
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ ఎంపీ కేశినేని నాని
సాక్షి, అమరావతి: సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతాడని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. విలేకరులతో నాని మాట్లాడుతూ..వాళ్ల అన్నయ్య చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 సీట్లు మాత్రమే గెలిచారనే విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ ఒక యాక్టర్, అతన్ని చూడటానికి మాత్రమే ప్రజలు వస్తారు..అంతే కానీ వాపును చూసి బలుపు అనుకోకూడదని హితవు పలికారు. పవన్ కల్యాణ్ తన బలం, బలహీనత తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
మంత్రి జవహర్ మాట్లాడుతూ..పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీని కాపాడటానికే చంద్రబాబుపై పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును దించాలనే లక్ష్యం తప్ప, ప్రజాసమస్యల పట్ల పవన్‌కు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఖర్చు పెట్టేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారనే పవన్ వ్యాఖ్యలు అర్ధరహితమైనవన్నారు.
ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు డబ్బులు తీసుకోవడం పవన్‌కు అలవాటుగా మారిందని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ డబ్బులు అనే యావ పవన్‌కు పట్టిందని విమర్శించారు. మూడు రోజులు ఆంధ్రాలో తిరిగి, ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్‌కు చెక్కేసే పవన్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు.