సాక్షి, కరీంనగర్: రాష్ట్ర, దేశస్థాయి రాజకీయాలకు సింగిల్ విండో ఎన్నిక ఎంతో తోడ్పడింది. అందివచ్చిన ‘సహకారం’తో ఎందరో నాయకులను అసెంబ్లీ, పార్లమెంట్‌కు పంపింది. రైతుకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచి ప్రజామెప్పుతో రాజకీయంగా అంచలంచెలుగా ఎదిగి తమ సత్తాను పలువురు నాయకులు చాటుకున్నారు. సీఎం కేసీఆర్ కూడా తొలుత సింగిల్ విండో చైర్మన్‌గా పని చేసిన వారే. సహకార ఎన్నికల నేపథ్యంలో సంఘాల వేదికగా రాజకీయంగా ఎదిగిన నేతలపై కథనం.
సహకార ‘భీష్ముడు’...
ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌కు చెందిన వుచ్చిడి మోహన్‌రెడ్డి సహకార బీష్ముడిగా పేరుంది. 1969 నుంచి 1981 వరకు అల్మాస్‌పూర్ సర్పంచ్‌గా పని చేశారు. 1981లో సహకారరంగం ఏడీబీగా ఉండేది. అప్పట్లో ఏడీబీలో డైరెక్టర్‌గా ఉన్నారు. 1984 నుంచి ఇప్పటివరకు 36 ఏళ్లుగా అల్మాస్‌పూర్ సహకార సంఘం చైర్మన్‌గా ఉంటున్నారు.
1983లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికై 20 నెలలపాటు మోహన్‌రెడ్డి పని చేశారు. ఎన్‌టీ రామారావు అప్పట్లో ప్రభుత్వం రద్దు చేయడంతో మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. 2005లో కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్‌గా 2013 నుంచి కేడీసీసీ బ్యాంక్ వైస్‌చైర్మన్‌గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో మోహన్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటి సహకార ఎన్నికల్లోనూ అల్మాస్‌పూర్ సహకార సంఘం నుంచి మళ్లీ డైరెక్టర్‌గా మోహన్‌రెడ్డి ఏకగ్రీవం కావడం విశేషం. సహకార రంగంలో మోహన్‌రెడ్డి భీషు్మడిగా అభివర్ణిస్తారు.
గంభీరావుపేట నుంచి అంతర్జాతీయ స్థాయికి...
గంభీరావుపేట మండలం గజసింగవరంకు చెందిన కొండూరి రవీందర్‌రావు 2005లో సహకార సంఘం చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే ఏడాది కరీంనగర్ సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్‌గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో ఉన్నారు. రెండోసారి 2013లో గంభీరావుపేట సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేడీసీసీబీ చైర్మన్‌గా పని చేస్తూ 2015లో తెలంగాణ సహకార బ్యాంక్ చైర్మన్(టెస్కాబ్)గా ఎన్నికయ్యారు.
2019లో అంతర్జాతీయ సహకార బ్యాంక్‌ల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా సహకార రంగంలోని ఉద్యోగులకు హెచ్‌ఆర్‌పాలసీ అమలు చేసే కమిటీకి కొండూరి రవీందర్‌రావు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గంభీరావుపేటలో మొదలైన రవీందర్‌రావు ప్రస్థానం సహకార రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. 2020లో గంభీరావుపేట సింగిల్‌విండో పరిధిలో 6వ డైరెక్టర్ స్థానానికి తాజాగా కొండూరి రవీందర్‌రావు నామినేషన్ వేశారు. ఒక్కటే నామినేషన్ రావడంతో ఏకగ్రీవంకానున్నారు.
‘సింగిల్’ నుంచి కరీంనగర్ ఎంపీగా..
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ çసహకార పరపతి సంఘం డైరెక్టర్‌గా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన పొన్నం ప్రభాకర్ అనంతరం కరీంనగర్ లోక్‌సభసభ్యుడిగా ఎన్నికయ్యారు. కరీంనగర్ సింగిల్‌విండో నుంచే ప్రభాకర్ రాజకీయ ప్రస్థానం మొదలై అంచలంచెలుగా రాష్ట్ర, దేశస్థాయి నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. 2005లో కరీంనగర్ సింగిల్‌విండోకు జరిగిన ఎన్నికల్లో డైరెక్టర్, చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దివంగత సీఎం డాక్టర్ వైస్ రాజశేఖరరెడ్డి శిషు్యడిగా 2005లోనే డీసీఎంఎస్ చైర్మన్‌గా ఎన్నికై ఉమ్మడి ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
అనంతరం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రభాకర్ 2009లో కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా, ఉమ్మడి రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్‌గా వ్యవహరించి దేశవ్యాప్తంగా గుర్తింపుపొందారు. తెలంగాణ ఉద్యమంలోనూ తన పాత్రను పోషించి ప్రజల మన్ననలు పొందారు. రాజకీయంగా తొలి అవకాశం మాత్రం సహకార సంఘం కల్పించడంపట్ల పొన్నం ఆనందం వ్యక్తం చేస్తారు.
డైరెక్టర్ టు మార్క్‌ఫెడ్ చైర్మన్..లోక బాపురెడ్డి ప్రస్థానం
కథలాపూర్(వేములవాడ): రైతు కుటుంబం నుంచి వచ్చి సహకార సంఘం డైరెక్టర్‌గా గెలుపొంది అంచలంచెలుగా మార్క్‌ఫెడ్ చైర్మన్ స్థాయికి ఎదిగిన ‘లోక’ ప్రస్థానం ఇదీ. కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన లోక బాపురెడ్డి 2013 సంవత్సరంలో జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో డైరెక్టర్‌గా పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్ల మద్దతు కూడగట్టుకొని భూషణరావుపేట సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికయ్యారు. సహకార సంఘం చైర్మన్‌గా రైతుకు సేవలందిస్తున్న తరుణంలో 2017 సంవత్సరం మార్చిలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ పదవిని సీఎం కేసీఆర్ అప్పగించారు.
ప్రస్తుతం మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈ నెలలో జరుగుతున్న సహకార సంఘాల ఎన్నికల్లో భూషణరావుపేట సహకార సంఘంలో ఒకటో టీసీలో నామినేషన్ వేసి డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెజార్టీ డైరెక్టర్లను గెలిపించుకొని మరోసారి సహకార సంఘం చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు కుటుంబంలో పుట్టి రాష్ట్రంలోని రైతులకు సేవలందించడం ఆనందంగా ఉందని మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి చెబుతారు.
సింగిల్ విండో నుంచి ఎమ్మెల్యేగా...
వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన రేగులపాటి పాపారావు 1996లో రుద్రవరం సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికై అప్పట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్‌గా పనిచేశారు. అంతకు ముందు 1980లో వేములవాడ పాత తాలూకా సమితి చైర్మన్‌గా పనిచేశారు. 1987లో వేములవాడ తొలి మండల అధ్యక్షుడిగా పాపారావు ఉన్నారు. 1999లో సిరిసిల్ల శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు రుద్రవరం సర్పంచ్‌గా పని చేస్తూ రాష్ట్రస్థాయిలో ఉత్తమ సర్పంచ్‌గా పాపారావు ఎన్నికయ్యారు. సింగిల్ విండో చైర్మన్‌గా పని చేసి చట్టసభకు ఎన్నికకావడం విశేషం.
ఎమ్మెల్యే నుంచి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా...
గంభీరావుపేటకు చెందిన కటుకం మృత్యుంజయం 1981లో గ్రామపంచాయతీ వార్డు సభ్యుడిగా పని చేశారు. అనంతరం కరీంనగర్ ఎమ్మెల్యేగా 1983లో ఎన్నికయ్యారు. 1992 నుంచి 1995 వరకు గంభీరావుపేట సింగిల్ విండో చైర్మన్‌గా పని చేసి ఉమ్మడి కరీంనగర్ సహకార బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మృత్యుంజయం ముందు చట్టసభలకు వెళ్లి తర్వాత సొంత ఊరి నుంచి సహకార బ్యాంక్ డైరెక్టర్‌గా ఎన్నికై, ప్యాక్స్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో రాజకీయంగా గుర్తింపు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment