
సాక్షి, హైదరాబాద్: ట్విట్టర్ నాయుడు లోకేష్‌కు దమ్ముంటే నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయమై బహిరంగ చర్చకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు సవాల్ విసిరారు. పితృదినోత్సవం రోజునే అబద్ధాలను ట్వీట్ చేసి అభాసుపాలవడం బుర్రలేని లోకేష్‌కే చెల్లిందన్నారు. సోమవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్వీట్లు చేయడం కాదని చర్చకు అమరావతికి రమ్మన్నా.. మరెక్కడికి రమ్మన్నా తాము సిద్ధమేనని చెప్పారు. తమ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో 2016 నవంబర్ 25వ తేదీన సీఎం చంద్రబాబును 36 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి తమ నియోజకవర్గాలకు స్పెషల్ డెవెలప్‌మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్)ను ఎందుక్విరని నిలదీశామని గుర్తు చేశారు.
ఓడిపోయిన నేతలకు నిధులిచ్చే విధానం దేశంలో ఎక్కడా లేదని ఆయన దృష్టికి తెస్తే.. చంద్రబాబు స్పందించకుండా ఎమ్మెల్యేల ద్వారా నియోజకవర్గాలకు నిధులు ఇవ్వలేమని.. అవి వేరే రూట్‌లో వస్తాయని సమాధానం ఇచ్చారన్నారు. దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అధికార, ప్రతిపక్షాలనే తేడా లేకుండా అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి ఎస్‌డీఎఫ్ నిధులను కేటాయించారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఎవరైనా అనారోగ్యంతో బాధ పడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే వాటిని పక్కన పెడుతున్నారని విమర్శించారు. 2016 మార్చిలో ఎస్‌డీఎఫ్‌పై చర్చ జరిగినపుడు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు.. ఫండ్ ఇస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీలో చేరరని అన్న విషయాన్ని మరచిపోతే ఎలా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment