
అనంతపురం టౌన్: రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను ఆయన చాంబర్‌లో కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ వాడేనని, మంచి ముఖ్యమంత్రిగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడే ఆయన పాలనపై విమర్శలు మంచి పద్ధతి కాదన్నారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడన్నారు. చిత్తూరు జిల్లాలో చేపట్టిన రచ్చబండ పర్యటనకు వెళ్తూ వచ్చిన వెంటనే తనను, జానారెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన మరణించారన్నారు. తాను ఎప్పుడూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వ్యక్తిగతంగా ద్వేషించలేదని చెప్పారు. ఎన్నికల్లో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని.. ఎన్నికలపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నాలను కొనసాగిస్తానన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నుంచి ఆహ్వానం వస్తే ఏమి చేస్తారని అడగ్గా వచ్చినప్పుడు చుద్దాములే అంటూ సమాధానం దాట వేశారు.