శ్రీనగర్: పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో లోయలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు కశ్మీర్‌కు భారీగా బలగాలను పంపిస్తున్నారన్న వార్తలు స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. దీనిపై కశ్మీర్‌లోని ప్రధాన పార్టీల నాయకులు గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై వారిద్దరూ సుధీర్ఘంగా చర్చించారు. లోయలో ఏం జరగుతోందో తమకు తెలియజేయాలని, భారత ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలను రచిస్తోందని గవర్నర్ వద్ద మెహబూబా ముఫ్తీ, ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా వంటి నేతలు ప్రశ్నించారు. యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పడం ద్వారా కశ్మీర్ లోయలో ప్రభుత్వం భయం రేకెత్తిస్తోందనీ, ఇలాంటి పరిస్థితిని తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కశ్మీర్ నేతలపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా, టీవీల్లో వచ్చే వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని, దీనిపై ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయకుండా సైలెంట్‌గా ఉండాలని గవర్నర్ వారితో వారించినట్లు సమాచారం. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్మీ సహాయంతో ఉగ్రవాద కుట్రలను ఛేదిస్తున్నామని, దీనికి స్థానిక నేతలంతా సహాకరించాలని గవర్నర్ వారిని కోరారు. అలాగే గతకొంత కాలంగా వినిపిస్తోన్న ఆర్టికల్ 35ఏ రద్దుపై వదంతులు నమ్మవద్దని మాలిక్ వారికి సూచించారు.
కాగా అమర్‌నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం అనూహ్య ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని కచ్చితమైన సమాచారం వచ్చినట్లు భారత ఆర్మీ శుక్రవారం హెచ్చరించింది. దీంతో యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సూచించింది. దీంతో స్థానిక కశ్మీర్ ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment