సాక్షి, తిరుపతి : పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప పథకాలు ప్రవేశ పెడితే.. చంద్రబాబు ఏమో ప్రజలను మోసం చేయడానికి పథకాలను ప్రకటిస్తున్నారని బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య విమర్శించారు. చంద్రబాబు పెట్టిన ప్రతి పథకంలో ఒక కుంభకోణం ఉందని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. కాపులను మోసగించడానికి బీసీలకు అన్యాయం చేసున్నారని ఆరోపించారు. బీసీలు న్యాయమూర్తులుగా అవసరం లేదని చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గం అన్నారు. బీసీలకు సబ్‌ప్లాన్ అనేది బూటకమన్నారు. అనుభవం అనిచెప్పుకొంటున్న పార్టీకి ఓటెయద్దని బీసీలకు పిలుపునిచ్చారు.
తాను ఏ రాజకీయ పదవి కోరుకోవడంలేదని, సమసమాజ స్థానపనే తన లక్ష్యం అన్నారు. లేనివాడికి కూడా అధికారం ఇవ్వాలన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ బీసీలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారని ప్రశంసించారు. 41 మందికి ఎమ్మెల్యే టిక్కెట్లు, 7మందికి ఎంపీ టికెట్లు కేటాయించడం గొప్ప విషయమన్నారు. చంద్రబాబు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ మీద ఉన్న కేసుల్లో పసలేదని, అవి నిలబడే కేసులు కాదన్నారు. ఐఏఎస్ అధికారులకు క్లిన్‌చిట్ వచ్చిన తర్వాత జగన్ దోషి ఎలా అవుతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీలకు అందరు మద్దతు ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment