
ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
సాక్షి, సిద్దిపేట : ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగా అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ హుస్నాబాద్‌లో ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాటు చేశారు. ఈ సభ ద్వారా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఎన్నికల శంఖారావం పూరించారు. సభలో ప్రసంగించిన కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డిపై విమర్శలు గుప్పించారు. వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇస్తే.. గులాబీ కండువా కప్పుకుని ఎన్నికల్లో ప్రచారం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా జానారెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మాటకు కట్టుబడి జానారెడ్డి టీఆర్‌ఎస్ తరపున ప్రచారం చేస్తారా అని సవాల్ విసిరారు. కరెంటు వెలుగులు జానారెడ్డికి కనబడక పోతే.. కంటివెలుగు ద్వారా చికిత్స చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రం సాధించిన అభివృద్ధిని చూడకుండా అడ్డగోలు విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు.
దేశాన్ని ముంచారు..
నిర్విరామంగా యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధోగతిపాలు చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ దరిద్రపు పాలనతో యావత్ భారతదేశం పేదరికంలో మగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనున్న చైనా దేశంలో.. రెండు లక్షల 23 వేల కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ హైవేలు ఉంటే.. భారత దేశంలో 1900 కి.మీ రహదారులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా ట్రక్కుల సగటు వేగం గంటకు 80 కిలోమీటర్లు అయితే.. భారత్‌లో గంటకు 24 కి.మీ. మాత్రమేనని అన్నారు. ఇంటర్నేషనల్‌గా గూడ్స్ రైళ్ల వేగం గంటకు 86 కి.మీ అయితే.. భారత్‌లో 36 కి.మీ మాత్రమేనని పేర్కొన్నారు. దేశం ఇంతటి వెనకబాటుకు కాంగ్రెస్ అసమర్థ, అవివేవ విధానాలే కారణమని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment