
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : వైఎస్సార్‌సీపీతోనే బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గంలోని 135 కులాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ కులాల సమస్యలపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారని చెప్పారు. గురువారం కర్నూలులోని నంద్యాల రోడ్డులో ఉన్న మెగాసిరి ఫంక్షన్ హాలులో జిల్లా బీసీ నాయకుల సదస్సు జరిగింది. పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మ«ధుసూదన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో జంగా కృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి బీసీల పార్టీ అని చెప్పుకొంటున్నా.. చేసింది మాత్రం ఏమీలేదని విమర్శించారు. బీసీల్లో 135 కులాలుంటే ఓటర్లు అధికంగా ఉన్న 10–15 కులాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి మిగతా వారిని అన్యాయం చేసిందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 135 కులాల వారికీ న్యాయం చేస్తామన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు బీసీ కులాలు మద్దతు తెలిపేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకోవాలని సూచించారు. అలాగే పార్టీపై టీడీపీ నాయకులు, మంత్రులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. మధుసూదన్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు వైఎస్ జగన్ పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీసీలకు టీడీపీ చేస్తున్న మోసాలను గుర్తించారని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. గ్రామ స్థాయి నుంచి బీసీల బలోపేతానికి పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు. తమ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. కర్నూలు పార్లమెంట్‌లో బీసీలదే ఆధిపత్యమన్నారు. పార్టీ పదవుల్లోనూ వారికి స్థానం కల్పిస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు వడ్డెర్లు, రజకులు, కురువలను ఎస్టీ, ఎస్సీ జాబితాలో చేర్చుతానని చెప్పి మోసం చేశారని విమర్శించారు. బీసీ కులాల సమస్యలను పాదయాత్రలో జగన్ దృష్టికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వైఎస్ జగన్‌కు మద్దతు ఇవ్వడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర కార్యదర్శి పీజీ రాంపుల్లయ్యయాదవ్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో పేదలైన బీసీలకు ఇళ్లు, స్థలాలు, రేషన్, పెన్షన్లు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్సార్ స్ఫూర్తితో పేదలందరికీ సదుపాయాలను కల్పించేందుకు వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య తెలిపారు. బీసీలందరూ ఏకమై టీడీపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పాదయాత్రలో ప్రతి బీసీ కుల సభ్యుణ్ని జగన్‌తో కలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వారు తమ కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తేవాలని సూచించారు. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ తమ పార్టీలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఒక ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను ఇచ్చి గెలిపించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు బీసీలకు ఏడాదికి రూ.10 వేల కోట్ల ప్రకారం నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పారని, ఇప్పుడు ఆయన ఎక్కడ ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌చేశారు.
మళ్లీ ఇప్పుడు ఆదరణ పథకం అంటే ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి పథంలోకి తెచ్చిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. వైఎస్‌ఆర్ పథకాలకు నిధులు విడుదల చేయకుండా సీఎం చంద్రబాబు బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. జగన్ పాదయాత్రకు బీసీలందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. సదస్సులో నాయకులు నరసింహులు యాదవ్, రాజశేఖర్, మునిస్వామి, సత్యంయాదవ్, రమణ, అనిల్‌కుమార్, కుంకనూరు శ్రీనివాస్, మల్లికార్జున, పందికొన నాగరాజు, ఆలూరు ఎంపీపీ బసప్ప,, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు రఘు, ఎల్లప్ప, అయ్యప్ప, మునిసిపల్ మాజీ చైర్మన్ బుట్టా రంగయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment