
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంలకు కేబినెట్‌లో చోటు కల్పిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జిల్లాలో వాల్మీకి సామాజిక వర్గానికి మొదటిసారిగా మంత్రి పదవి రావడం విశేషం. గుమ్మనూరు ఆ ఘనతను దక్కించుకున్నారు. మరోవైపు సౌమ్యుడిగా, విద్యావంతుడిగా పేరున్న బుగ్గనకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం మొదటి నుంచి జరిగింది. ఇందుకు అనుగుణంగానే ఈయనకు బెర్త్ ఖరారు చేశారు. ఈయన ఇటీవలి వరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా పనిచేశారు. ఆ పదవిలో హుందాగా వ్యవహరించడంతో పాటు టీడీపీ ప్రభుత్వ అసంబద్ధ విధానాలను సమర్థవంతంగా ఎండగట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి కూడా వన్నె తెస్తారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలో వాల్మీకులు బలమైన వర్గంగా ఉన్నారు. ఆ వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెంట నడుస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ రూ.కోట్లలో డబ్బు ఆశ చూపినప్పటికీ ప్రలోభాలకు లొంగలేదు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జగన్ వెంట నడిచారు. ఇది ఈయనకు కలిసి వచ్చింది. బుగ్గన, గుమ్మనూరు ఇద్దరూ వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికవడం విశేషం.
సామాజిక న్యాయం దిశగా...
జిల్లా రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తం 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు గాను అన్నింటినీ ఆ పార్టీ కైవసం చేసుకుంది. గెలిచిన వారిలో అందరూ ఉద్దండులే. ఈ నేపథ్యంలోఎవరికి మంత్రి పదవులు వస్తాయనే ఉత్కంఠ చివరి నిమిషం వరకూ కొనసాగింది. అయితే, సామాజిక సమతుల్యంతో పాటు సామాజిక న్యాయం దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచించారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో బుగ్గన, గుమ్మనూరుకు అవకాశం కల్పించారు. వాస్తవానికి జిల్లాలో ఇప్పటివరకు వాల్మీకులకు మంత్రి పదవి దక్కలేదు. ఈ వర్గానికి తెలుగుదేశం పార్టీ పదవులు ఇవ్వకుండా కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వచ్చింది. ఒకానొకదశలో ఫ్యాక్షనిస్టు ముద్ర వేసి వెంకటప్ప నాయుడికి జెడ్పీ చైర్మన్ పీఠం ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. అయితే.. సామాజిక న్యాయం దిశగా ఈ వర్గానికి మొదటిసారిగా మంత్రి పదవి కట్టబెట్టిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతోంది.
నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేస్తాం
జగన్ మోహన్‌రెడ్డి పార్టీ స్థాపించిన సమయంలో మంచి పరిపాలన అందించడంతో పాటు తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని భావించారు. ఆయనతో పాటు దాదాపు పదేళ్లుగా ప్రయాణం చేస్తున్నా. పార్టీ స్థాపించిన నాటి నుంచి జగనన్న ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక లీడర్‌కు కావాల్సిన లక్షణాలు.. ధైర్యం, పట్టుదల, సాహసమని ఒక బెంచ్ మార్క్‌ను జగనన్న చూపించారు. ఇక వైఎస్ విజయమ్మ ఉన్న ఒక్కగానొక్క కొడుకును ధైర్యంగా ప్రజాసేవకు పంపించారు. ఇందుకు ప్రత్యేకంగా ఆమెకు ధన్యవాదాలు చెబుతున్నా. పదేళ్లుగా జగనన్న నుంచి ఎన్నో నేర్చుకున్నాం. నా మీద నమ్మకంతో మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ పదవికి న్యాయం చేయడానికి శాయశక్తులా కృషిచేస్తా. నిజాయితీ, చిత్తశుద్ధి, నిబద్ధతతో కర్తవ్యాలను నిర్వహిస్తా. వెనుకబడిన జిల్లా కర్నూలు అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో కృషి చేస్తా. రాయలసీమ వాసినని గర్వంగా చెప్పుకుంటూ అభివృద్ధి చేసేందుకు పాటుపడతా. 50 ఏళ్ల క్రితం మా తాత ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత నాకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన డోన్ నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు. – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రొఫైల్
పేరు : బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ముద్దుపేరు : (రాజారెడ్డి)
పుట్టిన తేదీ : 27–09–1970 (49 సంవత్సరాలు)
సెల్ : 9000526788
తల్లిదండ్రులు : రామనాథ రెడ్డి, పార్వతమ్మ
భార్య : రూప(గృహిణి)
సంతానం : కుమారుడు అర్జున్ (బీటెక్, సెకండియర్–హైదరాబాద్)
కుమార్తె ఐశ్వర్య(ఎంఎస్ –హైదరాబాద్)
స్వగ్రామం : బేతంచర్ల
కులం : కాపు(రెడ్డి)
చదువు : 1 నుంచి 10వ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, (హైదరాబాద్), ఇంటర్మీడియట్ (మద్రాస్ క్రిస్టియన్ కళాశాల, చెన్నై) బీటెక్ (విజయనగర ఇంజినీరింగ్ కళాశాల, బళ్లారి)
వృత్తి : వ్యవసాయం, వ్యాపారం
రాజకీయ స్ఫూర్తి : బుగ్గన శేషారెడ్డి (జేజినాయన)
ఇష్టమైన ఆటలు : క్రికెట్
ఇష్టమైన నాయకులు : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి
స్వభావం : శాంత స్వభావి
జీవిత లక్ష్యం : ప్రజాసేవ
బలం : నియోజకవర్గ ప్రజలు
మరచిపోలేని సంఘటన : మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం
రాజకీయ నేపథ్యం : 1955లో జేజినాయన బుగ్గన శేషారెడ్డి డోన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తండ్రి రామనాథ రెడ్డి బేతంచర్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా( 1985 నుంచి 1995), అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా మూడేళ్ల పాటు పనిచేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బేతంచర్ల గ్రామపంచాయతీకి 1995 నుంచి 2006 వరకు వరుసగా రెండు సార్లు సర్పంచ్‌గా పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా డోన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 20/01/2018 నుంచి ఇటీవలి వరకు పీఏసీ చైర్మన్‌గా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండోసారి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై 35,644 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
జగనన్న ఆశీర్వాదంతో నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగిస్తున్నారు. రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఆ రోజు ఆయన వెంట నడిచా. పీఆర్‌పీ నుంచి నేను పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ‘నన్ను నమ్ముకో జయరాం’ అని ఆ రోజు వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగనన్న అన్నారు. అప్పటి నుంచి వారి కుటుంబంతోనే ఉన్నా. ఈ రోజు జగనన్న ఆశీర్వాదంతో మంత్రి అవుతున్నందుకు సంతోషంగా ఉంది. నన్ను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఆలూరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కర్నూలు జిల్లా అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా. ప్రధానంగా వలసలను నివారించేందుకు పాటుపడతా. ఆర్డీఎస్, వేదావతి వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తా. ఇక తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటా. – గుమ్మనూరు జయరాం
గుమ్మనూరు జయరాం ప్రొఫైల్
పేరు : పెంచికలపాడు జయరాం
తండ్రి పేరు : పి.బసప్ప
తల్లి : పి.శారదమ్మ
భార్య : పి.రేణుక
కులం : బోయ (వాల్మీకి)
విద్యార్హతలు : పదవ తరగతి
సంతానం : కుమారుడు పి.ఈశ్వర్,ఇద్దరు కుమార్తెలు(ఇద్దరికీ వివాహమైంది.)
పుట్టిన తేదీ : 16/10/1967
సెల్ : 9849939171.
ఆస్తులు : 19 ఎకరాల వ్యవసాయ భూమి
రాజకీయ నేపథ్యం : 1997లో తల్లి పి.శారదమ్మ గుమ్మనూరు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2001లో జయరాం ఏరూరు గ్రామ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2005లో చిప్పగిరి మండల జెడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009 శాసనసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి 1998 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కోట్ల సుజాతమ్మపై 40 వేల ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు.
కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment