సాక్షి, విజయనగరం : జిల్లా టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు సోదరుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు కొండపల్లి కొండలరావు ఝలక్ ఇచ్చారు. కొండపల్లి కొండలరావు టీడీపీకి రాజీనామా చేశారు. నియోజకవర్గం నేతలు అందరూ కేఏ నాయుడికి సీటు ఇవ్వద్దని చెప్పినా ఆయనకే టికెట్ ఇవ్వటంతో.. పార్టీ అధిష్టానం నిర్ణయానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు కొండలరావు అలియాస్ కొండబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘37 సంవత్సరాలుగా తెలుగదేశం పార్టీలో పని చేస్తున్నాను. మా నాన్న మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు ఆధ్వర్యంలో టీడీపీని జిల్లాలో గెలుపించుకు వచ్చాం. 37 సంవత్సరాలు పనిచేసినా పార్టీ గుర్తించలేదు. 2014లో మా తమ్ముడిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నాకు మంచి అవకాశం ఇస్తామని మాట తప్పారు. నియోజకవర్గం నేతలు అందరూ కేఏ నాయుడికి సీటు ఇవ్వద్దని చెప్పినా ఇచ్చారు.
నిండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కేఏ నాయుడుకి మరలా టికెట్ ఇవ్వడం పార్టీ పతనానికి నాంది పలికింది. ఆయన అభ్యర్థిత్వాన్ని అనేక సర్వేలు.. కేడర్ వ్యతిరేకించినా అధిష్టానం పట్టించుకోలేదు. మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్నా.. దాన్ని గుర్తించలేదు సరికదా కనీసం పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అందుకే తెలుగు దేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాం. రేపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సమక్షంలో నా సహచరులతో కలిసి వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయించుకున్నాం. ఇరవై గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు, ఎనిమిది వేల మంది కార్యకర్తలతో రేపు వైఎస్సార్ సీపీలో చేరుతున్నా’’మని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment