సాక్షి ప్రతినిధి, చెన్నై: పోలీసు కేసులకు బెదరను. అరెస్ట్‌లకు అదరను అంటున్నారు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్. తనను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఉద్రిక్తపరిస్థితులు తప్పవు అని హెచ్చరించారు. అరెస్ట్ చేయకుంటేనే మంచిదని హితవు పలికారు. కమల్ ఆగ్రహావేశ మాటల వివరాల్లోకి వెళ్లితే... మూడురోజుల క్రితం కరూరు జిల్లా అరవకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో ‘స్వతంత్ర భారతావనిలో తొలి తీవ్రవాది ఒక హిందువు, అతని పేరు నాథూరాం గాడ్సే. ఇతను మహాత్మాగాంధీని హత్యచేసిన వ్యక్తి. మహాత్మాగాంధీ మానసిక ముని మనుమడిగా న్యాయం కోరుతున్నానని అన్నారు.
హిందువులే తొలి తీవ్రవాదులని కమల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ సహా అన్ని హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. పోలీసులు స్టేషన్లలో కేసులు పెట్టారు. కమల్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా గురువారం నాటి ప్రచార సమయంలో పునరుద్ఘాటించడంతోపాటూ వివాదాస్పద వ్యాఖ్యలను కమల్‌హాసన్ సమర్థించుకున్నారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన కొందరు వ్యక్తులు కమల్‌పై చెప్పులు, రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. అయితే అవి కమల్‌పై కాకుండా ప్రచారవేదికపై పడ్డాయి. ఈ సంఘటనలో బీజేపీ, హిందూ సంఘాల కార్యకర్తలుగా అనుమానిస్తున్న 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
భయంతో ముందస్తు బెయిల్ కాదు: కమల్
కాగా, ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన శుక్రవారం నాడు సూలూరులో కమల్ ప్రచారం చేయాల్సి ఉంది. అయితే గురువారం నాటి ఘటనతో కమల్ ప్రచారంపై పోలీసుశాఖ నిషేధం విధించింది. ప్రచారం రద్దు కావడంతో కమల్ శుక్రవారం ఉదయం 9 గంటలకు తిరుచ్చిరాపల్లి నుంచి చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గాడ్సే గురించి తాను చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం తప్పుకాదని పునరుద్ఘాటించారు. నేను హిందువులందరినీ అనలేదు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, హిందువులు అని విభజించాలని కోరుతున్నాను.
చెన్నై లోక్‌సభ ఎన్నికల సమయంలో మెరీనాబీచ్ సభలో ఇవే వ్యాఖ్యలను, ఆనాడు లేని అభ్యంతరం ఈరోజు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకున్న వ్యక్తులే దీన్ని వివాదం చేశారని అన్నారు. ప్రధాని మోదీ కూడా ఖండిచారు. అయితే ఆయనకు తాను బదులిచ్చేందుకు సిద్ధంగా లేను, చరిత్రే ఆయనకు సమాధానం చెబుతుందని తెలిపారు. నన్ను అరెస్ట్ చేస్తారనే భయం లేదు.
బెదరడం లేదు. నన్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు మరింత దిగజారిపోతాయి, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి. ఈ మాటలు వేడుకోలుగా అనడం లేదు, హితవు పలుకుతున్నాను. నన్ను అరెస్ట్ చేయకుంటేనే మంచిది. అరెస్ట్ చేస్తారనే భయం వల్ల కోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోలేదు. ఎన్నికల ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉన్నందునే ముందస్తు బెయిల్ కోరాను. స్వతంత్రంగా మాట్లాడేందుకు అడ్డు తగులుతున్నారు, మత ప్రచారకులను మాత్రం మినహాయిస్తున్నారు.
నా వ్యాఖ్యలపై ఇతర పార్టీలవారు మద్దతుగా నిలవడాన్ని, సినీరంగానికి చెందిన వారు వెంటరాకపోవడాన్ని పట్టించుకోను. నాకు రాజకీయ చైతన్యం ఎంతో ఉంది, అందుకే సూలురులో ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నందునే తన ప్రచారంపై నిషేధం విధించారని అంటున్నారు, అదే నిజమైతే సూలూరులో ఎన్నికలను వాయిదావేయాలని కోరుతున్నాను. నా నాలుక కోస్తానని ఒక మంత్రి (రాజేంద్రబాలాజీ) బెదిరించారు, అందుకు నేను ఎంతమాత్రం చింతించడం లేదు. మంత్రి విచక్షణకే వదిలేస్తున్నాను.
నాపై రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లతో దాడులకు దిగినవారి తప్పులేదు, వారిని ఎవరో ప్రేరేపించి ఆ పని చేయించారు. నాపై జరిగిన దాడులకు ప్రతీకారంగా హింసాత్మక సంఘటనలకు పాల్పడవద్దని కార్యకర్తలను కోరారు. సోనియాగాంధీ నేతృత్వంలో ఈనెల 23న డిల్లీలో జరగనున్న ప్రతిపక్షాల సమావేశానికి ఇంతవరకు తనకు ఆహ్వానం రాలేదు. సోనియా సమావేశానికి కమల్‌కు ఆహ్వానం అందకపోవడంపై తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ అళగిరిని ప్రశ్నించగా లోక్‌సభ స్థానాలను గెలుచుకునే పార్టీలకు మాత్రమే ఆహ్వానం పలుకుతున్నామని బదులిచ్చారు.
అంతకంటే ముఖ్యంగా కమల్ ఏ కూటమివైపు ఉన్నారో స్పష్టం చేయాలని అళగిరి కోరారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసేముందు వాటివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను తెలుసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై కమల్‌కు హితవుపలికారు. కమల్ పార్టీతో బీజేపీ రహస్య సంబంధాలు పెట్టుకోలేదని ఆమె స్పష్టం చేశారు. కమల్‌లో ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని విమర్శించారు. కనీసం కౌన్సిలర్ ఎన్నికల్లో కూడా కమల్‌పార్టీ విజయం సాధించదని మంత్రి రాజేంద్రబాలాజీ ఎద్దేవా చేశారు. కాగా, కమల్ నాలుక కోస్తానని వ్యాఖ్యానించిన మంత్రి రాజేంద్రబాలాజీపై కమల్‌పార్టీ కార్యకర్తలు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం కుంభకోణంలో హిందూమక్కల్ కట్చి కార్యకర్తలు కమల్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment