
న్యూయార్క్: గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల ప్రదానోత్సవంలో స్ఫూర్తిదాయకంగా ప్రసంగించిన ప్రముఖ హాలీవుడ్ నటి, వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రేపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. లైంగిక దాడులను వెలుగులోకి తీసుకొస్తూ.. ఇటీవల గళమెత్తిన హాలీవుడ్ నటీమణులు, మహిళలను ప్రశంసిస్తూ విన్‌ఫ్రే గొప్పగా ప్రసంగించారు. మహిళలపై లైంగిక దాడులు లేని కొత్త సమాజానికి ఇది నాంది కావాలంటూ ఆమె ఇచ్చిన ఉపన్యాసం శ్రోతలను కదిలించింది. ఆమె స్ఫూర్తిదాయక ప్రసంగం విన్న పలువురు.. ఆమె 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని గట్టిగా కోరుతున్నారు. విన్‌ఫ్రే కూడా ఆ దిశగా గట్టిగానే ఆలోచిస్తున్నారని ఆమె సన్నిహితులు తెలిపారు.
అందరిలాగే అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ కూడా విన్‌ఫ్రే ప్రసంగాన్ని ట్విట్టర్‌లో ప్రశంసించారు. మహిళా సాధికారిత దిశగా ఓప్రా ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందని, పురుషులు, మహిళలు ముందుకొచ్చి ఇందుకోసం కృషి చేయాలని ఇవాంకా యథాలాపంగా ట్వీట్ చేశారు. వెంటనే ఆమె ట్వీట్ బ్యాక్‌ఫైర్ అయింది. ఆమె ట్వీట్‌ను తప్పుబడుతూ.. హాలీవుడ్ ప్రముఖులు అలిస్సా మిలానో, రోసీ ఒడొనెల్, క్రిసీ టీజెన్ తదితరులు ట్వీట్ చేశారు. అందుకు కారణం ఆమె తండ్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలే. ట్రంప్ తమను లైంగికంగా వేధించాడని, తమ పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడని పలువురు మహిళలు గళమెత్తారు. ’మీ టూ’ క్యాంపెయిన్‌లో భాగంగా ట్రంప్ బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు. మరి బాధితులకు మీరు అండగా ఉంటారా? మీ తండ్రిపై ఆరోపణలు చేసిన బాధితులకు న్యాయం జరిగేలా మీరు చూస్తారా? బాధితులకు న్యాయసహాయం కోసం టైమ్స్ మ్యాగజీన్ ఏర్పాటుచేసిన ఫండ్‌కు నిధులు ఇస్తారా? మీ తండ్రి బాధితులకు ఆర్థిక సహాయం చేస్తారా? అంటూ పదునైన ప్రశ్నలతో ఇవాంకాపై పలువురు నెటిజన్లు విరుచుకుపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment