‘పచ్చ’నోట్ల ప్రవాహం
సాక్షి, విజయవాడ : జిల్లాలో గెలుపు కష్టమని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు పార్టీ పరిశీలకులు గెలుపుపై నమ్మకం లేదని చెప్పడంతో ప్రచారం సరిపోకపోతే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. దీంతో జిల్లాలో పచ్చనోట్ల వర్షం కురిపించాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఐదారు కోట్లు ఖర్చు చేయగా, మరో నాలుగైదు కోట్లు కుమ్మరించైనా సరే విజయం సాధించాలని భావిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసుకున్న పక్కా ప్రణాళికను చివరి మూడు రోజుల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీకి అండగా ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల పైనే టీడీపీ దృష్టి సారించినట్లు సమాచారం. కొంతమంది అభ్యర్థులు సొంత నిధులు సమకూర్చుకోగా, మరికొందరు పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు, హోటల్ యజమానులు, సినీ ప్రముఖుల నుంచి నిధులు సమకూర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బందరు ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ ఓటమి ఖాయమనే అభిప్రాయంతో నిధులు బయటకు తీయడం లేదని తెలుస్తోంది. దీంతో పార్టీ పరిశీలకుడు సుజనాచౌదరి జిల్లాలో పారిశ్రామిక వేత్తల నుంచి వసూలుచేసిన నిధులతో పాటు పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్ నుంచి సుమారు రూ.2 కోట్లు ఇప్పించినట్లు సమాచారం. ఎన్నికలకు ఒకటి రెండు రోజులు ముందే వీటిని నియోజకవర్గం మొత్తం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని) ఇప్పటి వరకు డబ్బులు తీయకపోవడంతో చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో చివరి మూడు రోజుల్లో తన మనీ మేనేజ్‌మెంట్ గురించి ఆయన వివరించినట్లు తెలిసింది. ఇప్పటికే విజయవాడలోని బిల్డర్లు, చాంబర్ ఆఫ్ కామర్స్, ట్రాన్స్‌పోర్టర్లతో పాటు ఇతర ప్రముఖుల నుంచి వసూలుచేసిన ఆరేడు కోట్ల రూపాయలను పంచుతానని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం.
తిరువూరు అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ నిధుల ఖర్చులో వెనుకబడి ఉన్నారని తెలియడంతో ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నుంచి నిధులు తెప్పించినట్లు సమాచారం. రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఇక్కడ మూడు నాలుగు కోట్లు కుమ్మరించనున్నట్లు తెలుస్తోంది. తొలుత స్థానికంగా ఉన్న ఒక బలమైన సామాజిక వర్గం నుంచి డబ్బు వసూలు చేయాలని భావించినా వారు చేతులెత్తేసినట్లు తెలిసింది.
నందిగామ అభ్యర్థి తంగిరాల ప్రభాకర్ డబ్బు ఖర్చు పెట్టలేక చేతులెత్తేసినట్లు తెలిసింది. నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కుమారుడు, పారిశ్రామికవేత్తకు పార్టీ నేతలు ఆ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆయనే నాలుగైదు కోట్లు ఖర్చుచేస్తున్నట్లు తెలిసింది.
నూజివీడు అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు పుష్కలంగా తెప్పిస్తున్నట్లు సమాచారం. ఆయన బంధువు ఆ పార్టీ అగ్రనేత కావడంతో అక్కడ నుంచి కూడా నిధులు వస్తున్నాయని పార్టీలో ప్రచారం సాగుతోంది. దీనికితోడు ఆయన సొంతంగా ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని సేకరించిన నిధుల్ని ఒకటి రెండు రోజుల్లో విరజిమ్మనునానరని తెలుస్తోంది.
బందరు అభ్యర్థి కొల్లు రవీంద్ర కూడా తన వద్ద నిధులు అయిపోయాయని చెప్పడంతో పార్టీ నుంచే ఐదారు కోట్ల రూపాయలు ఆయనకు సమకూర్చినట్లు తెలిసింది. ఇక్కడ పేర్ని నాని గాలి విపరీతంగా వీస్తుండటం వల్లే రవీంద్ర చేతులెత్తేసినట్లు సమాచారం. అవనిగడ్డ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ వద్ద తగినన్ని నిధులు లేకపోవడంతో ఆయనకు కూడా రాష్ట్ర పార్టీ నుంచే నిధులు సమకూర్చుతున్నట్లు తెలిసింది.
పెడన అభ్యర్థి కాగిత వెంకట్రావ్ డబ్బు పంపిణీలో వెనుకబడినట్లు తెలియడంతో ఆయన్ని గెలిపించాలంటూ లిక్కర్ సిండికేట్లకు సుజనా చౌదరి ఆదేశించినట్లు సమాచారం.
పామర్రు అభ్యర్థి వర్ల రామయ్య ఇప్పటికే రూ.4 కోట్లు వసూలు చేసి సిద్ధంగా ఉంచినట్లు తెలిసింది. మూడు నాలుగు రోజుల్లో పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమా పరిస్థితి విచిత్రంగా మారింది. తన వద్ద కోట్లు ఉన్నాయంటూ నమ్మించి సీటు సంపాదించినట్లు సమాచారం. చివర్లో సీటు ఇవ్వడంతో ఆస్తులు అమ్మి డబ్బు తీసుకురావడం వీలు పడలేదని చంద్రబాబు వద్ద తేల్చి చెప్పినట్లు తెలిసింది. గెలుపుపై ఆశలు లేకే ఆయన చేతులెత్తేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు రూ.4 కోట్లు సర్ది ఎన్నికల తర్వాత వసూలు చేయాలంటూ సుజనా చౌదరిని చంద్రబాబు ఆదేశించారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
కైకలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు సినీ రంగం నుంచి నిధులు పుష్కలంగా వస్తున్నాయి. ఆయన నియోజకవర్గంలో ఐదు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల వినియోగం కోసం తన సామాజిక వర్గం నుంచి వసూలు చేసినట్లు నాలుగైదు కోట్లు సిద్ధం చేసినట్లు తెలిసింది. నాలుగైదు రోజుల్లో వీటిలో కొంత ఖర్చుచేయనున్నట్లు సమాచారం.
దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం), వల్లభనేని వంశీమోహన్ (గన్నవరం), బోడే ప్రసాద్ (పెనమలూరు), రావి వెంకటేశ్వరరావు (గుడివాడ), గద్దె రామ్మోహన్ (విజయవాడ తూర్పు), శ్రీరాం రాజగోపాల్ (జగ్గయ్యపేట)లు స్వంతంగానే నిధులు సమకూర్చుకున్నట్లు తెలిసింది.