రాజకీయ రంగప్రవేశంపై అసంఖ్యాక అభిమానుల్ని ఊరిస్తూ వస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు కొత్త పార్టీని ప్రారంభించబోతున్నట్టు గురువారం ప్రకటించారు. 2017 డిసెంబర్‌లోనూ, మొన్న మార్చిలోనూ కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పారు. ఆ రెండు సందర్భాల్లోనూ ‘రాజకీయాల్లోకొస్తానుగానీ, పోటీ చేయబోన’ని చెప్పారు. ఈసారి మాత్రం వచ్చే జనవరిలో తాను స్థాపించబోయే పార్టీ ఎన్నికల్లో తలపడుతుందన్న అభిప్రాయం కలిగించారు. ఆయన బరిలో వుంటారా లేదా అన్న అంశంలో స్పష్టతనీయలేదు. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ జరగద’ంటూ ఆయన చేసిన ట్వీట్‌ను బట్టి చూస్తే రజనీకాంత్ పూర్తి స్థాయిలో రాదల్చుకున్నట్టు అర్థమవుతోంది.
పార్టీ ఆవిర్భావం తేదీ, ఇతర వివరాలు ఈనెల 31న వెల్లడిస్తారు గనుక అప్పుడు మరింత స్పష్టత వస్తుంది. తమిళనాట రాజకీయ పార్టీలకు కొదవలేదు. ఇప్పటికే డీఎంకే, అన్నా డీఎంకేలతోపాటు వైకో నేతృత్వంలోని ఎండీఎంకే, డాక్టర్ రాందాస్ నాయకత్వంలోని పీఎంకే, నటుడు విజయ్‌కాంత్ సారథ్యంలోని డీఎండీకే, శశికళకు చెందిన ఎంఎంఎంకేవంటి పార్టీలెన్నో వున్నాయి. రెండేళ్లక్రితం ప్రముఖ నటుడు కమలహాసన్ మక్కళ్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పేరిట పార్టీని స్థాపించారు.
సీఎన్ అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే వీరంతా ఆ రాష్ట్రంలో వెల్లువెత్తిన ద్రవిడ ఉద్యమ ప్రభావంతో అడుగుపెట్టారు. ఆ ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామి హేతువాదం, ఆత్మగౌరవం, మహిళల హక్కులు, కులనిర్మూలన తదితర సిద్ధాంతాల ప్రాతిపదికగా దాన్ని నడిపించారు. సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ఆ ఉద్యమం సాధించుకున్న విజయాలను సుస్థిరం చేసుకోవడానికి ద్రవిడ కజగం పార్టీని స్థాపించారు. అయితే ఆయన ప్రధాన అనుచరుడిగా ఆ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన అన్నాదురై పెరియార్‌తో అనంతరకాలంలో విభేదించి డీఎంకే పార్టీకి అంకురార్పణ చేశారు.
1965లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం హిందీని ఏకైక అధికార భాష చేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతి రేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉద్యమాలు పెల్లుబికినప్పుడు తమిళనాడులో అన్నాదురై దానికి నేతృత్వం వహించారు. ఆ ఉద్యమం కాంగ్రెస్‌ను శాశ్వత సమాధి చేసింది. కాంగ్రెస్ మాత్రమే కాదు... ఏ జాతీయ పార్టీకీ అక్కడ నిలువనీడ లేకుండాపోయింది. ఎన్నికల్లో గెలవాలనుకునే జాతీయ పార్టీ రాష్ట్రంలోని ద్రవిడ పార్టీలతో జతకట్టక తప్పని స్థితి ఏర్పడింది.
తమిళనాడులో ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రభుత్వం కొన్ని ఒడిదుడుకులతోనే అయినా నిరా టంకంగా సాగుతోంది. ఆ పార్టీ చీలిపోతుందని 2016లో ఆ పార్టీ అధినేత జయలలిత మరణా నంతరం చెప్పినవారు చాలామందే వున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, మాజీ సీఎం ఒ. పన్నీరు సెల్వంల మధ్య కొంతకాలం పార్టీ రెండుగా చీలిన మాట వాస్తవమే. కానీ త్వరలోనే అదంతా సర్దుకుంది. ముఖ్యమంత్రి కావాలనుకున్న జయలలిత సన్నిహి తురాలు శశికళ చివరి నిమిషంలో అవినీతి కేసులో జైలుపాలయ్యారు. అధికారం వుందన్నమాటే గానీ, అన్నాడీఎంకే అత్యంత బలహీన స్థితిలోవుంది. కరుణానిధి తనయుడు స్టాలిన్ ఆధ్వర్యంలోని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పటిష్టంగానే వున్నా ఆయనకు తన సోదరుడు అళగిరితో వైరం వుంది. పైగా కరుణానిధికున్నంత ప్రజాదరణ స్టాలిన్‌కు వుందో లేదో ఇంకా తేలాల్సివుంది.
వచ్చే ఏడాది మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఆవరిం చిందన్న అభిప్రాయం చాలామందిలో వుంది. ఆ అభిప్రాయంతోనే గతంలో కమలహాసన్ రాజ కీయాల్లోకొచ్చారు. ఇప్పుడు రజనీకాంత్ ఉద్దేశమైనా అదే కావొచ్చు. వర్తమాన రాజకీయ దుస్థితి చూసి ఆగ్రహం కలగడం వల్లే రాజకీయాల్లోకి రావాలనిపించిందని గతంలో రజనీకాంత్ చెప్పారు. నిజాయితీగా, అవినీతిరహితంగా, పారదర్శకంగా, సెక్యులర్ సిద్ధాంతాలతో తన పార్టీ వుంటుందని తాజాగా రజనీకాంత్ ప్రకటించారు. అలాగే ఎన్నికల్లో నెగ్గడానికి ‘ఆధ్యాత్మిక రాజకీయాల’ను పాటి స్తానని కూడా తెలియజేశారు. ఆధ్యాత్మిక రాజకీయాలు అనే మాట ఆయన గతంలోనూ ఉపయో గించారు. అయితే దాని స్వరూపస్వభావాలేమిటో ఇంతవరకూ చెప్పలేదు. డిసెంబర్ 31న జరగ బోయే సమావేశంలోనైనా దాని గురించి అందరికీ స్పష్టత లభించగలదని ఆశించాలి.
‘ఆధ్యాత్మికం’ అనేసరికి రజనీకాంత్ బీజేపీవైపు వెళ్తారన్న అభిప్రాయం మాత్రం అందరిలోనూ కలిగింది. ఇంతవరకూ ఆయన ఏ పార్టీనీ విమర్శించలేదు. ఎవరినీ సమర్థించలేదు. ఆయనెప్పుడూ వివాదాలకు దూరమే. కానీ రాజకీయాల్లోకొచ్చాక అది సాధ్యపడదు. దేశాన్ని, రాష్ట్రాన్ని కలవరపరిచే ప్రతి సమస్యపైనా స్పందించాల్సివస్తుంది. తాను సూచించే ప్రత్యామ్నాయమేమిటో వెల్లడించాలి. సినిమా రంగం ఒక కాల్పనిక జగత్తు. అందులో అగ్రశ్రేణి నటుడుగా రజనీకాంత్‌కు అత్యంత ప్రజా దరణ వుంది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఆయనకు లక్షలాదిమంది అభిమానులున్నారు. తమిళ నాడులో మూలమూలనా ఆయన అభిమాన సంఘాలున్నాయి.
ఆ సంఘాలన్నీ రజనీ రాజకీయా ల్లోకి రావాలని దాదాపు పాతికేళ్లుగా కోరుతున్నాయి. ఈ అభిమానం పార్టీని సాధారణ ప్రజానీకానికి చేర్చడంలో మంచి దోహదకారి అవుతుంది. అయితే పార్టీ శాశ్వతంగా వేళ్లూనుకోవాలన్నా, మరిం తగా విస్తరించాలన్నా ప్రజలకు మెరుగైన ప్రత్యామ్నాయం చూపాల్సివుంటుంది. సమస్యలపైనా, విధానాలపైనా ఊగిసలాట లేని వైఖరిని ప్రదర్శించాల్సివుంటుంది. బలమైన క్యాడర్‌ను నిర్మించు కోవాల్సివుంటుంది. ఇప్పటికైతే బీజేపీ, అన్నాడీఎంకేలు రెండూ ఆయన తమతో చెలిమి చేస్తారన్న ఆశాభావం ప్రకటించాయి. ఇకపై ప్రజలు ఆయన్ను నిశితంగా గమనిస్తారు. కనుక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరికో ప్రయోజనం చేకూర్చడానికే వస్తున్నారన్న అభిప్రాయం కలగకుండా రజనీకాంత్ జాగ్రత్తపడక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment