
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం మీడియా సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా మంత్రి తీరును తీవ్రంగా తప్పుబట్టిన స్థానిక నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నాయకుల పట్ల జవహర్ అహంభావ వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా ఆయనకు వ్యతిరేకంగా కొవ్వూరులో మరో టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసి ఆగ్రహం వెళ్లగక్కారు. ‘గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల వల్ల నియోజకవర్గంలో ఎటువంటి గొడవలు తలెత్తలేదు. కానీ మంత్రి జవహర్ మాత్రం ఉన్న నాయకులు పోయినా పర్వాలేదని మాట్లాడటం బాధాకరం’ అని జడ్పీటీసీ గారపాటి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యక్తిగత కక్షలు ఉంటే...
మంత్రికి ఎవరితోనైనా వ్యక్తిగత కక్షలు ఉంటే బహిరంగంగా మాట్లాడాలే తప్ప.. అందుకోసం నియోజకవర్గం పేరును అడ్డుపెట్టుకోవడం సరికాదని మాజీ మున్సిపల్ చైర్మన్ సూరపనేని రామ్మోహనరావు అన్నారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు నియోజకవర్గం పేరును పాడుచేసినందు వల్లే కొవ్వూరును.. కోవూరుగా మార్చామని జవహర్ అనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కౌన్సిల్ తీర్మానం మేరకే పేరు మార్చిన సంగతి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజల మనోభావాలను మంత్రి దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరంలో క్రైస్తవ వివాహ వేదిక నిర్మాణానికి 60 లక్షల రూపాయలు మంజూరు అయితే.. ఆ నిధి రాకుండా జవహర్ అడ్డుపడ్డారని సూరపనేని ఆరోపించారు. ఆయన తీరును అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment