
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నీళ్లు, నియామకాలు, నిధుల డిమాండ్లపై ఆవిర్భవించిన తెలంగాణలో యువతకు మొండిచెయ్యే మిగిలిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన యువతను ప్రభుత్వం విస్మరించడం దారుణమన్నారు. గ్రూప్–1 ఫలితాలను ఎందుకు నిలిపివేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గ్రూప్–1 ఫలితాల నిలిపివేత, అవకతవకలపై వాయిదా తీర్మానం ఇస్తే.. ప్రభుత్వం తమకు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. టీఎస్‌పీఎస్సీ పనితీరుపై అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సీఎం, మంత్రి అసహనం వ్యక్తం చేశారన్నారు. ఉద్యోగాలు వచ్చాయని ఆశపడ్డ 121 మంది భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.