100శాతం బెజవాడే రాజధాని
- మారనున్న విజయవాడ స్వరూప స్వభావాలు
- అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం
- వ్యవసాయ రంగం ద్వారా ప్రభుత్వాదాయాన్ని పెంచే మార్గాన్వేషణ
- పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు
- బందర్ పోర్టు పనులు త్వరలో ప్రారంభం
- ‘సాక్షి’తో ఎంపీ కేశినేని శ్రీనివాస్
సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ ఇక మహానగరం కానున్నదని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) చెప్పారు. శనివారం ఆయన తన కార్యాలయంలో సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ఎవరెన్ని చెప్పినా విజయవాడ రాజధాని కావడం ఖాయమన్నారు. అయితే.. క్యాపిటల్ కమిటీ రిపోర్టు ఇవ్వకుండా మనం మాట్లాడటం సమంజసం కాదంటూనే నగరం స్వరూప స్వభావాలే మారిపోతాయన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు తయారవుతున్నాయన్నారు.
‘దక్షిణ బైపాస్ మంజూరైందని, గుంటూరు వద్ద కాజా నుంచి మొదలై విజయవాడ తూర్పు శివార్ల నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ దాటిన తరువాత చిన్నఅవుటుపల్లి వద్దకు 48 కిలోమీటర్ల పొడవున ఔటర్ రింగ్‌రోడ్డు కూడా ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు రెడీ చేసినట్లు చెప్పారు. గొల్లపూడి వద్ద ఆరు లైన్ల బైపాస్ రోడ్డుకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. ఇది బీవోటీ ద్వారా నిర్మిస్తారని చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ దీని ద్వారా ఏలూరు వైపు వెళ్తుందన్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య లేనట్లేనని కేశినేని నాని చెప్పారు.
దుర్గగుడి వద్ద ట్రాఫిక్ రద్దీకి మూడు ఆఫ్షన్‌లు
కనకదుర్గమ్మ గుడి వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం విషయం ప్రస్తావించగా మూడు ఆప్షన్స్ రెడీ అయినట్లు ఎంపీ చెప్పారు. భవానీపురం నుంచి కృష్ణలంక వరకు సుమారు ఐదు కిలోమీటర్ల రోడ్డు అటు జాతీయ రహదారుల శాఖ పరిధిలోగానీ, ఇటు ఆర్ అండ్ బీ కిందగాని లేదన్నారు. నేషనల్ హైవే కిందకు ఈ రహదారి ప్రాంతాన్ని తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వారికి అప్పగించిన తరువాత మాత్రమే నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు.
త్వరలో బందరు పోర్టు పనులు
బందరు పోర్టు పనులు త్వరలోనే వేగం పుంజుకుంటాయన్నారు. పోర్టుకు నిధులు లేవనే వాదనను ఆయన కొట్టిపారేశారు. బడ్జెట్‌లో 15 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తారని, మిగిలిన 85శాతం నిధులు డీఫాల్ట్‌లో ఉంటాయన్నారు. బడ్జెట్‌తో సంబంధం లేకుండానే చాలా పనులు జరుగుతాయని చెప్పారు. సీఎం కూడా ఎలాగైనా పోర్టు నిర్మాణాన్ని పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నారన్నారు.
బీవోటీ పద్ధతిలో చేపట్టే పనులు సక్రమంగా ఉండటంలేదన్న ఆరోపణలు ఆయన దృష్టికి తీసుకురాగా జాతీయ రహదారుల్లో టోల్‌గేట్లు ఏర్పాటుచేయడం ద్వారా బీవోటీ పద్ధతుల్లో రహదారుల అభివృద్ధి ఎలా ఉందో చూస్తున్నారు కదా అంటూ ప్రశ్నించారు. పరిశ్రమలు రావాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం
గన్నవరం ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏడు వందల ఎకరాలు భూసేకరణ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. స్థలం సరిపోదనే వాదనను ఆయన కొట్టిపారేశారు. ఇక్కడ మరో రెండు వందల ఎకరాల స్థలం కూడా సేకరించే అవకాశం ఉందన్నారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి
65శాతం మంది జనం వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని, ఆ రంగం నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 25శాతమేనన్నారు. వ్యవసాయ రంగం నుంచి రెవెన్యూను ఎలా రాబట్టుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోందని కేశినేని అన్నారు. సర్వీస్ సెక్టార్లు పెరగాలని, పారిశ్రామిక రంగం పెరిగితేనే ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. ఇక్కడ అవకాశాలు లేకపోవడంవల్లే వృత్తి నైపుణ్యం ఉన్న వారు విదేశాలకు వెళ్తున్నారని.. సాధారణ డిగ్రీలు పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు లేవన్నారు. అన్నీ ప్రభుత్వమే చేయాలంటే దేశ అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు సాగదన్నారు.