
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్ సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి అంతా ఊహించినట్లే కీలక బాధ్యతలు దక్కాయి. బీజేపీ కార్యకర్తలంతా ‘కిషనన్నా’అని ఆప్యాయంగా పిలుచుకునే ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా అవకాశం లభించింది. తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలుపొందగా.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా పార్టీతో అనుబంధం ఉన్న కిషన్‌రెడ్డిని మంత్రి పదవి వరించింది. గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపడ్తారని బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశాయి.
ఆ ప్రచారంకు తగినట్లే ప్రధాని నరేంద్రమోదీ కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలను కేటాయించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి స్వల్ప ఓట్లతో ఓడిన ఆయన తాజా లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఘనవిజయం సాధించారు. అంబర్‌పేటలో ఓటమి ఆయన మంచికే జరిగిందని, కేంద్రమంత్రి కావాలని ఉండటంతోనే ఓడిపోయారని తెలంగాణ బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అప్పుడు గెలిచి ఉంటే ఇప్పుడు కేంద్రమంత్రి అయ్యేవారు కాదని పేర్కొంటున్నాయి.
ఆ ప్రత్యేక అనుబంధమే కారణమా?
ప్రధాని నరేంద్ర మోదీతో కిషన్‌రెడ్డికి ఉన్న ప్రత్యేక అనుబంధమే కీలక బాధ్యతలు కేటాయించేలా చేసిందని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పనిచేసిన సమయంలో మోదీకి దగ్గరయ్యారని, అప్పట్లో బీజేపీ జాతీయ నేతలంతా కలసి పర్యటించిన నేపథ్యంలో మోదీ, కిషన్‌రెడ్డి ఒకే గదిలో బస చేసిన సందర్భం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలా వారిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని, కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడానికి అది కూడా ఒక కారణమని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment