సాక్షి, అమరావతి: విభజన చట్టం హామీలు, ప్రత్యేక హోదా సాధన కోసం నాడు ప్రతిపక్ష నేతగా నేడు సీఎంగా పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. విభజన హామీలు, హోదా గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదన్నారు. అవినీతికి కక్కుర్తిపడి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని చంద్రబాబు నీరుగార్చారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా గురించి టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు తదితరులు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు కన్నబాబు సమాధానమిచ్చారు. వైఎస్ జగన్ గుంటూరు, ఢిల్లీలలో దీక్షలు, ధర్నాలు చేయడంతో పాటు ఆయన రాష్ట్ర మంతటా యువభేరి సదస్సులతో చైతన్యం రగిలించారని వివరించారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించారని గుర్తుచేశారు. తెలంగాణకు ఇచ్చిన భవనాలు ఏవీ విభజన చట్టం పరిధిలో ఉన్నవి కావని తెలిపారు.
రైతులకు రాజకీయాలు ముడిపెట్టకండి
రైతులకు రాజకీయాలు ముడిపెట్టొద్దని, రైతులపై అంత ప్రేమ ఉంటే ఐదేళ్ల టీడీపీ పాలనలో ఎందుకు పట్టించుకోలేదని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో రైతు రుణమాఫీపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు కన్నబాబు ఘాటుగా బదులిచ్చారు. రైతులకు రుణమాఫీ పూర్తిగా చేస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత ఏం చేశారో అందరికీ తెలుసునన్నారు. రైతు రుణాలు రూ. 86 వేల కోట్లుగా ఉంటే.. చివరకు రూ. 15 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని కన్నబాబు గుర్తుచేశారు. తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే పెట్టుబడి సాయంగా రైతు భరోసాను చెప్పినదాని కంటే ముందే అమలు చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, సోము వీర్రాజు, పి.అశోక్‌బాబు, ఏఎస్ రామకృష్ణ పలు అంశాలు ప్రస్తావించారు.
3.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
మార్కెట్ స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటి వరకు 3 లక్షల 62 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిందని, రోజూ రూ. 50 కోట్ల వరకు రైతులకు చెల్లింపులు జరుగుతున్నాయని మంత్రి కన్నబాబు చెప్పారు. సచివాలయంలో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,287 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అవసరాన్ని బట్టి వాటిని 1,578కి పెంచుతున్నామని చెప్పారు. 48 గంటల్లో రైతు ఖాతాకు డబ్బులు జమ చేస్తామన్నారు. ముతకరకం ధాన్యం క్వింటాలు రూ. 1,830కు కొంటున్నామని, కనీస మద్దతు ధర కంటే తక్కువగా కొన్న ఉదంతాలు ఎక్కడా లేవన్నారు. ముతక రకాలను వదిలి పెట్టి ఫైన్ వెరైటీలు పండించాలని రైతులకు సూచిస్తున్నామన్నారు. ఇ–క్రాప్ బుకింగ్ లేకపోయినా ఆఫ్‌లైన్‌లో ఉత్పత్తులు కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రైతు రుణాలను ఎగవేసిన విషయంలో చంద్రబాబుపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
‘హోదా’ యోధుడు.. వైఎస్ జగనే
Published Tue, Dec 10 2019 5:08 AM | Last Updated on Tue, Dec 10 2019 5:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment