సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల షెడ్యూల్‌పై అంచనాలు తప్పడంతో టీఆర్‌ఎస్ కాస్త ఆందోళన చెందినా.. ఈ పెరిగిన గడువును సమర్థవంతంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. కేసీఆర్ ఊహించినదానికంటే నెలరోజులు ఆలస్యంగా ఎన్నికలు జరుగుతుండటంతో.. అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లనుంది. ఇందులో భాగంగానే.. టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచార సరళిపై సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. అభ్యర్థుల ప్రచార తీరుపై వివరాలను టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ బాధ్యులను అడిగి తెలుసుకున్నారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే పలువురు అభ్యర్థులకు ఫోన్‌లో సూచనలు చేశారు. ఈ రెండు నెలల కాలాన్ని ఎక్కడా ప్రణాళికాలోపం లేకుండా సక్రమంగా వినియోగించుకోవాలని.. మరోదశ ప్రచారం చేసుకునేందుకు వీలుగా షెడ్యూల్ రూపొందించుకోవాలని ఆయన ఆదేశించారు. గ్రామస్థాయిలో పార్టీ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంతోపాటు.. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. త్వరలోనే వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో బహిరంగసభలు నిర్వహిస్తామన్నారు. అన్నీ పరిశీలించి తేదీలు ఖరారు చేస్తామని అభ్యర్థులకు సీఎం తెలిపారు. అక్టోబరు 9 తర్వాత పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని.. ఈ నియోజకవర్గాల్లోనూ ప్రచారాన్ని పెంచాలని ఆయా సెగ్మెంట్లలోని ఆశావాహులకు సూచించారు.
మేనిఫెస్టోపై ఆచితూచి..
నిరంతరం అభ్యర్థుల ప్రచారాన్ని సమీక్షిస్తున్న కేసీఆర్.. మెనిఫెస్టో విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మేనిఫెస్టో రూపకల్పనపై ఏర్పాటుచేసిన కమిటీ తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. ప్రజల్లో ఆదరణ ఉంటుందని భావిస్తున్న పథకాలను.. కేసీఆర్‌తో చర్చించి మరీ మేనిఫెస్టోలో చేరుస్తోంది. అయితే.. ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా మేనిఫెస్టో ఉండాలని సీఎం భావిస్తున్నారు. వారి కంటే రెండడుగులు ముందుండాలనే వ్యూహంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఇందుకోసం.. ఆయా పార్టీలన్నీ తమ ఎన్నికల హామీలను ప్రకటించిన తర్వాతే టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలను ఆకట్టుకునే ఎన్నికల హామీల విషయంలో ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని ఆయన భావిస్తున్నారు. అమరవీరుల విషయంలోనూ మరింత పకడ్బందీగా వ్యూహరచన చేయనున్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని అంశాలు ప్రజాదరణ పొందాయి. ‘బంగారు తెలంగాణ’నినాదం పార్టీకి మంచి ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఇలాంటి వ్యూహంతోనే ముందుకెళ్లాలని మేనిఫెస్టో కమిటీ భావిస్తోంది. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు ఆధ్వర్యంలో 16 మంది ముఖ్యనేతలతో ఏర్పాటైన ఈ కమిటీ.. సెప్టెంబరు 15న తొలిసారి సమావేశమైంది. మరో నాలుగుసార్లు భేటీ అయిన తర్వాత మేనిఫెస్టో తుది ముసాయిదా సిద్ధం చేస్తామని.. పదిహేను రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి అధినేతకు అందజేస్తామని పేర్కొంది. అయితే.. గడువు దాటినా మేనిఫెస్టో కమిటీ సమావేశం కాలేదు. ప్రతిపక్ష పార్టీల మేనిఫెస్టోలోని అంశాలను పరిశీలించిన తర్వాతే టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయాలనే ఉద్దేశమే.. ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.
ప్రతి అంశాన్ని కూలంకషంగా..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించనున్నారు. ప్రధానంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో కొత్త విధానాన్ని ప్రకటించే విషయంపైనా కమిటీ దృష్టి సారించింది. నిరుద్యోగులకు భృతి విషయాన్ని ప్రకటించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ‘ఆసరా పింఛన్ల’మొత్తాన్ని పెంచేలా మేనిఫెస్టోలో చేర్చినట్లు సమాచారం. సమాజంలోని అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు.. ఈ వర్గాలన్నింటికీ అన్ని పథకాలు వర్తింపజేసే విధానాన్ని పరిశీలిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘డబుల్ బెడ్ రూం’పథకం అమలుకు కొత్త విధానం అమలు చేయనున్నట్లు మేనిఫెస్టోలో వెల్లడించే అవకాశాలున్నాయి. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ పరంగా సబ్సిడీ రూపంలో సాయం అందించేలా ఈ విధానంలో మార్పులు చేస్తోంది. రుణమాఫీ అంశాన్ని ఈసారి కూడా మేనిఫెస్టోలో చేర్చాలని భావిస్తున్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల విషయంలో దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మరిన్ని కొత్త పథకాలను చేర్చే విషయాన్ని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించే అవకాశం ఉంది.
సారూ.. మా డిమాండ్లను చేర్చరూ..!
టీఆర్‌ఎస్‌కు బహిరంగంగా మద్దతు తెలుపుతున్న కొన్ని వర్గాలు.. తమకు కావాల్సిన అంశాలపై వినతిపత్రాలిస్తున్నాయి. కేటీఆర్, హరీశ్ రావు, కవిత సహా పలువురు ముఖ్యనేతలను కలుస్తున్న రోజుకో వర్గం నేతలు మద్దతు తెలపడంతోపాటు.. తమకు న్యాయం చేసేలా మేనిఫెస్టోలో ప్రకటించాలని కోరుతున్నారు. అసెంబ్లీ రద్దుచేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించినప్పటినుంచీ.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావును రోజూ ఏదో ఒక సంఘం ప్రతినిధులు కలవడం, వినతి పత్రాలు ఇవ్వడం సాధారణమైపోయింది. కమిటీ మొదటి సమావేశం నాటికే 170 వినతులు రాగా.. ఆ తర్వాత మరో 50 వరకు వచ్చినట్లు తెలిసింది. వీటిని పరిశీలించేందుకు కమిటీ త్వరలోనే మరోసారి భేటీ కానుంది.
Published Mon, Oct 8 2018 1:17 AM | Last Updated on Mon, Oct 8 2018 10:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment