
హన్మకొండ: పదవి ఇప్పిస్తానని, పని ఇస్తానని ఎవరి నుంచైనా రూ.10 వేలు లంచం తీసుకున్నానని నిరూపిస్తే.. ఇప్పటికిప్పుడే పదవికి రాజీనామా చేస్తానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సవాల్ విసిరారు. హన్మకొండలో బుధవారం జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టానని కొంతమంది టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని.. కడియం శ్రీహరి అంటేనే ఆత్మగౌరవానికి, నీతికి నిలువెత్తు నిదర్శనమన్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా.. పని కోసమైనా లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. తెలంగాణను టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేకించిన సందర్భంలో ఆత్మగౌరవాన్ని చంపుకోలేక తాను టీఆర్‌ఎస్‌లో చేరినట్లు చెప్పారు.
టీడీపీ నాయకులు తమ బతుకుల కోసం చంద్రబాబుకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ‘తెలంగాణలో టీడీపీ ఉంటుందో .. ఊడుతుందో మీకే తెలియదు.. మాట్లాడుతున్నారని’నిప్పులు చెరిగారు. టీడీపీ నాయకులు తొందరపడి మాట్లాడొద్దని.. ఎవరు మంచి వారో.. ఎవరు చెడ్డవారో గుర్తించి మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోని, ఆలోచించని కాంగ్రెస్ సన్నాసులు.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తూ.. స్టేలు తెస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం సహా ఇతర రాష్ట్రాలన్నీ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకుని అభినందిస్తుంటే కాంగ్రెస్ రాష్ట్ర సన్నాసులకు కనపడటం లేదని తూర్పారబట్టారు. వీరికి కావాల్సింది, అవినీతి అక్రమాలని.. తిని పారేసిన ఎంగిలి ఇస్తార్లు నాకే ముఖాలని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జలయజ్ఞం, కలప, ఇసుక వ్యాపారం, భూదందాలు చేసి నిస్సిగ్గుగా దోచుకుతిన్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment