సాక్షి, అమరావతి: చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతూ రైతుల్ని గందరగోళానికి గురి చేయాలని చూస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆయనకు దమ్ముంటే రైతులకు ఎవరు అన్యాయం చేశారో చర్చించేందుకు చర్చకు రావాలని సవాల్ చేశారు. వయసు మీరిన ఆయన కృష్ణా.. రామా.. అనుకోకుండా దేనికోసమో ఆరాట పడుతున్నారని ధ్వజమెత్తారు. రైతు భరోసాపై బాబు వ్యాఖ్యలను తప్పుపడుతూ శనివారం ఆయన విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఏమన్నారంటే..
విత్తనాల కోసం ఇక బారులు తీరరు
► ఈ నెల 18 నుంచి రాయితీపై విత్తనాల పంపిణీ ప్రారంభిస్తున్నాం. పచ్చిరొట్ట విత్తనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. ఖరీఫ్ సీజన్ కన్నా ముందే విత్తనాలు సరఫరా చేస్తున్నాం.
► విత్తనాలు కావాలనుకునే రైతులు ముందుగా తమ పేర్లను, విత్తన రకాన్ని, పరిమాణాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలా చేసిన వారికి ఏ తేదీన విత్తనాలు ఇస్తారో చెబుతారు.
► గత ఏడాది కంటే అదనంగా లక్ష క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను ఈ ఏడాది సిద్ధంగా ఉంచాం. విత్తనాల కోసం క్యూలు ఇక కనిపించవు.
ఓర్వలేక ప్రేలాపనలు
► రైతుకు మేలు చేయడమే ధ్యేయంగా జగన్ పని చేస్తుంటే ఓర్వలేక బాబు ఏవేవో ప్రేలాపనలు చేస్తున్నారు.
► ముఖ్యమంత్రిగా బాబు పనికి రాడనే ప్రజలు పక్కన కూర్చోబెట్టి 23 సీట్లు ఇచ్చారు. వారిలో ముగ్గురు ఆయన్ను వ్యతిరేకిస్తున్నా.. ఇంకా పగటి కలలు కంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం మాఫీ చేయాల్సిన మొత్తం రూ.87,612 కోట్లయితే అందులో రూ.70 వేల కోట్లకు పైగా ఎగనామం పెట్టారు.
► చివరకు తానిస్తానన్న నాలుగైదు విడతల రుణమాఫీ నిధుల్ని కూడా రైతులకు ఇవ్వలేదు. దానికి భిన్నంగా వైఎస్ జగన్ ఇచ్చిన మాట కంటే ఎక్కువగా రూ.13,500 ఇస్తున్న మాట నిజం కాదా? ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తానని చెప్పిన జగన్.. ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్ల పాటు రూ.67,500 ఇస్తుంటే మీ పిచ్చి లెక్కలేంటి? ఇంత చేస్తుంటే ఓర్చుకోలేక మీ మీడియా ఉంది కదా అని అబద్ధాలు చెబుతారా?
► ఇక మీ పని అయిపోయింది. పార్టీ పగ్గాలు ఎవరికైనా అప్పగించండి.
Comments
Please login to add a commentAdd a comment