kesineni Srinivas (Nani)
-
కేశినేని ట్రావెల్స్‌లో రెండు స్టీరింగ్‌లు..!
ఎంపీగా ఆయనేమో ఎవరినీ పట్టించుకోడు. ఎవరైనా ఏదైనా అంటే మాత్రం ఊరుకోడు. అందుకే పార్టీ నాయకత్వం చాపకింద నీరులా సొంత తమ్ముడినే ఆయన మీద ప్రయోగిస్తుందన్న టాక్ పార్టీలో నడుస్తోంది. ఇక ఎంపీగారి తమ్ముడు కూడా లేదు లేదంటూనే... క్యాడర్ నంతా తన వైపుకు తిప్పుకునేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ సైకిల్ పార్టీలో అన్నకు ఎసరు పెడుతున్న ఆ తమ్ముడు ఎవరు? బ్రదర్ వర్సెస్ బ్రదర్ బెజవాడ తెలుగుదేశం పార్టీ నాయకత్వం నాయకుల కుటుంబాల్లో చిచ్చు పెడుతోందన్న చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో ఏ ఇద్దరు తెలుగు తమ్ముళ్లను కదిపినా కేశినేని సోదరుల ఇంటి పోరు గురించే చర్చించుకుంటున్నారట. కొంత కాలంగా ఎంపీ కేశినేని నాని పార్టీ అధినేతతో పాటు క్యాడర్ తోనూ టచ్ మి నాట్ అంటూ దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ ముఖ్య కార్యక్రమాలకు సైతం కేశినేని నాని డుమ్మా కొట్టేస్తున్నారు. ఐతే పార్టీకి తల్లో నాలుకలా ఉండాల్సిన పార్లమెంట్ సభ్యుడు తలనొప్పిగా మారడంతో అధినేతతో పాటు నాయకులు, క్యాడర్ అంతా నాని వ్యవహారశైలి పై గుర్రుగా ఉంటున్నారట. ఇక నాని వైఖరితో విసిగిపోయిన చంద్రబాబు, చినబాబు కేశినేనికి సొంత ఇంటి నుంచే ఎసరు పెట్టాలని ఫిక్సయిపోయారట. అందుకే కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాధ్‌ను తెరపైకి తెచ్చారు. ఇదిలా ఉంటే తనపై కిందస్థాయి నాయకులు ఫిర్యాదులు చేయడం... అధినేత సెటిల్ మెంట్లు చేయడం నచ్చక కేశినేని నాని తన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. తనకు గుర్తొచ్చినప్పుడు మాత్రమే ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ అటెండెన్స్ వేయించుకుంటున్నారు. తమ్ముడి వెనక బాబు మొన్నటి వరకూ పార్టీ నేతలతోనే పొసగడం లేదంటే.. ఇప్పుడు పార్టీ అధినాయకత్వం కూడా నానికి పొగ పెడుతోందన్న ప్రచారం సాగుతోంది. నాయకత్వం సూచనల మేరకు నాని తమ్ముడు శివనాథ్ అలియాస్ చిన్ని చాపకింద నీరులా దూసుకుపోతున్నాడట. దీంతో సొంత కుటుంబం నుంచే పోటీ మొదలవ్వడం నానికి చిరాకు తెప్పిస్తోందంటున్నారు. చిన్ని కూడా తాను అన్నకు ఎలాంటి పోటీ కాందంటూనే పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ శివనాధ్ అందరినీ కలుపుకుపోతున్నాడట. నియోజకవర్గం ఏదైనా నేనున్నాంటూ వాలిపోతున్నాడట. తిరువూరు నుంచి బెజవాడ తూర్పు నియోజకవర్గం వరకూ అన్ని నియోజకవర్గాల్లోనూ తన మార్క్ ఉండేలా కార్యక్రమాలు చేస్తున్నాడట. కేశినేని ఫౌండేషన్ పేరుతో మెడికల్ క్యాంప్ లు, సేవా కార్యక్రమాలు, అన్నా క్యాంటీన్లు ఇలా ఇటీవల కాలంలో తెగ హడావిడి చేస్తూ నాని కంటే ఇతనే బెటర్ అనేలా క్యాడర్ లో తన పరపతి పెంచుకుంటున్నాడట. సైకిల్‌కు సొంతింటి వెన్నుపోటు మారుతున్న పరిణామాల నేపథ్యంలో పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని తెలుగు తమ్ముళ్ళు కూడా శివనాధ్ దూకుడుతో అతని వెంటే మేమూ అంటూ పార్టీ మార్చేస్తున్నారట. తనకు వ్యతిరేకంగా పార్టీలో, కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు నానికి మింగుడు పడటం లేదట. వెన్నంటి నిలవాల్సిని సొంత తమ్ముడే..వెన్నుపోటు పొడుస్తుండటంతో జీర్ణించుకోలేకపోతున్నారని టాక్. రాబోయే ఎన్నికల్లో తనకు ప్రత్యామ్నాయంగా శివనాధ్ ను పార్లమెంట్ బరిలోకి దించుతారని పార్టీలో నడుస్తున్న చర్చకు తాజా పరిస్థితులు మరింత బలం చేకూరేలా ఉండటంతో.. క్యాడర్ పైన సైతం కేశినేని గుర్రుగా ఉన్నారట. శివనాధ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అన్నదమ్ముల మధ్య మొన్నటి వరకూ ఉన్న గ్యాప్ మరింత పెరిగిందన్న టాక్ ఇప్పుడు బెజవాడలో జోరుగా చక్కర్లు కొడుతోంది. పార్టీ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న నానికి తమ్ముడి రూపంలో ఎసరు పెట్టేందుకు పార్టీ పెద్దలే తెరవెనుక నుంచి కథ నడిపిస్తున్నారని.. క్యాడర్ కూడా బలంగా నమ్ముతోంది. అయితే పార్టీ హైకమాండ్‌లో వచ్చిన మార్పుతో పార్టీ శ్రేణులు కూడా క్రమంగా నానికి దూరమైపోతూ చిన్నికి దగ్గరవుతున్నారని బెజవాడలో చర్చ నడుస్తోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
రుణ ఎగవేత కేసులో కేశినేనికి డీఆర్టీ సమన్లు
సాక్షి, అమరావతి: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో టీడీపీ ఎంపీ కేశినేని నానికి డెట్స్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ) సమన్లు జారీ చేసింది. తమ బ్యాంకు నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో కేశినేని సంస్థల నుంచి వడ్డీతో సహా డబ్బులు వసూలు చేసుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖ డీఆర్టీని ఆశ్రయించింది. దీంతో జూలై 11వ తేదీ ఉదయం 10.30లోగా నేరుగా లేదా లాయర్ల ద్వారా వివరణ ఇవ్వాలని.. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఆర్టీ స్పష్టం చేసింది. కేశినేని నానితో పాటు కేశినేని పావని, కేశినేని కార్గో అండ్ కారియర్స్ లిమిటెడ్‌లకు కూడా పత్రికా ప్రకటన ద్వారా డీఆర్టీ సమన్లు జారీ చేసింది. -
కేశినేని కుటుంబంలో కుంపటి!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కుటుంబంలో రాజకీయ చిచ్చు రేగినట్లు టీడీపీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. చంద్రబాబునాయుడు, లోకేష్‌లు నాని ప్లేస్‌లో తన సోదరుడైన కేశినేని శివనాథ్ (చిన్ని)ని చేరదీసినట్లు తెలుస్తోంది. అన్నదానం పేరిట.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల పేరిట విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) శనివారం నగరంలోని ఆటోనగర్ జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కేశినేని డెవలపర్స్ పేరిట నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాలయం వద్ద, నగరంలోని వివిధ ప్రాంతాల్లో వెలిసిన హోర్డింగులు, పోస్టర్లలో టీడీపీ వ్యవస్థాపకుడైన∙ఎన్టీ రామారావు, ఆపార్టీ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులైన చంద్రబాబునాయుడు, లోకేష్‌లతో పాటు కేశినేని చిన్ని ఫొటోలు మాత్రమే ఉండటం చర్చనీయాంశంగా మారాయి. పొమ్మనకుండా పొగపెడుతున్నారా? విజయవాడ ఎంపీ కేశినేనికి రాజకీయంగా చెక్ పెట్టడానికి అధిష్టానం పావులు కదుపుతోందా అనే అనుమానాలు నాని అనుచరుల నుంచి వ్యక్తమవుతున్నాయి. తన ఎన్నికలప్పుడు, కార్పొరేషన్ ఎన్నికల సమయంలో నానికి, నగరంలోని సీనియర్ నాయకుల మధ్య జరిగిన బహిరంగ మాటల యుద్ధం తెలిసిందే. కొన్ని నెలల కిందట చంద్రబాబు, ఇతర నాయకులు ఢిల్లీకి వెళ్లినప్పుడు అక్కడి అవసరాలకు నానీని దగ్గరకు తీసుకున్నట్లు, సన్నిహితంగా ఉన్నట్లు అధినేత కనిపించారు. ఆ తర్వాత జిల్లా పార్టీలో చోటుచేసుకున్న పలు పరిణామాల సమయంలో కేశినేనితో చంద్రబాబు అంటీముట్టనట్లు ఉంటున్నారు. తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, బొండా ఉమా, నాగుల్ మీరా, తంగిరాల సౌమ్య, పట్టాభి తదితరులకు ఎంపీతో పొసగకపోవడం, వారికి అధిష్టానం పరోక్ష మద్దతిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నానికి పొమ్మనకుండా పొగపెడుతున్నట్లు ఉందని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. చిన్నితో నానికి చెక్! నాని, చిన్నిలు అన్నదమ్ములే అయినప్పటికీ ఎవరి వ్యాపార వ్యవహారాలు వారివే. 2014 ఎన్నికల సమయంలో నానీకి చేదోడు వాదోడుగా ఉన్నట్లు కనిపించిన చిన్ని 2019 ఎన్నికలప్పుడు కనిపించలేదు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో మాత్రం ఓ పర్యాయం ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలిసిన చంద్రబాబు, లోకేష్‌లు రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడిన చిన్నితో గత కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో మంతనాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు గుర్తుచేస్తున్నారు. చిన్ని రానున్న ఎన్నికల బరిలో దిగనున్నారనే ఫీలర్లు బాబు, లోకేష్‌లే పంపుతూ నానీకి చెక్ పెడుతున్నారని అంటున్నారు. -
బాబు బొమ్మను పీకేసిన కేశినేని
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: టీడీపీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని తన కార్యాలయం బయట గోడకు అమర్చిన చంద్రబాబు చిత్రపటాన్ని తాజాగా పీకేయించి, అదే స్థానంలో రతన్‌టాటాతో కలిసి ఉన్న తన ఫొటోను ఏర్పాటు చేశారు. కేశినేని భవన్ వెలుపల ఏర్పాటు చేసిన తన పార్లమెంటరీ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు, ఇతర ముఖ్య నాయకుల ఫొటోలను కూడా తొలగించేశారు. వాటి స్థానంలో టాటా ట్రస్టు, తన ఎంపీ నిధుల ద్వారా గతంలో చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో కూడిన ఫొటోలను ఉంచారు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో కేశినేని రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తికర చర్చలు జోరందుకున్నాయి. టీడీపీకి పూర్తిగా దూరం కానున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? లేక సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులను బీజేపీలోకి సాగనంపినట్లే కేశినేనికి కూడా బాబే దారి చూపుతున్నారా? అనే విషయాలపై స్వపక్షీయుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. -
'ప్రజాధనం దోచుకున్న వారిని చట్టం వదలదు'
-
తాగి పడుకున్న దద్దమ్మలా మాట్లాడేది..
సాక్షి, విజయవాడ: దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను శుక్రవారం రోజున దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఆగస్ట్ నెలలో దుర్గగుడి ఫ్లైఓవర్‌ని ప్రారంభిస్తాం. 97 శాతం మేరకు పనులు పూర్తయ్యాయి. మాది చంద్రబాబులా మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. చంద్రబాబు ఎప్పుడో పుష్కరాలకు ఫ్లైఓవర్ పూర్తి చేస్తాం అని చెప్పి మాట తప్పారు. విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు పూర్తిగా వదిలేశాడు. (చదవండి: 'నా తండ్రి ఆశయాలని కొనసాగిస్తాను') విజయవాడకి కేంద్రం కేటాయించిన నిధులను కూడా టీడీపీ ప్రభుత్వం అమరావతికి మళ్లించింది. అమరావతి అనే బ్రమరావతిలో ప్రజలను చంద్రబాబు ఉంచాడు. కానీ మా ప్రభుత్వం విజయవాడలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. కేశినేని నాని, గద్దె రామ్మోహన్, ఇతర నాయకులు విజయవాడ అభివృద్ధి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయితే గత ఐదేళ్లలో మాత్రం చంద్రబాబుతో నిధులు ఇప్పించులేకపోయారు. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో చర్చలంటూ హడావిడి చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఏడాదిలోనే అన్నీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఎంపీగా విజయవాడకు కేశినేని నాని ఏం చేశారో చెప్పాలి. ఇంట్లో తాగి పడుకున్న దద్దమ్మలు ఇప్పుడు మా గురించి మాట్లాడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రజాధనాన్ని దోచుకున్న ఎవరినీ చట్టం వదలదు. అచ్చెన్నాయుడు కార్మికుల డబ్బును దోచుకున్నాడు కాబట్టే జైలుకెళ్లాడు. అదే విధంగా ఎవరు అక్రమాలు చేసినట్లు మా దృష్టికి వచ్చినా చర్యలు తప్పవు' అని పేర్కొన్నారు. చదవండి: కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్.. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏబీవీ అసలు రంగు బయట పెట్టిన కేశినేని
సాక్షి, అమరావతి : ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అసలు రంగును విజయవాడ ఎంపీ కేశినేని నాని బయటపెట్టారు. టీడీపీ హయాంలో ఆయన చేసిన అక్రమాలు నిజమేనని పరోక్షంగా అంగీకరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై వెంకటేశ్వరరావు వెంటనే స్పందించి రీట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వారి గుట్టును వారే బయట పెట్టుకున్నట్లయిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశ భద్రతా రహస్యాలను బయట పెట్టారనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేశినేని నాని.. ‘మీరు ముఖ్యమంత్రి అవడానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్రెడ్డి గారూ’ అని ఆదివారం ట్వీట్ చేశారు. దీనిపై వెంకటేశ్వరరావు వెంటనే స్పందిస్తూ.. ‘మీరూ, మీరూ పార్లమెంట్లో కలిసి మెలిసే ఉంటారుగా.. అందరూ కలిసి ఒక అభిప్రాయానికి రండి. నేను వృత్తి ధర్మం నిర్వర్తించానో లేక ఇంకేమైనా చేశానో.. నాక్కూడా ఒక క్లారిటీ వస్తుంది’ అని కామెంట్ చేశారు. ‘ఏమిటోనండీ ఎంపీ గారూ.. మీరేమో ఇలా అంటారు.. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి నేనే కారణమని అంబటి రాంబాబు గారు అప్పట్లో కడుపుబ్బా నవ్వించారు’ అని మరో ట్వీట్ చేశారు. మొత్తానికి వీరిద్దరి ట్వీట్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వారి ఘన కార్యాలను బయట పెట్టాయి. -
కేశినేని నానికి రామకృష్ణ కౌంటర్
సాక్షి, విజయవాడ : కార్మికుల సమస్యలు ఉన్నంత కాలం ఎర్రజెండా పార్టీలు ఉంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కమ్యూనిస్టు పార్టీపై టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...కేశినేని నాని వ్యాఖ్యలను ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కేశినేని రాజకీయాల్లో ఉండవచ్చు, ఉండకపోవచ్చు గానీ ఎర్రజెండా పోరాటాలు మాత్రం ఉంటాయని వ్యాఖ్యానించారు. కార్మికుల సమస్యలు తీర్చకుండా పార్టీల పేరుతో విమర్శించడం సమంజసం కాదని హితవు పలికారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం ట్విటర్లో కమ్యూనిస్టు పార్టీపై ఇలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కమ్యూనిస్టులు ఎల్లప్పుడూ ప్రజల పక్షానే పోరాడతారని పేర్కొన్నారు. అటువంటి పార్టీలపై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా కేశినేనికి చెందిన ట్రావెల్స్‌లో పనిచేస్తున్న సిబ్బంది పాత బకాయిలు చెల్లించాలని శుక్రవారం నిరసస దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో కేశినేని నాని కమ్యూనిస్ట్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారిపోవటంవల్లే ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది’ అంటూ తన ట్విటర్ ఖాతాలో శనివారం పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ దుమారం రేపుతోంది. ఆయనపై కమ్యూనిస్ట్‌లు భగ్గుమంటున్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగామారి పోవటంవల్లే ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది. — Kesineni Nani (@kesineni_nani) July 27, 2019 -
కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, కృష్ణా: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కమ్యూనిస్ట్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారిపోవటంవల్లే ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది’ అంటూ తన ట్విటర్ ఖాతాలో శనివారం పోస్ట్ చేశారు. కేశినేనికి చెందిన ట్రావెల్స్‌లో పనిచేస్తున్న సిబ్బంది పాత బకాయిలు చెల్లించాలని శుక్రవారం నిరసస దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ దుమారం రేపుతోంది. ఆయనపై కమ్యూనిస్ట్‌లు భగ్గుమంటున్నారు. కేశినేని వ్యాఖ్యలను వెనక్కితీసుకుకోవాలని విజయవాడ నగర సీపీఐ కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. కార్మికులకు జీతాలు ఎగ్గొట్టిన నాని.. తమ పార్టీపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కార్మికులకు న్యాయం చేసేంత వరకు తమ పారాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. కాగా మొన్నటి వరకు టీడీపీ నేతలపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించిన నాని.. తాజాగా కమ్యూనిస్ట్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగామారి పోవటంవల్లే ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది. — Kesineni Nani (@kesineni_nani) July 27, 2019 -
జంపింగ్ టీడీపీ ఎంపీలపై కేశినేని నాని సెటైర్స్
సాక్షి, అమరావతి : పార్టీ ఫిరాయించిన టీడీపీ రాజ్యసభ ఎంపీలపై ఆపార్టీ ఎంపీ కేశినాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన 2019–20 బడ్జెట్‌ను ఉద్దేశిస్తూ.. జంపింగ్ ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లకు ట్విటర్ వేదికగా చురకలంటించారు. ‘మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్తున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైంది. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్లారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి చేరారో’ అంటూ ట్వీట్ చేశారు. తన మాజీ సహచరులపై విమర్శనాత్మక ధోరణిలో కేశినేని నాని చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. @YSChowdaryMP@CMRamesh_MP@TGVenkatesh మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి వెళుతున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్ధమయ్యింది, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి చేరారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోడానికి BJP లోకి చేరారో pic.twitter.com/NgUbJUiecw — Kesineni Nani (@kesineni_nani) July 6, 2019 -
కేశినేని నాని సెటైర్ ట్వీట్
-
నేనెవరికి భయపడను : కేశినేని నాని
సాక్షి, విజయవాడ : భయం తన రక్తంలో లేదని, ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) స్పష్టం చేశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని, తిరుగుబావుట ఎగరవేసిన నాని.. కొద్ది రోజులుగా సోషల్‌మీడియా వేదికగా వరుస పోస్ట్‌లతో తమ పార్టీనేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. బుధవారం తన అధికారిక ఫేస్బుక్ పేజీలో ‘నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను.’ అనే సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశారు. అయితే ఈ పోస్ట్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమను ఉద్దేశించి పెట్టినదేనని టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఇక దేవినేని ఉమ ఒంటెద్దు పోకడలకు పార్టీ అధినాయకత్వం అడ్డు చెప్పలేదని ఐదేళ్ల పాటు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కేశినేని నాని ఇప్పుడు అవకాశం రావడంతో నిశబ్ద పోరాటానికి తెరలేపారు. విజయవాడ ఎంపీగా రెండవసారి ఎన్నికైనప్పటి నుంచి స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించారు. చంద్రబాబు ఇచ్చిన లోక్‌సభ విప్ పదవిని తిరస్కరించి తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో నాని టీడీపీనీ వీడి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: కేశినేని నాని తిరుగుబాటు! తేలని కేశినేని నాని పంచాయితీ -
కేశినేని నాని తిరుగుబాటు!
సాక్షి, విజయవాడ: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) తిరుగుబావుటా ఎగరవేశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని, దేవినేని ఉమ ఒంటెద్దు పోకడలకు పార్టీ అధినాయకత్వం అడ్డు చెప్పలేదని ఐదేళ్ల పాటు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కేశినేని నాని ఇప్పుడు అవకాశం రావడంతో నిశబ్ద పోరాటానికి తెరలేపారు. విజయవాడ ఎంపీగా రెండవసారి ఎన్నికైనప్పటి నుంచి స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించారు. బుధవారం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పదవిని తిరస్కరించి తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించారు. నాని టీడీపీనీ వీడి బీజేపీలో చేరతారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని నాని ఖండించారు. లోక్‌సభ విప్ పదవి తిరస్కరణ.... రాష్ట్రం నుంచి టీడీపీ ఎంపీలుగా కేశినేని నానితోపాటు గల్లా జయదేవ్ (గుంటూరు), రామ్మోహన్నాయుడు (శ్రీకాకుళం) గెలుపొందారు. ఫ్లోర్‌లీడర్, డెప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఆ ఇద్దరికి ఇచ్చి కేశినేని శ్రీనివాస్‌కు పార్టీ విప్పదవి ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని నాని ఆ పదవిని తిరస్కరిస్తూ సోషల్ మీడియాలో పెట్టారు. తాను కేవలం ఎంపీగానే ప్రజలకు సేవ చేస్తానంటూ పేర్కొన్నారు. దీంతో ఆయన టీడీపీ వీడిపోతారంటూ జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుసుకున్న ఎంపీ గల్లా జయదేవ్ విజయవాడ వచ్చి ఆయన్ను కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అంతేగాక అదే రోజు సాయంత్రం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో కేశినేని నానికి సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వపోవడంపై కేశినేని చంద్రబాబు వద్ద కుండబద్దలు కొట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కీలక పదవులు తనకు ఇవ్వకపోవడంతో పాటు జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమా పెత్తనంపై కేశినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన ఒంటెత్తు పోకడల వల్లనే పార్టీ నష్టపోయిందని చెప్పడంతో కేశినేని నానికి చంద్రబాబు సర్ది చెప్పి అన్నీ సరిచేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. బీజేపీ నేతలతో మంతనాలు రెండవసారి ఎంపీగా గెలుపొందినప్పటి నుంచి ఎంపీ కేశినేని నాని స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడ్ని, కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీలను కలిసి అభినందనలు తెలపడంతో ఆయన పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీనికి తోడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తనను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించి ఉంటే హాజరయ్యేవాడినంటూ ప్రకటించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఇఫ్తార్ విందుకు దూరం... ఈ నెల 3న జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ఇఫ్తార్ విందు జరిగింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిర్వహణలో జరిగిన ఈ విందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు హాజరయ్యారు. అయితే నాని మాత్రం ఈ విందుకు దూరంగా ఉన్నారు. మరుసటి రోజు నగరంలోకి వచ్చారు. ఇప్పుడు పార్టీ విప్ పదవిని తిరస్కరించి తన నిరసనను చంద్రబాబుకు స్పష్టంగా తెలియచేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
దుర్గమ్మ దయ ఎవరిపైనో!
సాక్షి, అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజధాని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువ. ఒకప్పుడు తెలుగు పత్రికలన్నీ ఇక్కడ నుంచే వెలువడేవి. రాష్ట్ర రాజధాని కావడంతో మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్, టీడీపీ తరఫున సిట్టింగ్ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) బరిలో దిగారు. మొట్టమొదటిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో విజయవాడ నుంచి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 15 సార్లు జరిగిన ఎన్నికల్లో 11 సార్లు కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ), నాలుగుసార్లు టీడీపీ గెలించింది. విజయవాడ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన డాక్టర్ కె.ఎల్ రావు కేంద్ర మంత్రిగా పనిచేశారు. నాస్తికోద్యమ నాయకుడు గోరా కుమార్తె చెన్నుపాటి విద్య, కేంద్ర మాజీ మంత్రి పి.ఉపేంద్ర వంటి వారు ఇక్కడి నుంచే లోక్‌సభలో అడుగుపెట్టారు. ఈ నియోజకవర్గ పరిధిలోకి తిరువూరు, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు వస్తాయి. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు.. జిల్లా మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తిరువూరుకు కొత్తగా దిగుమతి అయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కెఎస్ జవహర్‌కు స్థానిక నేతలు సహకరించడం లేదు. విజయవాడ తూర్పు, సెంట్రల్ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమాలతో కేశినేనికి సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీని ప్రభావం ఎంపీ ఎన్నికపైనా పడుతుందనే ఆందోళన టీడీపీలో నెలకొంది. ఇక నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అయినా పెత్తనం మాత్రం మంత్రి దేవినేని ఉమాదే. ఆయన విధానాలు నచ్చక అనేక మంది దళిత నేతలు ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు. టీడీపీలో కీలకంగా ఉండే కన్నెగంటి జీవరత్నం ఇటీవల వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. ఇక జగ్గయ్యపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ వర్గానికి, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ వర్గానికి మధ్య విబేధాలు ఉన్నాయి. అందువల్ల ఈసారి ఇక్కడ టీడీపీని ఓడించేందుకు నెట్టెం వర్గం ప్రయత్నిస్తోంది. దివంగత సీఎం వైఎస్‌ను జిల్లా మరిచిపోదు.. దివంగత సీఎం వైఎస్సార్ తన హయాంలో పులిచింతల ప్రాజెక్టు ప్రారంభించి 80 శాతం పనులు పూర్తి చేసి జిల్లా ప్రజల దృష్టిలో అపర భగీరథుడయ్యారు. వేదాద్రి ఎత్తిపోతల పథకం నిర్మించి జగ్గయ్యపేట వాసుల దాహార్తిని తీర్చారు. రూ.4,573 కోట్లతో కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులకు 2007, నవంబర్‌లో పరిపాలన అనుమతులిచ్చారు. పనులు ప్రారంభమై వేగంగా జరుగుతున్న క్రమంలో ఆయన దుర్మరణంతో పరిస్థితి మారింది. తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పొట్లూరి వీరప్రసాద్ పొట్లూరి వీరప్రసాద్ (పీవీపీ) తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అసమ్మతి అనేదే లేదు. విజయవాడ వాసే కావడంతో నియోజకవర్గ వాసులకు పీవీపీ సుపరిచితులు. నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. ఆర్థికంగా స్థితిమంతులు. కేశినేని నాని (టీడీపీ) నోటిదురుసు ఎక్కువ. రవాణా కమిషనర్ బాలసుబ్ర హ్మణ్యంపై అప్పట్లో దాడి చేయడం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. తన కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని కబ్జా చేయబోయి అప్రదిష్టను మూట కట్టుకున్నారు. దేవాలయాలను, కూల్చివేసినప్పుడు తమ సమస్యలను చెప్పుకోవడానికి వెళ్లిన గోశాల ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. మొత్తం ఓటరు : 16,19,607 పురుషులు : 7,98,421 స్త్రీలు : 8,21,028 ఇతరులు : 158 – యు.శ్యామ్‌ప్రకాశ్, సాక్షి, అమరావతి బ్యూరో -
టీడీపీ వాళ్లు జగన్‌ని కైమా చేసేవాళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రతిపక్ష నేతపై టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. నిజంగా టీడీపీ కార్యకర్తలుగానీ, టీడీపీ వ్యక్తులుగానీ చేయాలనుకుంటే జగన్మోహన్రెడ్డిని రోడ్డు మీద కైమా కైమా చేసేవాళ్లని, దానికి సీఐఎస్ఎఫ్ కంట్రోల్లో ఉన్న ఎయిర్‌పోర్టుకు వెళ్లి చేయాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో నువ్వు మూడువేల కిలోమీటర్ల మేరకు నడిచావు. నీకు భద్రత బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ఎప్పుడైతే సీఐఎస్ఎఫ్ కంట్రోల్లో ఉన్న ఎయిర్‌పోర్టుకు వెళ్లావో నీ భద్రత పోయింది. అంటే ఎవరి వైఫల్యం ఇది? కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఇది.. టీడీపీ ప్రభుత్వం వైఫల్యమెలా అవుతుంది?..’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఏపీ పోలీసులదే పని అయితే పౌర విమానయాన మంత్రి సీఐఎస్ఎఫ్ పోలీసులను విచారణ జరపమని ఆదేశించడం ఎందుకన్నారు. ‘‘ఎయిర్‌పోర్టులో ఘటన జరిగిన వెంటనే హైదరాబాద్ ఎందుకు వెళ్లినట్టు? కావాలని చెప్పి నాటకాలు ఆడుతున్నారు. వేల కిలోమీటర్లు నడిచినప్పుడు జనాదరణ కనిపించలేదు. నీ పాదయాత్ర ముగింపునకు వచ్చింది. ప్రజాదరణ కనిపించకపోవడంతో పాదయాత్ర ముగించే సందర్భంలో ప్రజల్లో సానుభూతికోసం నీ అభిమానితో దాడి జరిపించుకున్నావు. నువ్వు వచ్చే సమయం అతడికి చెప్పావు. టీ ఎప్పుడు ఇవ్వాలి.. కాఫీ ఎప్పుడు ఇవ్వాలో చెప్పావు.. పాదయాత్ర ద్వారా రాని సింపతీని కోడి కత్తి ద్వారా తెప్పించుకోవాలని చూశావు. నీ తొత్తులు ఆడే నాటకం ఆపాలి..’’ అంటూ తన అక్కసు వెళ్లగక్కారు. ‘‘దాడి జరగగానే కత్తి మాయమైంది. సాయంత్రం వరకూ పోలీసులకు చేరలేదు. దానిని ఫోరెన్సిక్‌కు పంపాలి. కత్తి మాయం చేశావు. హైదరాబాద్ వెళ్లావు. దాడి జరిగింది మధ్యాహ్నం అయితే సాయంత్రం హాస్పిటల్‌కు వెళ్లావు. మానవుడివి కాదా.. నీకు దాడి జరిగిన వెంటనే రక్తం కారలేదా? ఇవన్నీ నాటకాలు..’’ అంటూ ప్రతిపక్ష నేతపై ఎంపీ అమర్యాదకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ.. ‘వైఎస్సార్సీపీ హత్యారాజకీయాలు సృష్టించి డ్రామాలు చేస్తోంది. ఏపీలో శాంతిభద్రతలు లేవని చెప్పేందుకు ఈ డ్రామా సృష్టించారు’ అని ఆరోపించారు. -
పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతాడు
సాక్షి, అమరావతి: సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతాడని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. విలేకరులతో నాని మాట్లాడుతూ..వాళ్ల అన్నయ్య చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 సీట్లు మాత్రమే గెలిచారనే విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ ఒక యాక్టర్, అతన్ని చూడటానికి మాత్రమే ప్రజలు వస్తారు..అంతే కానీ వాపును చూసి బలుపు అనుకోకూడదని హితవు పలికారు. పవన్ కల్యాణ్ తన బలం, బలహీనత తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ..పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీని కాపాడటానికే చంద్రబాబుపై పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును దించాలనే లక్ష్యం తప్ప, ప్రజాసమస్యల పట్ల పవన్‌కు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఖర్చు పెట్టేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారనే పవన్ వ్యాఖ్యలు అర్ధరహితమైనవన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు డబ్బులు తీసుకోవడం పవన్‌కు అలవాటుగా మారిందని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ డబ్బులు అనే యావ పవన్‌కు పట్టిందని విమర్శించారు. మూడు రోజులు ఆంధ్రాలో తిరిగి, ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్‌కు చెక్కేసే పవన్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. -
జీవీఎల్‌వి పచ్చి అబద్దాలు: కేశినేని
అమరావతి: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. అసలు జీవీఎల్ నరసింహారావుకు ఏపీలో అడ్రెస్సే లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన అడ్రెస్ ఒక చోట అయితే మాట్లాడేది మరొక చోట అని ఎద్దేవా చేశారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ.. జీవీఎల్ ఆధార్ కార్డు, పాస్‌పోర్టు ఎక్కడ ఉందో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. జీవీఎల్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయల అవినీతి కూడా జరగలేదు..ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నామని అన్నారు. లక్ష కోట్ల అవినీతిపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని పేర్కొన్నారు. గతంలో పార్లమెంటు దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ క్యాండిల్ ర్యాలీ చేసినపుడు పార్లమెంటుకు ముప్పు వస్తుందని కనిపించలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏపీకి హోదా కోసం పోరాటం చేస్తుంటే పార్లమెంటుకి ముప్పు వస్తుందని జీవీఎల్ అనడం దారుణంగా ఉందన్నారు. -
100శాతం బెజవాడే రాజధాని
మారనున్న విజయవాడ స్వరూప స్వభావాలు అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం వ్యవసాయ రంగం ద్వారా ప్రభుత్వాదాయాన్ని పెంచే మార్గాన్వేషణ పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు బందర్ పోర్టు పనులు త్వరలో ప్రారంభం ‘సాక్షి’తో ఎంపీ కేశినేని శ్రీనివాస్ సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ ఇక మహానగరం కానున్నదని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) చెప్పారు. శనివారం ఆయన తన కార్యాలయంలో సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ఎవరెన్ని చెప్పినా విజయవాడ రాజధాని కావడం ఖాయమన్నారు. అయితే.. క్యాపిటల్ కమిటీ రిపోర్టు ఇవ్వకుండా మనం మాట్లాడటం సమంజసం కాదంటూనే నగరం స్వరూప స్వభావాలే మారిపోతాయన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు తయారవుతున్నాయన్నారు. ‘దక్షిణ బైపాస్ మంజూరైందని, గుంటూరు వద్ద కాజా నుంచి మొదలై విజయవాడ తూర్పు శివార్ల నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దాటిన తరువాత చిన్నఅవుటుపల్లి వద్దకు 48 కిలోమీటర్ల పొడవున ఔటర్ రింగ్‌రోడ్డు కూడా ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు రెడీ చేసినట్లు చెప్పారు. గొల్లపూడి వద్ద ఆరు లైన్ల బైపాస్ రోడ్డుకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. ఇది బీవోటీ ద్వారా నిర్మిస్తారని చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ దీని ద్వారా ఏలూరు వైపు వెళ్తుందన్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య లేనట్లేనని కేశినేని నాని చెప్పారు. దుర్గగుడి వద్ద ట్రాఫిక్ రద్దీకి మూడు ఆఫ్షన్లు కనకదుర్గమ్మ గుడి వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం విషయం ప్రస్తావించగా మూడు ఆప్షన్స్ రెడీ అయినట్లు ఎంపీ చెప్పారు. భవానీపురం నుంచి కృష్ణలంక వరకు సుమారు ఐదు కిలోమీటర్ల రోడ్డు అటు జాతీయ రహదారుల శాఖ పరిధిలోగానీ, ఇటు ఆర్ అండ్ బీ కిందగాని లేదన్నారు. నేషనల్ హైవే కిందకు ఈ రహదారి ప్రాంతాన్ని తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వారికి అప్పగించిన తరువాత మాత్రమే నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. త్వరలో బందరు పోర్టు పనులు బందరు పోర్టు పనులు త్వరలోనే వేగం పుంజుకుంటాయన్నారు. పోర్టుకు నిధులు లేవనే వాదనను ఆయన కొట్టిపారేశారు. బడ్జెట్లో 15 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తారని, మిగిలిన 85శాతం నిధులు డీఫాల్ట్‌లో ఉంటాయన్నారు. బడ్జెట్‌తో సంబంధం లేకుండానే చాలా పనులు జరుగుతాయని చెప్పారు. సీఎం కూడా ఎలాగైనా పోర్టు నిర్మాణాన్ని పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. బీవోటీ పద్ధతిలో చేపట్టే పనులు సక్రమంగా ఉండటంలేదన్న ఆరోపణలు ఆయన దృష్టికి తీసుకురాగా జాతీయ రహదారుల్లో టోల్గేట్లు ఏర్పాటుచేయడం ద్వారా బీవోటీ పద్ధతుల్లో రహదారుల అభివృద్ధి ఎలా ఉందో చూస్తున్నారు కదా అంటూ ప్రశ్నించారు. పరిశ్రమలు రావాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం గన్నవరం ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏడు వందల ఎకరాలు భూసేకరణ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. స్థలం సరిపోదనే వాదనను ఆయన కొట్టిపారేశారు. ఇక్కడ మరో రెండు వందల ఎకరాల స్థలం కూడా సేకరించే అవకాశం ఉందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి 65శాతం మంది జనం వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని, ఆ రంగం నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 25శాతమేనన్నారు. వ్యవసాయ రంగం నుంచి రెవెన్యూను ఎలా రాబట్టుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోందని కేశినేని అన్నారు. సర్వీస్ సెక్టార్లు పెరగాలని, పారిశ్రామిక రంగం పెరిగితేనే ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. ఇక్కడ అవకాశాలు లేకపోవడంవల్లే వృత్తి నైపుణ్యం ఉన్న వారు విదేశాలకు వెళ్తున్నారని.. సాధారణ డిగ్రీలు పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు లేవన్నారు. అన్నీ ప్రభుత్వమే చేయాలంటే దేశ అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు సాగదన్నారు. -
‘బెజవాడ’కు పెద్దపీట వేస్తారా!?
నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చే నెల ఎనిమిదో తేదీన రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ తరుణంలో విజయవాడ డివిజన్‌పై మన నేతలు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉంది. జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం), కేశినేని శ్రీనివాస్ (విజయవాడ) ఆ పార్టీకి చెందినవారే కావడంతో రైల్వే మంత్రి సదానందగౌడ్‌ను ఒప్పించి సాధ్యమైనన్ని వరాలు పొందాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్నివిధాల విజయవాడ కీలకం కానుంది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటవుతుందని ప్రచారం కూడా జోరందుకుంది. ఇప్పటికే విజయవాడ డివిజన్లో రైల్ ట్రాఫిక్ అధికంగా ఉంది. లభించే ఆదాయం కూడా బాగానే ఉంటోంది. విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటుచేస్తే ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారి సంఖ్య అనూహ్యంగా పెరగవచ్చు. రైళ్లను కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విజయవాడ డివిజన్‌కు తగినన్ని నిధులు రాబట్టకపోతే ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిపోయే అవకాశం ఉందని రైల్వే అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎంపీలు దృష్టి పెట్టాల్సిన అంశాలివీ.. విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య మెట్రో రైలు ఏర్పాటు చేయిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సుమారుగా రూ.2,000 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా. ఈ బడ్జెట్లో కనీసం రూ.500 కోట్లు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది. 2015లో గోదావరి పుష్కరాలు, 2016లో కృష్ణా పుష్కరాలు రానున్నాయి. వీటి కోసం ప్రత్యేక రైళ్లు వేస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడం కోసం ఈ ఏడాది బడ్జెట్లోనే కనీసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించాలి. నిధులు లేనందున విజయవాడ రైల్వే స్టేషన్లో రూట్ రిలే ఇంటర్ లాకింగ్ ప్రాజెక్టు(ఆర్ఆర్ఎల్) అమలులో జాప్యం జరుగుతోంది. దీనివల్ల నగరం వెలుపలకు వచ్చిన రైళ్లు ప్లాట్‌ఫారాలపై రావడానికి కనీసం అర్ధగంట పడుతోంది. దీనికి కనీసం రూ.50 కోట్లు ఖర్చవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఒకటి నుంచి ఐదు ప్లాట్‌ఫారాలకు వచ్చే రైళ్ల జాప్యాన్ని తగ్గించవచ్చు. 2, 3, 4, 5 ప్లాట్‌ఫారాలపై ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న మెట్ల స్థానంలో వీటిని ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఎక్కేందుకు, దిగేందుకు ఒకే మెట్ల మార్గం ఉండడం వల్ల ప్రయాణికులు తోసుకోవాల్సివస్తోంది. అందువల్ల పక్కనే మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. మచిలీపట్నంలో పోర్టును అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. అంతకంటే ముందు విజయవాడ- మచిలీపట్నం రైల్వే లైనును అభివృద్ధి చేయాల్సిన అసరం ఎంతైనా ఉంది. లేకపోతే సరుకు రవాణాకు ఇబ్బంది అవుతుంది. విజయవాడ, గుంటూరు, తెనాలి స్టేషన్లను ‘ఏ’ క్లాస్‌గా ప్రకటించి అభివృద్ధి చేయాలి. విజయవాడ కేంద్రంగా కొత్త జోన్‌ను సాధించాలి. విజయవాడ నుంచి ప్రారంభమయ్యే రైళ్లును రాబట్టాలి. జోథపూర్, బెంగళూరు, అహ్మదాబాద్, ఓక్ తదితర ప్రాంతాలకు విజయవాడ నుంచి రైళ్లు నడిపేందుకు కృషిచేయాలి. ఎలక్ట్రికల్ లోకో వర్క్‌షాపును ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన సంవత్సరాలుగా కాగితాలకే పరిమితమైంది. దీన్ని ఈ ఐదేళ్లలోనైనా సాధించాలి. బందరు ఎంపీ నారాయణరావు ప్రధాన డిమాండ్లు మచిలీపట్నం-నర్సపూర్‌ల రూట్లో ప్రతిరోజు రైలు మచిలీపట్నం నుంచి చెన్నై, యశ్వంత్‌పూర్, ముంబాయిలకు రైళ్ల ఏర్పాటు మచిలీపట్నం, గుడివాడ రైల్వేస్టేషన్లను అప్‌గ్రేడేషన్ చేసి ఆధునిక రైల్వేస్టేషన్లుగా తీర్చిదిద్దాలి విజయవాడ- గుడివాడ రైల్వే మార్గం ఇప్పటికే డబ్లింగ్ జరుగుతోంది.రాబోయే రోజుల్లో గుడివాడ-మచిలీపట్నం రైల్వేమార్గాన్ని డబ్లింగ్ విద్యుదీకరణ చేయాలి. గుడివాడ,పెడనలలో రైల్వే ట్రాక్స్‌పై ఫ్లైఓవర్ నిర్మాణాలకు నిధులు మంజూరు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ డిమాండ్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ అయ్యే అవకాశాలు ఉన్నందున విజయవాడ కేంద్రంగా ఒక రైల్వే జోన్ ఏర్పాటుచేయాలి. విజయవాడ-కర్నూలు రైల్వే లైన్‌ను డబ్లింగ్ చేయాలి. విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది స్టాఫ్‌వేర్ ఇంజినీర్లు బెంగళూరు వెళ్లుతున్నందున విజయవాడ- బెంగళూరుకు ప్రతిరోజు రైలు ఏర్పాటు చేయాలి. ముంబాయి, కోల్‌కతా, షిర్డీ, ఢిల్లీ నగరాలకు విజయవాడ నుంచి ప్రారంభమయ్యేటట్లు రైళ్లు ఏర్పాటు చేయాలి. పైనుంచి వచ్చే రైళ్లలో విజయవాడకు కేటాయిస్తున్న కోటా ఏమాత్రం సరిపోనందున ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే రైళ్లు ఏర్పాటు అవసరం ఉంది. విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రో రైలు ప్రారంభించాలి. ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే భవిష్యత్తులో వాటిని మరింత పెంచవచ్చు. -
విజయవాడ పార్లమెంట్ కేశినేని నానీదే
69 వేల మెజారిటీతో విజయం సాక్షి, విజయవాడ : విజయవాడ పార్లమెంట్ సభ్యునిగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేశినేని శ్రీనివాస్ (నాని) ఎన్నికయ్యారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్‌పై విజయం సాధించారు. ఇరువురి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. అయితే విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో తెలుగుదేశంకు తిరుగులేని అధిక్యత రావడంతో కోనేరు ప్రసాద్‌పై సుమారు 69 వేల ఆధిక్యతతో గెలుపొందారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ లెక్కింపులో వివాదం చోటు చేసుకోవడంతో కౌంటింగ్‌లో తీవ్ర జాప్యం జరిగింది. రాత్రి 11 గంటల సమయానికి కూడా ఓట్ల వివరాలు అందుబాటులోకి రాలేదు. కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన దేవినేని అవినాష్‌తోపాటు ఇతర అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. గెలుపు మరింత బాధ్యత పెంచింది : కేశినేని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ నాయకులకు, కార్యకర్తలకు కేశినేని శ్రీనివాస్ (నాని) హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ విజయం మరింత బాధ్యత పెంచిందన్నారు. ఇకనుంచి ప్రజల సేవకుడిగా, కుటుంబ సభ్యునిగా ఉంటానని చెప్పారు. ఫోన్ కాల్కయినా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. హామీల అమలుకు చిత్తశుద్ధితో కృషిచేసి విజయవాడ నగరాన్ని, పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. -
‘పచ్చ’నోట్ల ప్రవాహం
సాక్షి, విజయవాడ : జిల్లాలో గెలుపు కష్టమని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు పార్టీ పరిశీలకులు గెలుపుపై నమ్మకం లేదని చెప్పడంతో ప్రచారం సరిపోకపోతే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. దీంతో జిల్లాలో పచ్చనోట్ల వర్షం కురిపించాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఐదారు కోట్లు ఖర్చు చేయగా, మరో నాలుగైదు కోట్లు కుమ్మరించైనా సరే విజయం సాధించాలని భావిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసుకున్న పక్కా ప్రణాళికను చివరి మూడు రోజుల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీకి అండగా ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల పైనే టీడీపీ దృష్టి సారించినట్లు సమాచారం. కొంతమంది అభ్యర్థులు సొంత నిధులు సమకూర్చుకోగా, మరికొందరు పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు, హోటల్ యజమానులు, సినీ ప్రముఖుల నుంచి నిధులు సమకూర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బందరు ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ ఓటమి ఖాయమనే అభిప్రాయంతో నిధులు బయటకు తీయడం లేదని తెలుస్తోంది. దీంతో పార్టీ పరిశీలకుడు సుజనాచౌదరి జిల్లాలో పారిశ్రామిక వేత్తల నుంచి వసూలుచేసిన నిధులతో పాటు పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్ నుంచి సుమారు రూ.2 కోట్లు ఇప్పించినట్లు సమాచారం. ఎన్నికలకు ఒకటి రెండు రోజులు ముందే వీటిని నియోజకవర్గం మొత్తం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని) ఇప్పటి వరకు డబ్బులు తీయకపోవడంతో చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో చివరి మూడు రోజుల్లో తన మనీ మేనేజ్మెంట్ గురించి ఆయన వివరించినట్లు తెలిసింది. ఇప్పటికే విజయవాడలోని బిల్డర్లు, చాంబర్ ఆఫ్ కామర్స్, ట్రాన్స్పోర్టర్లతో పాటు ఇతర ప్రముఖుల నుంచి వసూలుచేసిన ఆరేడు కోట్ల రూపాయలను పంచుతానని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. తిరువూరు అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ నిధుల ఖర్చులో వెనుకబడి ఉన్నారని తెలియడంతో ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నుంచి నిధులు తెప్పించినట్లు సమాచారం. రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఇక్కడ మూడు నాలుగు కోట్లు కుమ్మరించనున్నట్లు తెలుస్తోంది. తొలుత స్థానికంగా ఉన్న ఒక బలమైన సామాజిక వర్గం నుంచి డబ్బు వసూలు చేయాలని భావించినా వారు చేతులెత్తేసినట్లు తెలిసింది. నందిగామ అభ్యర్థి తంగిరాల ప్రభాకర్ డబ్బు ఖర్చు పెట్టలేక చేతులెత్తేసినట్లు తెలిసింది. నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కుమారుడు, పారిశ్రామికవేత్తకు పార్టీ నేతలు ఆ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆయనే నాలుగైదు కోట్లు ఖర్చుచేస్తున్నట్లు తెలిసింది. నూజివీడు అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు పుష్కలంగా తెప్పిస్తున్నట్లు సమాచారం. ఆయన బంధువు ఆ పార్టీ అగ్రనేత కావడంతో అక్కడ నుంచి కూడా నిధులు వస్తున్నాయని పార్టీలో ప్రచారం సాగుతోంది. దీనికితోడు ఆయన సొంతంగా ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని సేకరించిన నిధుల్ని ఒకటి రెండు రోజుల్లో విరజిమ్మనునానరని తెలుస్తోంది. బందరు అభ్యర్థి కొల్లు రవీంద్ర కూడా తన వద్ద నిధులు అయిపోయాయని చెప్పడంతో పార్టీ నుంచే ఐదారు కోట్ల రూపాయలు ఆయనకు సమకూర్చినట్లు తెలిసింది. ఇక్కడ పేర్ని నాని గాలి విపరీతంగా వీస్తుండటం వల్లే రవీంద్ర చేతులెత్తేసినట్లు సమాచారం. అవనిగడ్డ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ వద్ద తగినన్ని నిధులు లేకపోవడంతో ఆయనకు కూడా రాష్ట్ర పార్టీ నుంచే నిధులు సమకూర్చుతున్నట్లు తెలిసింది. పెడన అభ్యర్థి కాగిత వెంకట్రావ్ డబ్బు పంపిణీలో వెనుకబడినట్లు తెలియడంతో ఆయన్ని గెలిపించాలంటూ లిక్కర్ సిండికేట్లకు సుజనా చౌదరి ఆదేశించినట్లు సమాచారం. పామర్రు అభ్యర్థి వర్ల రామయ్య ఇప్పటికే రూ.4 కోట్లు వసూలు చేసి సిద్ధంగా ఉంచినట్లు తెలిసింది. మూడు నాలుగు రోజుల్లో పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమా పరిస్థితి విచిత్రంగా మారింది. తన వద్ద కోట్లు ఉన్నాయంటూ నమ్మించి సీటు సంపాదించినట్లు సమాచారం. చివర్లో సీటు ఇవ్వడంతో ఆస్తులు అమ్మి డబ్బు తీసుకురావడం వీలు పడలేదని చంద్రబాబు వద్ద తేల్చి చెప్పినట్లు తెలిసింది. గెలుపుపై ఆశలు లేకే ఆయన చేతులెత్తేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు రూ.4 కోట్లు సర్ది ఎన్నికల తర్వాత వసూలు చేయాలంటూ సుజనా చౌదరిని చంద్రబాబు ఆదేశించారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. కైకలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు సినీ రంగం నుంచి నిధులు పుష్కలంగా వస్తున్నాయి. ఆయన నియోజకవర్గంలో ఐదు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల వినియోగం కోసం తన సామాజిక వర్గం నుంచి వసూలు చేసినట్లు నాలుగైదు కోట్లు సిద్ధం చేసినట్లు తెలిసింది. నాలుగైదు రోజుల్లో వీటిలో కొంత ఖర్చుచేయనున్నట్లు సమాచారం. దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం), వల్లభనేని వంశీమోహన్ (గన్నవరం), బోడే ప్రసాద్ (పెనమలూరు), రావి వెంకటేశ్వరరావు (గుడివాడ), గద్దె రామ్మోహన్ (విజయవాడ తూర్పు), శ్రీరాం రాజగోపాల్ (జగ్గయ్యపేట)లు స్వంతంగానే నిధులు సమకూర్చుకున్నట్లు తెలిసింది. -
‘కోట్ల’ కిరికిరి
ప్రైవేట్ బస్సుల అక్రమదందా సర్కారు ఆదాయానికి కేశినేని గండి ఆయనో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి ... ఈ టికెట్ చేజిక్కించుకోవడానికి చంద్రబాబుతోనే తలపడటమే కాకుండా పత్రికలకెక్కి నానా రాద్ధాంతం చేశారు. కోట్ల రూపాయలు వెదజిమ్మగలనని అధిష్ఠానాన్ని బలవంతంగా ఒప్పించి ఎన్నికల బరిలోకి దిగారీయన. ఈయన గతాన్ని ఓసారి పరిశీలిస్తే అడుగడుగునా అవినీతిమయం. చిత్తశుద్ధితో సాగే సమైక్య ఉద్యమాన్ని కూడా తన స్వార్థానికి ఉపయోగించుకున్నారు. సాక్షి, విజయవాడ : కేశినేని నాని వ్యవహారం గురివింద గింజ సామెతలా ఉంది. ప్రచారపర్వంలో ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్న ఆయన తాను చేస్తున్న అక్రమ ట్రావెల్స్ వ్యాపారం గురించి అస్సలు మాట్లాడరు. టూరిస్టు పర్మిట్ తీసుకుని నిబంధనలకు వ్యతిరేకంగా స్టేజి కేరియర్లుగా బస్సులను తిప్పుతూ ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో గండి కొడుతున్నారు. సమైక్య ఉద్యమ సమయంలో పైకి మద్దతు ఇచ్చినట్లు నటించి.. దొంగచాటుగా బస్సులను తిప్పుకొన్న సంగతి తెలిసిందే. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు జనం నుంచి దోచేశారు. అడ్డదారుల్లో బస్సులు నడిపింది ఇలా.. పాలెం దుర్ఘటనతో అప్పట్లో ప్రైవేటు బస్సులు కొంతకాలం నడవలేదు. కేశినేని నాని మాత్రం తన బస్సులను డొంకదారుల్లో తిప్పారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సులను కంచికచర్ల నుంచి ఖమ్మం జిల్లా మీదుగా రాజధానికి నడిపారు. ప్రయాణికులను విజయవాడ నుంచి ఇన్నోవాలో కంచికచర్ల వరకు తీసుకువెళ్లి అక్కడ వారిని బస్సులు ఎక్కించారు. కొన్ని బస్సుల్ని ఇక్కడి నుంచి ఖాళీగా తీసుకువెళ్లి గుంటూరు మార్గంలో చెక్‌పోస్టు దాటిన తర్వాత ప్రయాణికులను ఎక్కించారు. విశాఖపట్నం వెళ్లే బస్సులను పామర్రులో నిలిపి అక్కడి నుంచి హనుమాన్‌జంక్షన్ మీదుగా తీసుకువెళ్లారు. హైకోర్టు స్టేతో దందా మళ్లీ మొదలు.. ప్రభుత్వ అధికారులు ఒత్తిడి తెచ్చినా నాని మాత్రం తన దందా మానలేదు. పలు బస్సులను సీజ్ చేశారు. కొన్నింటి పర్మిట్లను సస్పెండ్ చేశారు. దీనిపై కేశినేని హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. బస్సులను మార్గం మధ్యలో సీజ్ చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కేశినేని ట్రావెల్స్ దందా మళ్లీ మొదలైంది. నెల రోజులుగా అధికారులు ఎన్నికల విధుల్లో ఉండడంతో కేశినేని ట్రావెల్స్ నుంచి అక్రమ సర్వీసులను నడుపుతున్నారు. దొంగ పర్మిట్లు, నకిలీ నంబర్లతో బస్‌లను దొంగట్రిప్పులు వేసి సొమ్ముచేసుకుంటున్నారు. 70 బస్సులను స్టాపేజి చూపించి వాటిని నడుస్తున్న బస్సుల నంబర్లతో తిప్పుతున్నట్లు సాటి ట్రావెల్స్ యాజమాన్యాలే ఆరోపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటికప్పుడు కొన్ని బస్సులను తాత్కాలికంగా ఆపినట్లు చూపిస్తారు. ఆపిన బస్సులకు ఆ త్రైమాసికానికి ఒక్కో బస్సుకు లక్షన్నర రూపాయల పన్ను ఎగ్గొడుతున్నారు. స్టాపేజి చూపించిన బస్సులకు ప్రస్తుతం తిరుగుతున్న బస్సు నంబర్లు వేసి ఒక బస్సును హైదరాబాద్‌కు పంపితే, మరో బస్సును విశాఖపట్నం పంపుతారు. ప్రతి టోల్గేట్ వద్ద బస్సు నంబర్లు నమోదు అయినా, రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్న వాహనాల డేటాను క్రోడీకరించే అవకాశం లేకపోవడంతో ఇష్టారాజ్యంగా దొంగ నంబర్లతో బస్సులను తిప్పుతున్నారు. బినామీపేర్లతో.. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, విశాఖ, షిర్డీ మధ్య సుమారు 140 బస్సులను నాని తిప్పుతున్నారు. ఈ బస్సులన్నీ కేశినేని ట్రావెల్స్ పేరుతో కాకుండా కేశినేని నాని, ఆయన భార్యతో పాటు సిబ్బంది బినామీ పేర్లతో నడుస్తున్నాయి. ఆలిండియా పర్మిట్ సీటుకు ప్రతి మూడు నెలలకు రూ. 3650, స్టేట్ పర్మిట్‌కు రూ. 2650 చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. పది బస్సులకు పర్మిట్ తీసుకుంటే ఆ నంబర్లతో వీటికి రెట్టింపు బస్సులు నడపుతారు. పర్మిట్ నిబంధనల ప్రకారం ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణీకులను తీసుకువెళ్లవచ్చు. అదికూడా విడివిడిగా ప్రయాణికులకు టికెట్లు ఇవ్వకూడదు. అయితే ఎలాంటి నిబంధనలు పాటించరు. ఆర్టీసీకి పోటీగా సమాంతర వ్యవస్థను నడుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఆర్టీసీ ఉండటంతో స్టేజి కేరియర్‌గా బస్సులు తిప్పేందుకు అనుమతి లేదు. తనకున్న ధన బలంతో బస్సులను యథేచ్ఛగా తిప్పుతున్నారు. పగలు ఉద్యమం... రాత్రి వ్యాపారం సమైక్య ఉద్యమం జరిగినన్ని రోజులు నాని సమైక్యవాది ముసుగులో ఉదయం బంద్‌లు చేయించారు. రాత్రి అయ్యేసరికి కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సుల్ని యథావిధిగా నడిపించారు. విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు, బెంగ ళూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు తిప్పి వ్యాపారం చేశారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రవేటు దందా నడిపారు. విజయవాడ నుంచి బెంగళూరుకు రూ.1000 నుంచి రూ.1200 చార్జీ ఉంటే, ప్రైవేటు బస్సుల్లో రూ.3000 వరకు వసూలు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఓల్వో బస్సు చార్జీ రూ.1000 వరకు వసూలు చేశారు. -
టీడీపీ అభ్యర్థుల మధ్య అగాధం
ఎవరి దారి వారిదే... ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తలోదారి పైకి కలిసి ప్రచారం... లోపల ఎవరి లెక్కలు వారివే కేశినేని నోటి దురుసు కొనకళ్ల పొదుపు చర్యలు ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నా.. టీడీపీలో నేతల మధ్య విభేదాలు తొలగకపోగా ఇంకా పెరిగిపోతున్నాయి. ప్రచారంలో కలిసి పాల్గొంటున్నా.. తెరవెనుక వెన్నుపోట్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వారి విభేదాలతో మధ్యలో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య ఏర్పడ్డ అగాధం ఇప్పట్లో సమసిపోదని పార్టీ పరిశీలకులే పెదవి విరుస్తున్నారు. సాక్షి, విజయవాడ : విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని)కి నోటి దురుసు ఎక్కువని, దీనికితోడు అందరినీ చులకన చేసి మాట్లాడతాడని పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలో తన ఆధిపత్యం సాధించాలని నాని ప్రయత్నిస్తుంటే దానికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమాత్రం అంగీకరించడం లేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని ఉమాకు, కేశినేని నానికి మధ్య ఆధిపత్యపోరు తీవ్రస్థాయికి చేరింది. ఈ ఇద్దరు నేతల మధ్య పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. విజయవాడ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్‌కు, కేశినేని నానికి మధ్య ఎప్పుడో ఏర్పడ్డ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమాకు, కేశినేని నానికి మధ్య అనేక విభేదాలు ఉన్నాయి. బొండా ఉమా, దేవినేని ఉమాలు కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని నమ్ముతున్న కేశినేని నాని సెంట్రల్లో సొంత కుంపటి కూడా పెట్టుకోవడం ఇందులో భాగమేనని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను డమ్మీలను చేసి తాను పెత్తనం చేయాలని కేశినేని చూస్తున్నారనేది ఆయా స్థానాల అభ్యర్థుల అభిప్రాయంగా కనబడుతోంది. జగ్గయ్యపేటలో శ్రీరాం తాతయ్యతోనూ నానికి పొసగడం లేదు. నానితో కలిసి ఉన్నట్లే నటిస్తున్నా.. ఎన్నికల నాటికి శ్రీరాం తాతయ్య దేవినేని ఉమా వర్గంతో కలిసి కేశినేనికి దెబ్బకొడతారనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా తమపై పెత్తనం చేయాలని చూస్తున్న కేశినేని నానిని ఎన్నికల్లో ఓడించి, తాము గెలిచి తమ సత్తా చూపించాలనే భావనలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది. కొనకళ్ల కొంప ఎమ్మెల్యే అభ్యర్థులే ముంచుతారా... ఈసారి ఎన్నికల్లో టీడీపీ మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి కొనకళ్ల నారాయణ డబ్బు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లు సమయంలో తనకు గుండెనొప్పి రావడమే తనను విజయపథంలో నడిపిస్తుందనే గట్టి నమ్మకంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నిక ల స్థాయిలో కూడా ఖర్చు పెట్టకుండా పొదుపు చర్యలు పాటిస్తున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నారు. దీంతో ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ప్రచారం తామే చేసుకుంటున్నారు తప్ప కొనకళ్ల గురించి పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులు కొల్లు రవీంద్ర (బందరు), కాగిత వెంకట్రావు (పెడన), వర్ల రామయ్య (పామర్రు) ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా వారికి సహాయం అందించేందుకు కొనకళ్ల సిద్ధంగా లేరని సమాచారం. కాంగ్రెస్ నుంచి వచ్చిన మండలి బుద్ధప్రసాద్, కొనకళ్ల నారాయణ మధ్య ఇంకా సఖ్యత ఏర్పడలేదు. వంశీమోహన్ (గన్నవరం), బోడే ప్రసాద్ (పెనమలూరు), రావి వెంకటేశ్వరరావు (గుడివాడ) కొనకళ్లను పట్టించుకోకుండా తమ ప్రచారం తాము చేసుకుంటున్నారు. గతంలో కాపు, గౌడ సామాజిక వర్గాలు కొనకళ్లకు అండగా ఉన్నాయని, ఈసారి ఆయా వర్గాలు వైఎస్సార్సీపీకి అండగా మారడంతో కొనకళ్ల వల్ల తమకు ఉపయోగం లేదనే భావనలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నామినేషన్
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్(నాని) బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కెనాల్ రోడ్డులోని వినాయకుడు గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ర్యాలీగా బయలుదేరి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంతకు ముందు స్థానికేతరులు ఈ ప్రాంతానికి ఎంపీగా ఎన్నికయ్యారని, అందువల్ల వారికి స్థానిక సమస్యలపై పూర్తి అవగాహనలేదని చెప్పారు. తాను ఇక్కడి వాడినికావడంతో నియోజకవర్గ పరిధిలోని అన్ని సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. తాను గెలిస్తే విజయవాడ నగర అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని, ముఖ్యంగా పేద,మధ్య తరగతి వర్గాల ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. తాను ఏసామాజిక వర్గానికి వ్యతిరేకం కాదని, అన్ని సామాజికవర్గాలను కలుపుకుని వెళతానని తెలిపారు. కేశినేనిని పార్లమెంట్ గేటు తాకనివ్వమంటూ కొంతమంది నేతలు చేస్తున్న హడావుడి పై ప్రశ్నించగా, అది నిర్ణయించాల్సింది ప్రజలు అని, వారు కాదని, తన గెలుపుపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ర్యాలీలో అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్నతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.