
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రతిపక్ష నేతపై టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. నిజంగా టీడీపీ కార్యకర్తలుగానీ, టీడీపీ వ్యక్తులుగానీ చేయాలనుకుంటే జగన్‌మోహన్‌రెడ్డిని రోడ్డు మీద కైమా కైమా చేసేవాళ్లని, దానికి సీఐఎస్‌ఎఫ్ కంట్రోల్‌లో ఉన్న ఎయిర్‌పోర్టుకు వెళ్లి చేయాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో నువ్వు మూడువేల కిలోమీటర్ల మేరకు నడిచావు. నీకు భద్రత బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ఎప్పుడైతే సీఐఎస్‌ఎఫ్ కంట్రోల్‌లో ఉన్న ఎయిర్‌పోర్టుకు వెళ్లావో నీ భద్రత పోయింది. అంటే ఎవరి వైఫల్యం ఇది? కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఇది.. టీడీపీ ప్రభుత్వం వైఫల్యమెలా అవుతుంది?..’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
నిజంగా ఏపీ పోలీసులదే పని అయితే పౌర విమానయాన మంత్రి సీఐఎస్‌ఎఫ్ పోలీసులను విచారణ జరపమని ఆదేశించడం ఎందుకన్నారు. ‘‘ఎయిర్‌పోర్టులో ఘటన జరిగిన వెంటనే హైదరాబాద్ ఎందుకు వెళ్లినట్టు? కావాలని చెప్పి నాటకాలు ఆడుతున్నారు. వేల కిలోమీటర్లు నడిచినప్పుడు జనాదరణ కనిపించలేదు. నీ పాదయాత్ర ముగింపునకు వచ్చింది. ప్రజాదరణ కనిపించకపోవడంతో పాదయాత్ర ముగించే సందర్భంలో ప్రజల్లో సానుభూతికోసం నీ అభిమానితో దాడి జరిపించుకున్నావు.
నువ్వు వచ్చే సమయం అతడికి చెప్పావు. టీ ఎప్పుడు ఇవ్వాలి.. కాఫీ ఎప్పుడు ఇవ్వాలో చెప్పావు.. పాదయాత్ర ద్వారా రాని సింపతీని కోడి కత్తి ద్వారా తెప్పించుకోవాలని చూశావు. నీ తొత్తులు ఆడే నాటకం ఆపాలి..’’ అంటూ తన అక్కసు వెళ్లగక్కారు. ‘‘దాడి జరగగానే కత్తి మాయమైంది. సాయంత్రం వరకూ పోలీసులకు చేరలేదు. దానిని ఫోరెన్సిక్‌కు పంపాలి. కత్తి మాయం చేశావు. హైదరాబాద్ వెళ్లావు. దాడి జరిగింది మధ్యాహ్నం అయితే సాయంత్రం హాస్పిటల్‌కు వెళ్లావు. మానవుడివి కాదా.. నీకు దాడి జరిగిన వెంటనే రక్తం కారలేదా? ఇవన్నీ నాటకాలు..’’ అంటూ ప్రతిపక్ష నేతపై ఎంపీ అమర్యాదకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ.. ‘వైఎస్సార్‌సీపీ హత్యారాజకీయాలు సృష్టించి డ్రామాలు చేస్తోంది. ఏపీలో శాంతిభద్రతలు లేవని చెప్పేందుకు ఈ డ్రామా సృష్టించారు’ అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment