విజయవాడ పార్లమెంట్ కేశినేని నానీదే
- 69 వేల మెజారిటీతో విజయం
సాక్షి, విజయవాడ : విజయవాడ పార్లమెంట్ సభ్యునిగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేశినేని శ్రీనివాస్ (నాని) ఎన్నికయ్యారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్‌పై విజయం సాధించారు. ఇరువురి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. అయితే విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో తెలుగుదేశంకు తిరుగులేని అధిక్యత రావడంతో కోనేరు ప్రసాద్‌పై సుమారు 69 వేల ఆధిక్యతతో గెలుపొందారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గ లెక్కింపులో వివాదం చోటు చేసుకోవడంతో కౌంటింగ్‌లో తీవ్ర జాప్యం జరిగింది. రాత్రి 11 గంటల సమయానికి కూడా ఓట్ల వివరాలు అందుబాటులోకి రాలేదు. కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన దేవినేని అవినాష్‌తోపాటు ఇతర అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.
గెలుపు మరింత బాధ్యత పెంచింది : కేశినేని
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ నాయకులకు, కార్యకర్తలకు కేశినేని శ్రీనివాస్ (నాని) హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ విజయం మరింత బాధ్యత పెంచిందన్నారు. ఇకనుంచి ప్రజల సేవకుడిగా, కుటుంబ సభ్యునిగా ఉంటానని చెప్పారు. ఫోన్ కాల్‌కయినా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. హామీల అమలుకు చిత్తశుద్ధితో కృషిచేసి విజయవాడ నగరాన్ని, పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు.