టీడీపీ అభ్యర్థుల మధ్య అగాధం
- ఎవరి దారి వారిదే...
- ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తలోదారి
- పైకి కలిసి ప్రచారం... లోపల ఎవరి లెక్కలు వారివే
- కేశినేని నోటి దురుసు
- కొనకళ్ల పొదుపు చర్యలు
ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నా.. టీడీపీలో నేతల మధ్య విభేదాలు తొలగకపోగా ఇంకా పెరిగిపోతున్నాయి. ప్రచారంలో కలిసి పాల్గొంటున్నా.. తెరవెనుక వెన్నుపోట్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వారి విభేదాలతో మధ్యలో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య ఏర్పడ్డ అగాధం ఇప్పట్లో సమసిపోదని పార్టీ పరిశీలకులే పెదవి విరుస్తున్నారు.
సాక్షి, విజయవాడ : విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని)కి నోటి దురుసు ఎక్కువని, దీనికితోడు అందరినీ చులకన చేసి మాట్లాడతాడని పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలో తన ఆధిపత్యం సాధించాలని నాని ప్రయత్నిస్తుంటే దానికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమాత్రం అంగీకరించడం లేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని ఉమాకు, కేశినేని నానికి మధ్య ఆధిపత్యపోరు తీవ్రస్థాయికి చేరింది.
ఈ ఇద్దరు నేతల మధ్య పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. విజయవాడ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్‌కు, కేశినేని నానికి మధ్య ఎప్పుడో ఏర్పడ్డ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమాకు, కేశినేని నానికి మధ్య అనేక విభేదాలు ఉన్నాయి. బొండా ఉమా, దేవినేని ఉమాలు కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని నమ్ముతున్న కేశినేని నాని సెంట్రల్‌లో సొంత కుంపటి కూడా పెట్టుకోవడం ఇందులో భాగమేనని తెలుస్తోంది.
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను డమ్మీలను చేసి తాను పెత్తనం చేయాలని కేశినేని చూస్తున్నారనేది ఆయా స్థానాల అభ్యర్థుల అభిప్రాయంగా కనబడుతోంది. జగ్గయ్యపేటలో శ్రీరాం తాతయ్యతోనూ నానికి పొసగడం లేదు. నానితో కలిసి ఉన్నట్లే నటిస్తున్నా.. ఎన్నికల నాటికి శ్రీరాం తాతయ్య దేవినేని ఉమా వర్గంతో కలిసి కేశినేనికి దెబ్బకొడతారనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా తమపై పెత్తనం చేయాలని చూస్తున్న కేశినేని నానిని ఎన్నికల్లో ఓడించి, తాము గెలిచి తమ సత్తా చూపించాలనే భావనలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది.
కొనకళ్ల కొంప ఎమ్మెల్యే అభ్యర్థులే ముంచుతారా...
ఈసారి ఎన్నికల్లో టీడీపీ మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి కొనకళ్ల నారాయణ డబ్బు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లు సమయంలో తనకు గుండెనొప్పి రావడమే తనను విజయపథంలో నడిపిస్తుందనే గట్టి నమ్మకంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నిక ల స్థాయిలో కూడా ఖర్చు పెట్టకుండా పొదుపు చర్యలు పాటిస్తున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నారు. దీంతో ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ప్రచారం తామే చేసుకుంటున్నారు తప్ప కొనకళ్ల గురించి పట్టించుకోవడం లేదు.
ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులు కొల్లు రవీంద్ర (బందరు), కాగిత వెంకట్రావు (పెడన), వర్ల రామయ్య (పామర్రు) ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా వారికి సహాయం అందించేందుకు కొనకళ్ల సిద్ధంగా లేరని సమాచారం. కాంగ్రెస్ నుంచి వచ్చిన మండలి బుద్ధప్రసాద్, కొనకళ్ల నారాయణ మధ్య ఇంకా సఖ్యత ఏర్పడలేదు. వంశీమోహన్ (గన్నవరం), బోడే ప్రసాద్ (పెనమలూరు), రావి వెంకటేశ్వరరావు (గుడివాడ) కొనకళ్లను పట్టించుకోకుండా తమ ప్రచారం తాము చేసుకుంటున్నారు.
గతంలో కాపు, గౌడ సామాజిక వర్గాలు కొనకళ్లకు అండగా ఉన్నాయని, ఈసారి ఆయా వర్గాలు వైఎస్సార్‌సీపీకి అండగా మారడంతో కొనకళ్ల వల్ల తమకు ఉపయోగం లేదనే భావనలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.