సాక్షి, హైదరాబాద్ : తనకు టికెట్ ఇవ్వకుండా నిరాకరించిన టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై ఆ పార్టీ అసమ్మతి నేత కొండా సురేఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అని, ధనికులకే మేలు చేసేవిధంగా ఆయన అన్యాయమైన పాలన చేస్తున్నారని కొండా సురేఖ మండిపడ్డారు. కొండ దంపతులు మంగళవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘నాకు జరిగిన నమ్మకం ద్రోహం గురించి కేసీఆర్, కేటీఆర్‌ను అడిగినా సమాధానం రాలేదు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి టికెట్లు రావని కేటీఆర్ అంటున్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేయడమేనా మేం చేసిన క్రమశిక్షణ ఉల్లంఘనా?’ అని ప్రశ్నించారు.
కేసీఆర్ టికెట్ల ప్రకటన చేసిన తర్వాత అధిష్టానానికి తాము లేఖ రాశామని, తమ లేఖపై టీఆర్‌ఎస్ అధినాయకత్వం స్పందిస్తారని ఆశించి పదిరోజులు వేచి చూశామని, కానీ తమకు నిరాశే ఎదురైందని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ నిరాకరించి తమ ఆత్మాభిమానాన్ని టీఆర్‌ఎస్ అధినాయకత్వం దెబ్బతీసిందని ఆమె మండిపడ్డారు. మౌనం అర్థాంగికారం అన్నట్టు ఈ విషయంలో కేసీఆర్ వ్యవహరించారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒక్కరోజు కూడా సచివాలయానికి వెళ్లలేదని మండిపడ్డారు. ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్తున్నారని విమర్శించారు. తన ప్రభుత్వంలో ఒక్క మహిళను కూడా మంత్రిగా చేయలేదు. అమరవీరుల కుటుంబాల్లో ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదు. శ్రీకాంతచారి తల్లికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు’ అని కొండా సురేఖ ప్రశ్నించారు.
కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖను మీడియా సమావేశంలో కొండా సురేఖ చదివి వినిపించారు. లేఖ పూర్తి పాఠం ఆమె మాటల్లో..
‘ప్రజాస్వామ్య విలువలకు పాతర వేసిన కేసీఆర్‌కు నా బహిరంగ లేఖ. మహిళలకు క్యాబినెట్‌లో చోటు ఇవన్ని పాలన. ప్రజలని ఒక్కసారి కూడా కలవని పాలన. ఎంపీ, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవన్ని గుడ్డి పాలన. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవని దుర్మార్గ పాలన. సోనియా లేకుండా తెలంగాణ వచ్చేది కాదు అని అసెంబ్లీలో మొదట ప్రవేశపెట్టిన తీర్మానం ఒక్కసారి కేటీఆర్ చూడాలి. నాలుగేళ్లు అయినా నాకు కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకదు. సీఎంవో నుంచి అపాయింట్మెంట్లు ఉండవు. ఇక మిమ్మలని ఎలా నమ్మాలి? ఆత్మ గౌరవం మాకు ముఖ్యం. టీఆర్‌ఎస్‌లో ఉన్నన్ని రోజులు ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఉన్నాం. బీసీ మహిళ అయిన నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఒకరు మందు గోళీలు, ఇంకొకరు భోజనం పెట్టినందుకు రాజ్యసభ సీటు ఇచ్చారు. ఎంపీగా ఉన్న బాల్క సుమన్, మల్లారెడ్డికి ఎమ్మెల్యే గా టికెట్ ఎందుకు ఇచ్చారు? శ్రీకాంతాచారి తల్లికి ఒక్క పదవి ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారికి టికెట్లు ఎందుకు ఇవలేదు?
ఎన్నికలు ఆలస్యం అయితే ఓడిపోతామని ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత కేటీఆర్ చేతిలో తెలంగాణను పెట్టాలని చూస్తున్నారు. కేసీఆర్ పెట్టిన కొన్ని పథకాలవల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. రైతుబంధు పథకం వల్ల ధనిక రైతులకు లాభం జరుగుతోంది. మేము ఎక్కడా క్రమశిక్షణ ఉల్లంఘించలేదు. మిమ్మలి తిట్టిన వాళ్లను మంత్రులుగా చేయడమేనా క్రమశిక్షణ అంటే. కేసీఆర్ పాలన అంటేనే అవినీతి పాలన. వేలకోట్ల ప్రజాధనంతో కేసీఆర్ ఖజానా నిండిపోయింది. హైదరాబాద్‌లో కేటీఆర్, ఆయన బినామిలు సెటిల్మెంట్లు చేశారు. విచ్చలవిడిగా కేటీఆర్ బార్లకు అనుమతులు ఇచ్చారు. ఉద్యోగుల సమస్య తీర్చలేని అసమర్థ పాలన కేసీఆర్‌ది. ఎర్రబెల్లి దయాకర్‌రావును పార్టీలో చేర్చుకొని కులతత్వంతో మమ్మల్ని అణగదొక్కారు.
పుటకోమాట మాట్లాడటం.. పెద్దలని అవమానించడం కేసీఆర్‌కు అలవాటు. తెలంగాణ కేసీఆర్ ఆస్తి కాదు.. కేటీఆర్‌కు రాసి ఇవ్వడానికి. కేటీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం లేదు. కవిత అమెరికా నుంచి వచ్చినప్పుడు తిరిగిన కారు ఎవరిదో చెప్పాలి. సీఎంవోలో ఉన్న పెండింగ్ ఫైళ్లు ప్రజల ముందు ఉంచాలి. బీజేపీతో మీకున్న లోపాయకారి ఒప్పందాలు ఏమిటి? డ్రగ్స్, నయీం కేసులు ఏమయ్యాయి? కేసీఆర్ ఎప్పుడూ చంద్రబాబుతో వైరమే పెట్టుకున్నారు. సఖ్యత లేదు. మరి హరికృష్ణ ఎవరు? ఉద్యమకారుడా? ఎవడబ్బా సొమ్ము అని హరికృష్ణ స్మారకానికి భూమి ఇచ్చారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు.. జయశంకర్ తెలంగాణ జాతిపిత. ఆయన బతికి ఉంటే, ఈ పాలన చూసి ఆత్మహత్య చేసుకునేవారు. కేటీఆర్ టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా.
కేటీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలి. ప్రతిపక్షాల చేతిలో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటమి తప్పదు. మేం హరీశ్ వర్గం.. ఇంకా చాలామంది ఉన్నారు. మాకు పదిహేను పార్టీల నుంచి ఆహ్వానం వస్తుంది. అవసరమైతే సీఎం అభ్యర్థిని చేస్తామంటున్నారు. నాలుగు రోజుల్లో మా కార్యాచరణ ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాలో కొండా సురేఖకు చోటు (వరంగల్ తూర్పు) లభించకపోవడంతో తన భర్త, ఎమ్మెల్సీ మురళీధర్‌రావుతో కలసి ఈ నెల 8న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేటీఆరే తన టికెట్‌ను అడ్డుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు టికెట్ కేటాయించకపోవడానికి రెండు రోజుల్లో కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. వినాయక చవితి నేపథ్యంలో ఇన్నాళ్లూ వేచి చూసినా టీఆర్‌ఎస్ పెద్దల నుంచి మాత్రం స్పందన రాలేదు. దీంతో కొండా దంపతులు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఆ పార్టీ తరుపున వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో రెండు చోట్ల పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం తరుపున వీరికి హామీ లభించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment