తాజాగా రజనీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వెంకట నారాయణ్ స్పందిస్తూ 'రజనీ వ్యంగ్యంగా చేసిన ప్రకటన అది. కానీ రజనీ, కమల్ ఇద్దరూ తమ ప్రకటనల ద్వారా క్రియాశీలంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తామని విస్పష్టంగా చెప్పకపోయినా.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి ఉందని ఈ ప్రకటనల ద్వారా చెప్పకనే చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. కానీ, ఇద్దరు చేతులు కలిపితే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చాలామంచి ఫలితాలు రాబట్టే అవకాశముంది' అని విశ్లేషించారు. రాజకీయాల్లో రాణించాలంటే.. డబ్బు, పేరు ప్రఖ్యాతలు మాత్రమే సరిపోవని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ముందుండి నడిపించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.