
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ వైఖరిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం పట్ల అప్పటి ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు అమలు చేసినప్పుడు పవన్‌కళ్యాణ్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ‘నాకు కులాలు, మతాలు, ప్రాంతాలతో పనిలేదు. కానీ ప్రస్తుతం నేను రాజకీయాల్లోకి వచ్చాను గనక అలాంటి సమస్యలపైనా మాట్లాడాల్సి వస్తోంది.
కాపు రిజర్వేషన్ల అంశం చాలా సున్నితమైనది. ఎవరైనా ప్రజల్ని రెచ్చగొట్టే రాజకీయాలు చేయకూడదు. కష్టనష్టాలు, లోటుపాట్లు ఏవైనా ఉంటే కమిషన్ (కాపు రిజర్వేషన్ల అంశంపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వేసిన)కు చెప్పాలి. శాంతియుతంగా పాదయాత్రలు చేసేందుకు ముందుకొస్తే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ, గతంలో హింస (తుని రైలు దగ్ధం ఘటన) జరగడం వల్లే ఇప్పుడు సమస్య వచి్చంది’ అని 2017 జూలై 31న వ్యాఖ్యానించారని పలువురు గుర్తు చేస్తున్నారు.
ఇటీవల కందుకూరు, గుంటూరులో బాబు సభల కారణంగా 11 మంది అమాయక ప్రజలు మరణించడాన్ని లైట్ తీసుకుంటుండటం విస్మయపరుస్తోందని పలువురు తప్పు పడుతున్నారు. అలా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోను తప్పుపట్టడానికే పరిమితం కాకుండా, ఆ ఘటనలకు పరోక్ష కారణమైన చంద్రబాబుకు మద్దతు తెలపడం రాజకీయం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది.
ఆది నుంచీ చంద్రబాబు కోసమే..
► 2014 ఎన్నికల ముందే జనసేన పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ, ఆ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా, ఒక్క సీటులో కూడా పోటీ చేయలేదు.
► చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎవరైనా సమస్యలను ప్రస్తావిస్తే.. ఎవరు సీఎంగా ఉన్నా వారసత్వంగా వస్తూనే ఉంటాయన్నారు.
► ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఆయన అనుభవం పనికొస్తుందని మౌనంగా ఉన్నానని చెప్పారు.
► 2019 ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లు చీల్చడం ద్వారా టీడీపీకి ప్రయోజనం కలిగించారు.
► ప్రస్తుతం బీజేపీని టీడీపీకి దగ్గర చేయడం ద్వారా చంద్రబాబుకు రాజకీయంగా లాభం చేకూర్చేందుకు ఉబలాటపడుతున్నారు. బీజేపీతో పొత్తును కొనసాగిస్తూ, మరోపక్క టీడీపీకి ఉపకరించేలా అడుగులు వేస్తున్నారు.