రాష్ట్ర చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. శ్రావణ శుక్రవారం పర్వదినం ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి శుభ సంకేతాన్ని అందించింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ప్రాంతీయ సమానాభివృద్ధి దిశగా అతిపెద్ద ముందడుగు పడింది. మూడు రాజధానుల వ్యవస్థతో ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక విధాన నిర్ణయం రాజ్యాంగ ప్రక్రియను పూర్తి చేసుకుంది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదించారు. రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలోనూ తీవ్ర ఆసక్తి కలిగించిన ఈ బిల్లులపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారా అన్న ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది. ఆ బిల్లులను అన్ని కోణాల్లో పరిశీలించి, న్యాయ నిపుణులతో చర్చించి, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న అనంతరం గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని... అమరావతిలో శాసన రాజధాని... కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
సాక్షి, అమరావతి: విస్తృత ప్రజామోదంతో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించడంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మూడు ప్రాంతాల్లోని ప్రజలు స్వాగతిస్తున్నారు. విద్యార్థులు, యువత, మేధావులు, రైతులు, కార్మికవర్గాలు, సామాన్యులు...ఇలా అన్ని వర్గాలు గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించాయి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి.
గవర్నర్‌పై టీడీపీ విమర్శలను ఖండించిన బీజేపీ
మూడు రాజధానులను అడ్డుకోవడానికి ప్రతిపక్ష టీడీపీ పన్నిన కుట్రలు, కుయుక్తులు బెడిసికొట్టాయి. వికేంద్రీకరణపై ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకంగా స్పందించింది. గవర్నర్ నిర్ణయాన్ని చంద్రబాబు, ఆ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వంతో పాటు గవర్నర్‌ను కూడా చంద్రబాబు నిందించారు. కాంగ్రెస్, సీపీఐ కూడా టీడీపీతో గొంతు కలిపాయి. బీజేపీ మాత్రం ఈ నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఏమీ లేదని వ్యాఖ్యానించింది. రాజ్యాంగ విలువలకు లోబడి గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని, దీనిపై బీజేపీ వ్యాఖ్యానించదని స్పష్టం చేసింది. అయితే, అమరావతే రాజధానిగా కొనసాగాలన్నది తమ పార్టీ రాష్ట్ర శాఖ అభిమతమని పేర్కొంది.
రెండు బిల్లులకు ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను శాసనసభ ఈ ఏడాది జనవరి 20న ఆమోదించి 21న శాసనమండలికి పంపింది. కాగా మండలిలో టీడీపీ రాద్ధాంతం చేసి ప్రతిష్టంభన సృష్టించడంతో ఆ బిల్లులు ఆగిపోయాయి. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలన్న టీడీపీ, నిబంధనలకు విరుద్ధంగా నానా యాగీ చేసింది. నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో టీడీపీ వాదన బెడిసికొట్టింది.
► పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లును గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడంతో అవి చట్టాలుగా మారాయి. ఆ మేరకు రాష్ట్ర న్యాయశాఖ శుక్రవారమే వేర్వేరుగా గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీంతో మూడు రాజధానుల ఏర్పాటు సాకారం కానుంది.
► పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించాలని ప్రభుత్వం ఆ రెండు బిల్లులకు రూపకల్పన చేసింది. వీటిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ నానా యాగీ చేసింది.
► ఆర్టికల్ 197(1)(బి) ప్రకారం దిగువ సభ ఆమోదించిన ఒక బిల్లు ఎగువ సభకు వెళ్లి ఆమోదం పొందక పోయినా, నిలిచి పోయినా మూడు నెలల నిర్ణీత వ్యవధి దాటితే మళ్లీ శాసనసభ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రకారం రెండోసారి జూన్ 16న సమావేశమైన శాసనసభ మరోసారి ఈ బిల్లులను ఆమోదించి పంపింది.
► జూన్ 17వ తేదీన శాసనమండలిలో టీడీపీ మళ్లీ అదే రీతిలో నానా యాగీ చేసి బిల్లుల ఆమోదానికి మోకాలడ్డింది.
► ఆర్టికల్ 197(2)(బి) ప్రకారం ఇలా రెండోసారి కూడా ఎగువ సభ ఆమోదం పొందకుండా ఒక బిల్లు నిలిచి పోతే, 30 రోజుల వ్యవధి కనుక దాటితే ఆ బిల్లును ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు. ప్రస్తుతం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల విషయంలో కూడా అదే జరిగింది.
► నిబంధనల మేరకు శాసన వ్యవస్థ ఈ బిల్లులను ఆమోదించడంతో జూలై 18న గవర్నర్ వద్దకు పంపారు. గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించడంతో మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
సమగ్రంగా పరిశీలించాకే ఆమోదం..
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ఆమోదించే ముందు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విస్తృత కసరత్తు చేశారు. రాజ్యాంగ నిబంధనలు, శాసన ప్రక్రియ, న్యాయపరమైన అంశాలను నిశితంగా పరిశీలించారు. న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించారు. అన్ని కోణాల్లో పరిశీలించి ఆ రెండు బిల్లులు రాష్ట్ర విస్తృత ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న అనంతరమే వాటికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు.
ఈ బిల్లులు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లులు ఇతర రాష్ట్రాలకూ మార్గనిర్దేశం చేస్తాయని నిపుణులు వ్యాఖ్యానించారు.
వేర్వేరుగా గెజిట్ నోటిఫికేషన్ జారీ
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించిన నేపథ్యంలో ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ రెండు బిల్లులకు వేర్వేరుగా గెజిట్‌లను విడుదల చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి జి.మనోహర్‌రెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
శాసన ప్రక్రియ, పార్లమెంట్ చట్టాన్ని పరిశీలించిన గవర్నర్...
► ఈ బిల్లుల ప్రాముఖ్యతను గుర్తించిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయించారు. రాజధాని ఏర్పాటుపై రాజ్యాంగ నిబంధనలను పరిశీలించారు. బిల్లులకు సంబంధించి అసెంబ్లీ, మండలిలో సాగిన శాసన ప్రక్రియను పూర్తిగా తెలుసుకున్నారు.
► బిల్లుల ఆమోదానికి సంబంధించిన వ్యవహారాలపై శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యుల నుంచి గవర్నర్ నివేదిక తెప్పించుకుని అధ్యయనం చేశారు. ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి ఎందుకు పంపించలేదన్నదానిపై వివరణ తీసుకున్నారు.
► ఆ బిల్లులపై కొందరు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసిన నేపథ్యంలో న్యాయపరమైన అంశాలకు గవర్నర్ ప్రాధాన్యమిచ్చారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా ఆ రెండు బిల్లులు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు పార్లమెంటు చేసిన చట్టాన్ని పరిశీలించారు. అమరావతిలో భూసమీకరణకు సహకరించిన రైతుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అంశాలను సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులో పొందుపరిచారో లేదోనని గమనించారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికను సమీక్షించారు.
► ప్రతిపక్ష నేత చంద్రబాబు, బీజీపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలతోపాటు పలువురు రాజకీయ నేతలు, వివిధ సంఘాలు, సామాన్యులు ఇచ్చిన వినతిపత్రాలను గవర్నర్ పరిశీలించారు.
► పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్ని కోణాల్లోనూ నిశితంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి వచ్చారు. ఆ రెండు బిల్లులు పూర్తిగా రాజ్యంగ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని, శాసన ప్రక్రియ సవ్యంగా సాగిందని, అమరావతిలో భూములిచ్చిన రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందని గుర్తించారు. ఇలా అన్ని విధాలుగా సంతృప్తి చెందిన తరువాతే గవర్నర్ ఆ రెండు బిల్లులకు ఆమోదముద్ర వేశారు.
Comments
Please login to add a commentAdd a comment