మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రజలను మరోసారి మోసగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు కేవలం రూ.వెయ్యి కోట్లు కావాలని అడిగితే ఏడాదికి రూ.3,200 కోట్లు చొప్పున ఐదేళ్లకు రూ.16 వేల కోట్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇస్తామని వెంకన్న సాక్షిగా చెప్పారన్నారు. అయితే ఇవ్వాల్సిన మొత్తంలో ముందుగానే 30 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్ర పర్యటనను బుధవారం శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో నాయకులు, కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.16 వేల కోట్లు ఇస్తామని ప్రకటించినప్పుడు మోదీ, అమిత్‌షా, వెంకయ్యనాయుడులను పొగడ్తలతో చంద్రబాబు ముంచెత్తారని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులను చక్కగా మెక్కేసి ఎన్నికల సమయం దగ్గరవ్వడంతో తప్పులన్నీ బీజేపీపై, కేంద్రంపై నెట్టేసి మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు.
ప్రజలు నమ్మరు: కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చంద్రబాబును ఈసారి ప్రజలు నమ్మరన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఫీజుబిలిటీ లేదని చెప్పినప్పటికీ నిపుణుల కమిటీ వేసి స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధం ఉన్నామన్నారు. కడప స్టీల్‌ప్లాంట్ ఇస్తారని తెలిసీ ప్రజల మెప్పుకోసం సీఎం రమేష్ దీక్ష చేస్తాననడం సిగ్గుచేటన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. విశాఖ రైల్వే జోన్‌కు అన్ని దస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని తెలిసీ టీడీపీ ఎంపీలు ధర్నాలు చేసేందుకు సిద్ధమై ప్రజల నుంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్నారన్నారు.
వీటిన్నింటిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 2014లో మోసపూరిత హామీలిచ్చి చంద్రబాబు ఏ ఒక్కటీ అమలు చేయలేదని మండిపడ్డారు. వెనుకబడిన కులాలవారు న్యాయవృత్తికి పనికిరారని ముఖ్యమంత్రిగా లేఖ రాయడం సరికాదన్నారు. సమావేశంలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయరావు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment