
సాక్షి, అమరావతి: ప్రతిపక్షం లేకుండా శాసనసభ సమావేశాలు నిర్వహించి టీడీపీ ప్రభుత్వం కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి విమర్శించారు. బుధవారం ఆయన అసెంబ్లీలో హమీల కమిటీ సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... మొట్ట మొదటి సమావేశం కావడంతో హాజరైనట్టు చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తేనే తాము శాసనసభ సమావేశాలకు హాజరవుతామని పునరుద్ఘాటించారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ద్వారా తాము లేవనెత్తిన సమస్య తీవ్రతను వ్యక్తం చేస్తున్నామన్నారు. ఏ పార్టీకి రాజ్యాంగ విలువలు ఉన్నాయే ప్రజలు తేలుస్తారని, శాసనసభ సమావేశాలను బహిష్కరించడం ద్వారా తమ పార్టీ గళం అందరికీ వినిపించిందని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు రాకుండా అసెంబ్లీ సమవేశాలు నిర్వహించడం తప్పు అని ప్రభుత్వం రియలైజ్ కాలేదన్నారు. ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోయిందని, ఇలాంటి ధోరణితో గతంలో ఏ పార్టీ వ్యవహరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ప్రశ్నించినా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని ధ్వజమెత్తారు. కృష్ణా నదిలో పడవ ప్రమాదంపై ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేగా అసెంబ్లీ వచ్చి ఎంతో నేర్చుకోవాలని తమకు కూడా ఉందని అన్నారు. ఇప్పుడు జనాకర్షణ ఉన్న ఒకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కోన రఘుపతి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment