
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల బిల్లులను ఆమోదించవద్దంటూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శనివారం లేఖ రాశారు. పరిపాలన వికేంద్రీకరణకు వీలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యం కాదని ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ, ‘కన్నా’ రాసిన లేఖపై పార్టీ ముఖ్యులు కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. బీజేపీకి రాజకీయంగా నష్టం చేకూర్చేలా, తెలుగుదేశం పార్టీ లైన్‌లో ఈ లేఖ ఉందని.. ఇది రాసేటప్పుడు ఎవ్వరినీ కూడా సంప్రదించలేదని ఇద్దరు ముఖ్యనేతలు ‘కన్నా’ వద్ద తీవ్ర అభ్యంతరం చేసినట్లు సమాచారం.
టీడీపీ నేతలు లేఖ రాసిన కొద్దిసేపటికే ‘కన్నా’ కూడా రాయడం ఏమిటని ఆ పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని కేంద్రంలో పార్టీ ముఖ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు దీనిపై ఆరా తీసినట్లు తెలిసింది. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. పార్టీ వైఖరికి భిన్నంగా ‘కన్నా’ లేఖ ఉందని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. బిజినెస్ రూల్స్ ప్రకారం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను సాధారణంగా గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుందని.. కానీ, ‘కన్నా’ లేఖవల్ల పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు ముఖ్యనేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. కన్నా లేఖపై అవసరమైతే కేంద్ర పార్టీ పెద్దలు గవర్నర్‌కు వివరణ ఇచ్చే అవకాశం ఉందని ఒక ముఖ్యనేత చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment