అహంకారమే అణచివేసింది!! | JC Brothers Sons Loss in Anantapur | Sakshi
Sakshi News home page

అహంకారమే అణచివేసింది!!

Published Sat, May 25 2019 9:16 AM | Last Updated on Sat, May 25 2019 9:16 AM

JC Brothers Sons Loss in Anantapur - Sakshi

పవన్‌ ,అస్మిత్‌

సాక్షిప్రతినిధి, అనంతపురం : జేసీ దివాకర్‌రెడ్డి.. ‘అనంత’తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణ నేత. 1985కు ముందు రాజకీయ ఆరంగేట్రం చేసిన దివాకర్‌రెడ్డి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. ఆపై 1985లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 వరకు వరుసగా ఆరుసార్లు ఓటమి ఎరుగకుండా తాడిపత్రిలో ఏకఛత్రాధిపత్యం నడిపారు. 2014లో టీడీపీలో చేరారు. అప్పటి వరకు తాడిపత్రి వరకే పరిమితమైన జేసీ రాజకీయం మొదటిసారి అనంతపురం పార్లమెంట్‌ వరకు విస్తరించింది. ఎంపీగా గెలిచారు. తాడిపత్రి ఎమ్మెల్యేగా దివాకర్‌ సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. 2004–2014 వరకు కాంగ్రెస్, 2014–2019 వరకు టీడీపీలో వరుసగా 15ఏళ్లపాటు అధికారంలో ఉన్న జేసీ బ్రదర్స్‌ ఏది తప్పు? ఏది ఒప్పు? అనే విచక్షణ మరిచి ప్రవర్తించారు. చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న బాధ్యతాయుతమైన ఎంపీ, ఎమ్మెల్యేలమనే సంగతిని విస్మరించి ప్రవర్తించారు. ఈ ఐదేళ్లలో వీరు నోటి నుంచి వెలువడిన మాటలు...వాటికి ఉపయోగించిన భాష చూసి అంతా చీదరించుకున్నవారే! ఈ భాషేంటి అని అడిగితే..‘మేం పల్లెటూరోళ్లం...మా భాష ఇంతే!’ అహంకారపూరితంగా సమాధానం చెప్తారు. 

స్థాయి మరచి మాట్లాడారు..
దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు నందిగామ సమీపంలో ప్రమాదానికి గురై ప్రయాణికులు చనిపోతే.. ఈ వార్త రాసిన ‘సాక్షి’ పత్రిక ముందు ధర్నాకు జేసీ ప్రభాకర్‌రెడ్డి దిగారు. ప్రతిపక్షనాయకుడు కనీసం మర్యాద కూడా లేకుండా నోటికి ఏదొస్తే అది...పత్రికలో రాయలేని భాషతో అరగంట పాటు ఇష్టానుసారం మాట్లాడారు. దీనిపై జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తమ్ముడి కంటే తానేం తక్కువ కాదన్నట్లు జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి నుంచి మెప్పు కోసం ప్రతీ వేదికపై మైకు తీసుకుని సందర్భం కాకపోయినా, లేకపోయినా జగన్‌ ప్రస్తావన తీసుకొచ్చి ‘వాడు...వీడు!’ అనే సంబోధించారు. ఇదేంటని అడిగితే వయసులో నా కొడుకులాంటి వారు అని బుకాయిస్తారు. ప్రతిపక్షనేత అనే ఇంగితం కూడా మరిచారు. అంతకంటే లోకేశ్‌ చిన్నవాడు. దివాకర్‌రెడ్డి ఏ రోజైనా లోకేశ్‌ను అలా మాట్లాడారా? అలా మాట్లాడి టీడీపీలో ఒక్కరోజైనా నిలవగలడా? అన్నదమ్ములు ఇద్దరూ ఐదేళ్లుగా వ్యక్తిగతంగా ఇష్టానుసారం మాట్లాడిన ఏ ఒక్కరోజు కూడా జగన్‌ వారిని పల్లెత్తు మాట అనలేదు. అదీ జేసీబ్రదర్స్‌కు...జగన్‌రెడ్డికి ఉన్న తేడా! 

అరాచక పాలన..
తాడిపత్రి కేంద్రంగా జేసీ సోదరులు ఓ అరాచక పాలన సాగించారు. గ్రానైట్, ట్రాన్స్‌పోర్టు, మట్కా, పేకాట, కాంట్రాక్టులు, గెర్డావ్, సిమెంట్‌ ఫ్యాక్టరీలు....ఒకటేంటి...తాడిపత్రిలో ప్రతీ అంశాన్ని ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. ప్రతీ ఒక్కరూ వీరికి కప్పం కట్టాల్సిందే!! కాకపోతే అధికారంలో చేతిలో ఉండటంతో ఎదురుతిరిగితే ఇబ్బంది పెడతారని మౌనంగా భరించారు. వారికి ఎదురుచెబితే వారి ఇంటికి కరెంటు కట్‌ చేస్తారు! నీళ్ల సరఫరా చేయరు. మునిసిపాలిటీ చెత్త వారి ఇంటి ముందే ఉంటుంది. అద్దెకు నివాసం ఉన్నవారైతే ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని నుంచి ఒత్తిడి వస్తుంది! ఇలాంటి అరాచకాలతో తాడిపత్రి ప్రజలు నలిగిపోయారు. అయితే ఈ ఆవేశాన్ని పంటిబిగువన పెట్టుకుని అవకాశం కోసం ఎదురు చూశారు. 

అరాచకాలపై పెద్దారెడ్డి  అలుపెరుగని పోరు
కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జేసీ సోదరుల అరాచకాలపై పోరాడారు. దీంతో పెద్దారెడ్డిని ఇబ్బందిపెట్టాలని వారు చూశారు. కేసులు మోపి, జైలుకు పంపి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అయినా పెద్దారెడ్డి అలుపెరుగని పోరాటం చేశారు. ఇదే క్రమంలో అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలతో దివాకర్‌రెడ్డి పోరు పెట్టుకున్నారు. సిట్టింగ్‌లను మార్చాలని చంద్రబాబుతో పట్టుబట్టారు. దీంతో పార్లమెంట్‌లోని ఎమ్మెల్యేలంతా దివాకర్‌రెడ్డిపై తిరుగుబాటు చేశారు. ఇలా తాడిపత్రి, పార్లమెంట్‌ స్థానాల్లో ఇంటా, బయటా అటు ప్రజలతో ఇటు సొంతపార్టీ ఎమ్మెల్యేలతో దూరం పెంచుకున్నారు.

ఓటమే.. వారసత్వం
జేసీ సోదరులు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో తమ కుమారులను రాజకీయ వారసులుగా బరిలోకి దింపారు. ‘హైఫై లైఫ్‌’ గడిపే జేసీ పవన్‌రెడ్డిని ఎంపీగా, ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌ను ఎమ్మెల్యేగా బరిలోకి దింపారు. వీరి గెలుపుపై మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తే....ఎప్పుడు, ఏ ఎన్నికల్లో అయినా మేమే గెలుస్తామని సమాధానం చెప్పేవారు! ఈ మాటల్లో ధన, అధికార బల అహంకారం కన్పించేది! కానీ ఎన్నికల్లో ఘోరంగా వారసులు ఓడిపోయారు. నిజానికి పవన్, అస్మిత్‌లు రాజకీయనాయకులు కాదు. కేవలం వారసులుగా బరిలోకి దిగారు. అయితే వీరి ఓటమి మాత్రం వీరి తండ్రుల ఓటమే! ఒక్కమాటలో చెప్పాలంటే జేసీ బ్రదర్స్‌...వారి జూనియర్‌ బ్రదర్స్‌కు ఓటమిని వారసత్వంగా ఇచ్చారు. కనీసం 10–15 ఏళ్లపాటు వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోయే పరిస్థితి కన్పించలేదు. ఇప్పటికే వయస్సు మీద పడిన జేసీ బ్రదర్స్‌ 15 ఏళ్లకు మరింత వృద్ధులవుతారు. ‘సరదా జీవితం’ గడిపే పవన్‌ ఇన్నేళపాటు పదవి లేకుండా రాజకీయం చేయడం కష్టమే! అస్మిత్‌దీ అదే పరిస్థితి! టీడీపీ ఓటమికి జేసీ దివాకర్‌రెడ్డే ప్రధాన కారణమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మండిపడుతున్నారు. చంద్రబాబు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో చంద్రబాబు కూడా వీరిని దూరం పెట్టే పరిస్థితి! ఈ మొత్తం అంశాలను నిశితంగా పరిశీలిస్తే ఇక జేసీ బ్రదర్స్‌ రాజకీయం అనేది గతమే! అనంతపురం రాజకీయాల్లో ‘జేసీ’ అనే మాట బహుశా ఇక విన్పించకపోవచ్చు!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement