
సాక్షి, హైదరాబాద్: కమీషన్ల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నోటిని అదుపులో పెట్టుకోవాలని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఏమాత్రం సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు హెచ్చరించారు. వైఎస్ కుటుంబ సభ్యులపైనా, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనా నోరు పారేసుకున్నందుకు మంత్రి తక్షణం క్షమాపణ చెప్పాలన్నారు.
మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసంకల్పం పాదయాత్రలో జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంటతో మతి భ్రమించి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇస్తుంటే ఓర్వలేక చంద్రబాబు ఆదేశాలతో ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమా ధర్నా చేశారని గుర్తు చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఉమా రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి కడప నుంచి కదలాలని ఆయన హెచ్చరించారు.
‘ఉక్కు’ను అడ్డుకున్న నేతలే దొంగ దీక్షలు
వైఎస్ హయాంలో కడప ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకున్న టీడీపీ నేతలే ఇపుడు దొంగదీక్షలు చేస్తున్నారని, ఈ దీక్షలకు విలువ లేకపోవడంతో చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారని అన్నారు. కడప ఉక్కు, విశాఖపట్నం రైల్వే జోన్, ప్రత్యేక హోదా, విభజన హామీలపై తొలి నుంచీ పోరాడుతున్నది వైఎస్సార్ సీపీయేనని.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే అవి సాధ్యమవుతాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment