సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అప్పులమయంగా మారిస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి మాటను అమలు చేసేందుకు ఆయన కష్టపడుతున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై శుక్రవారం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ 100 రోజుల పాలన రైతు పక్షపాతంగా సాగిందన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని, రైతులను గట్టెక్కించేలా సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. రైతు బాగు కోసం వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ పథకం ద్వారా 70 లక్షల మంది రైతులకు మేలు జరిగే అవకాశం ఉందన్నారు.
అలాగే వైఎస్సార్ వడ్డీ లేని పంట రుణాల పథకాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కౌలు రైతులు కోసం సాగు హక్కు చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తుచేశారు. కౌలు రైతులకు కూడా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ. 2 వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధిని ఏర్పాటు చేశామన్నారు. పామాయిల్ రైతులకు రూ. 84 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. రూ. 119 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. రాయలసీమలో తీవ్ర కరువు నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు ట్యాంకర్ రూ. 600 చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం దారుణమన్నారు. హుద్‌హుద్, తిత్లీ తుపాన్ బాధిత రైతులకు చంద్రబాబు కనీసం ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఐదేళ్ల చంద్రబాబు అరాచక పాలనను భరించలేకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు చేయ్యలేని పనులు సీఎం వైఎస్ జగన్ 100 రోజుల్లో చేసి చూపిస్తున్నారని చెప్పారు. 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలిచ్చిన ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ఓటమిపై 100 రోజుల్లో సమీక్ష చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. టీడీపీలో అంతర్గత సంక్షభం నెలకొందని.. అందుకే చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు టీడీపీ నేతలు ఇతర పార్టీలోకి వెళ్లిపోతారనే భయం పట్టుకుందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. ఒక ఎస్సీ మహిళను వినాయకుడి వద్దకు వెళ్లకుండా టీడీపీ నేతలు అవమానించడం దారుణమన్నారు. సీఎం వైఎస్ జగన్ అనుమతి ఇచ్చి ఉంటే ఇప్పటికే టీడీపీ ఖాళీ అయ్యేదని అన్నారు. 4 గురు టీడీపీ ఎంపీలు పార్టీ ఫిరాయిస్తే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదని సూటిగా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment