సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ జగన్‌ను ఫోన్లో పరామర్శించారు. గాయం తీవ్రత, చికిత్స వివరాలు జగన్‌ను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
కాంగ్రెస్ నేతల పరామర్శ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా వైఎస్ జగన్‌ను పరామర్శించారు. వైఎస్ జగన్‌పై దాడిని ఖండిస్తున్నామని, ప్రజస్వామ్యంలో హింసకు తావు లేదని ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి అన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని తెలంగాణ శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఖండించిన కె లక్ష్మణ్
ప్రజా జీవితంలో ఉన్నవారు, ప్రజలకు దగ్గరగా ఉన్న సమయంలో దాడి చేయడం అనాగరికమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. పలకరిస్తూ, ఫోటో దిగాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి కత్తితో దాడి చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలన్నారు. ప్రజాస్వామ్య వాదులందరూ రాజకీయ కోణంతో కాకుండా ఈ దాడిని ఖండించాలని కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి దీని వెనుక ఉన్న కుట్ర కోణాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment