
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో శాంతి, భద్రతలు కరువయ్యాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. తన ఫోన్లను చంద్రబాబు ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన ఢిల్లీలో రాజ్‌నాథ్‌ను కలసి రాష్ట్ర పరిస్థితులను వివరించారు. టీడీపీ నాయకుల అవినీతి, అక్రమాలను బయటపెడుతున్న వారిపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. అమిత్ షాతో పాటు తనపైనా, సోము వీర్రాజు పైనా దాడులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని రాజ్‌నాథ్‌కు వివరించారు. ‘ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఏ విధంగా దొరికిపోయారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ టెక్నాలజీని చంద్రబాబు తన రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు. పోలీసులు ద్వారా నా ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమావేశం అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ సీనియర్ నేత సత్యమూర్తి భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment