వైఎస్సార్‌సీపీ విజయంలో ‘ఐ–ప్యాక్‌’ కీలక పాత్ర | Indian Political Action Committee key role for YSR Congress Party Strengthen in the state | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ విజయంలో ‘ఐ–ప్యాక్‌’ కీలక పాత్ర

Published Thu, May 30 2019 4:23 AM | Last Updated on Thu, May 30 2019 4:23 AM

Indian Political Action Committee key role for YSR Congress Party Strengthen in the state - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం వెనుక ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ(ఐ–ప్యాక్‌) కీలక పాత్ర పోషించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల రాష్ట్రంలో ఉన్న అఖండ ప్రజాదరణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను అమలు చేసింది. సంస్థాగతంగా బలోపేతం కావడం, ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్‌లో ఐ–ప్యాక్‌ సంస్థ పక్కా వ్యూహాలతో దిశానిర్దేశం చేసింది. 2014 ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా విజయవంతమై ప్రశాంత్‌ కిశోర్‌ యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించారు. ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారం, కుట్రలతో 2014లో తృటిలో అధికారానికి దూరమైన వైఎస్సార్‌సీపీ 2019 ఎన్నికల కోసం నాలుగేళ్ల క్రితమే సమాయత్తమైంది. వైఎస్‌ జగన్‌ తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ను నియమించారు. దాంతో ప్రశాంత్‌ కిశోర్‌ తొలిసారి దక్షిణ భారతదేశంలో ఎన్నికల వ్యూహకర్తగా రంగంలోకి దిగారు. 2017 మే నుంచి ఐ–ప్యాక్‌ సంస్థ వైఎస్సార్‌సీపీతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా వ్యూహాలను అమలు చేస్తూ పార్టీకి దిక్సూచిగా నిలిచింది.

ఆపరేషన్‌–2019
వైఎస్సార్‌సీపీ ఎన్నికల వ్యూహకర్తగా నియమితులు కాగానే ప్రశాంత్‌ కిశోర్‌ తన ఐ–ప్యాక్‌ బృందంతో కార్యాచరణ చేపట్టారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికి ఎన్నికలకు 709 రోజులే ఉన్నాయి. అందుకు అనుగుణంగా 200 మంది సభ్యులను వివిధ బృందాలుగా ఏర్పాటు చేసి, పలు బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయి విభాగాలు, మీడియా వింగ్, డిజిటల్‌ మీడియా అండ్‌ రిసెర్చ్‌ కమ్యూనికేషన్‌ వింగ్‌... ఇలా పలు విభాగాలు ఏర్పాటయ్యాయి. ఐ–ప్యాక్‌ సంస్థ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షిస్తూ రిషిరాజ్‌ సింగ్, శంతన్‌సింగ్, ఈషాలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ ముగ్గురు వైఎస్సార్‌సీపీకి చెందిన వివిధ విభాగాలను పర్యవేక్షిస్తూ, ఎన్నికల వ్యూహాలను అమలు చేశారు.  వైఎస్సార్‌సీపీ ఆశయాలు, వైఎస్‌ జగన్‌ నిబద్ధతను ఐ–ప్యాక్‌  సంస్థ పక్కాప్రణాళికతో ప్రజల్లోకి తీసుకెళ్లింది. పార్టీ తరపున 17 కార్యక్రమాలకు రూపకల్పన చేసి, అమలు చేసింది. వాటిల్లో 13 క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాలు కాగా, 4 ప్రచార కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

పార్టీ పరిస్థితిపై అధినేతకు నివేదికలు 
వైఎస్‌ జగన్‌ నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్రలో ఐ–ప్యాక్‌ కీలక భూమిక పోషించింది. 20 మంది సభ్యుల బృందం పాదయాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు కొనసాగుతూ పర్యవేక్షించింది. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించింది. పార్టీలో పలువురు నేతల చేరికలో ఐ–ప్యాక్‌ పాత్ర అత్యంత కీలకం. ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘రావాలి జగన్‌... కావాలి జగన్‌’ అనే పార్టీ ప్రచార గీతాన్ని 3 కోట్ల మంది వీక్షించడం సరికొత్త రికార్డును సృష్టించింది. టీడీపీ ప్రచారాన్ని తిప్పికొడుతూ ‘నిన్ను నమ్మం బాబు’ పేరుతో ఐ–ప్యాక్‌ ప్రచార వ్యూహాన్ని అమలు చేసింది. పార్టీ బూత్‌ కమిటీ సభ్యులతో వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సమర శంఖారావం సభలకు రూపకల్పన చేసింది. ‘జగనన్న పిలుపు’ పేరుతో తటస్థులతో సమావేశాలు నిర్వహించింది. ఇందులో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఎన్నికల్లో రోజువారీగా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ అధినేత వైఎస్‌ జగన్‌కు ఐ–ప్యాక్‌ నివేదికలు ఇస్తూ వచ్చింది. నియోజకవర్గాలకు ఇన్‌చార్జిల నియామకం, వారితో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసింది. నియోజకవర్గ స్థాయిలో నేతల మధ్య విభేదాలను పరిష్కరించింది. తటస్థులను అకర్షించేందుకు సలహాలు, సూచనలు అందజేసింది. ఎన్నికల అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఐ–ప్యాక్‌ కార్యాలయానికి ప్రత్యేకంగా వెళ్లి, ఆ బృంద సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాల రోజున వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన నివాసంలో ప్రశాంత్‌ కిశోర్‌తో కలిసి ఫలితాల సరళిని పర్యవేక్షించారు. 

వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం 
ఔట్‌ డోర్‌ ప్రచారాలతోపాటు ప్రధానంగా సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటూ ప్రచారపర్వంలో ఐ–ప్యాక్‌ దూసుకెళ్లింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఐటీ విభాగాలు సోషల్‌ మీడియాలో వైఎస్‌ జగన్‌పై సాగిస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడుతూ వచ్చింది. వైఎస్సార్‌సీపీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఐ–ప్యాక్‌ రూపొందించిన పలు కార్యక్రమాలు పూర్తిస్థాయిలో విజయవంతమయ్యాయి. వైఎస్సార్‌ కుటుంబం, రచ్చబండ–పల్లెనిద్ర, గడప గడపకు వైఎస్సార్, నవరత్నాల సభలు, రావాలి జగన్‌–కావాలి జగన్‌... ఇలా ఐ–ప్యాక్‌ చేపట్టిన పలు కార్యక్రమాలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. ఔట్‌డోర్‌ ప్రచారం, ఇంటింటికీ వైఎస్సార్‌సీపీ టేబుల్‌ క్యాలెండర్ల పంపిణి తదితర రూపాల్లో పార్టీకి ప్రచారం కల్పించింది. వీటన్నింటితో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement