సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగలింది. ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్ నివాసంలో ఆమె గురువారం భేటీ అయ్యారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా కండువా కప్పి జయసుధను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జయసుధ మీడియాతో మాట్లాడుతూ... నేను రాజకీయాల్లోకి రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణం. వైఎస్సార్ సీపీలోకి రావడం మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉంది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ప్రస్తుతానికి ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేదు. అయితే పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు నడుచుకుంటా. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా. పార్టీలో ఉండి గెలుపు కోసం కృషి చేస్తా. అప్పట్లో ఎంతోమంది ఎన్నికల్లో పోటీ ఉన్నా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా నన్ను వైఎస్సార్ నిలబెట్టారు. పార్టీలో చేరడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎవరైనా సరే సినిమా వాళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడకూడుదు. వృత్తి వేరు ప్రవృత్తి వేరు.’ అని అన్నారు.
కాగా జయసుధ 2009 ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం అనంతరం ఆమె ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. జయసుధ ఆ తర్వాత 2016లో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment