అది టీడీపీకి సంప్రదాయంగా మారింది: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: అనంతపురం జిల్లా కనగానపల్లి ఎంపీపీ ఉపఎన్నికలో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. బుధవారం వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు బాటలోనే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు బేరసారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి పదవులను కైవసం చేసుకోవడం టీడీపీకి సంప్రదాయంగా మారిందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.
మంత్రి దేవినేని ఉమ పై వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'మీ ఇంటి పేరు దేవినేని కాదు అవినీతి. మంత్రి పదవిలో ఉండి స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలి. పోలవరంపై వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పుడు ఆరోపణలు చేయొద్దు' అన్నారు. కాంట్రాక‍్టర్ల కమిషన్ల కోసమే పోలవరం అంచనాలను అమాంతంగా పెంచారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును.. ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ఫర్వాలేదు మాకు పోలవరం ఇస్తే చాలని తీసుకున్నారని ఆమె విమర్శించారు.