
సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు నిర్దిష్టమైన సమాచారం ఉంటే ఇవ్వాలని, విచారణ జరిపిస్తామని అటవీశాఖ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. ‘తెలంగాణకు హరితహారం’కార్యక్రమంపై మంగళవారం శాసనమండలిలో జరిగిన చర్చలో మాట్లాడారు. హరితహారం కింద అవినీతి జరుగుతోందని, మొక్కలు నాటకున్నా, మొక్కలకు నీళ్లు పోయకపోయినా.. ఇవన్నీ చేసినట్లు కాగితాలపై తప్పుడు లెక్కలు చూపి కొందరు అధికారులు నిధులను స్వాహా చేస్తున్నారని విపక్ష నేత షబ్బీర్ అలీ, కాంగ్రెస్ సభ్యులు ఆకుల లలిత, పొంగులేటి సుధాకర్ రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి బదులిచ్చారు.
2019 నాటికి 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది నాటిన మొక్కల్లో 27.72 కోట్ల మొక్కలకు జియో ట్యాగింగ్ చేశామన్నారు. మొక్కల సంరక్షణకు వేసవిలో 3,200 ట్యాంకర్లతో నీరు అందించామన్నారు. అధికార పార్టీ సభ్యులు బి.వెంకటేశ్వరరావు, ఎం.శ్రీనివాస్ రెడ్డి, పూల రవీందర్, భూపాల్ రెడ్డి, ఎ.కృష్ణారెడ్డి.. హరితహారం ప్రయోజనాలు వివరించారు. భవిష్యత్తులో జరగనున్న జాతీయ రహదారుల విస్తరణను దృష్టిలో పెట్టుకుని కావాల్సిన స్థలాన్ని విడిచిన తర్వాతే హరితహారం కింద మొక్కలను నాటాలని బీజేపీ సభ్యుడు ఎం.రాంచంద్రరావు సూచించారు. హరితహారం కార్యక్రమంలో కక్కుర్తికి పాల్పడి దొంగ లెక్కలు చూపితే దేవుడు కూడా క్షమించడని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి పేర్కొన్నారు. 2019 నాటికి 140 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం వద్ద ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని ఎంఐఎం సభ్యుడు అమీనుల్ హసన్ జాఫ్రీ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment